తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (2)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (2)

భారతీయులమైన మనకు చాలా భాషలే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన కొన్ని భాషలలో, సంస్కృతం సంస్కృతమే (గీర్వాణము అన్న వేరే మాట కూడాఉంది.
అయితే, ఈ మాట ఇప్పుడు అంతగా ఎక్కువ ప్రచారంలో లేదన్నది వాస్తవం). ఇంకా – హిందీ హిందీనే. కన్నడం కన్నడమే. మళయాలం మళయాలమే.
తమిళానికి అరవం అన్న వేరే మాట ఉందిగాని, ఈ మాట కూడా ఇప్పుడు అంత ఎక్కువ ప్రచారంలో లేదు (తమిళులకు అరవవాళ్ళు అన్న మాట కూడా ఒకప్పుడు
వాడుకలో ఉండినది నిజం. ఇప్పుడంతగా వాడుకలో లేదు). ఇవన్నీ ఇలా ఉండగా, ఒక్క తెలుగు మాత్రమే తెలుగు, ఆంధ్రము రెండూను! ఈ రెండు
మాటలూ ఒకదానికి ఒకటి సమానంగానూ, ఒకదానికన్నా ఒకటి ఏమాత్రమూ తక్కువ కాదన్నట్లుగానూ – జాతి పరంగానూ, మాట్లాడే భాష పరంగానూ,
ఎలా చూసినా సమానార్ధకంగానూ, అప్పుడూ ఇప్పుడూ సమానంగా వాడుకలో ఉన్నాయి! ఇది ఎందుకు ఇలాగ? అని ఆలోచించుకుంటూ పోతే ఇంకాస్త
అయోమయం తప్ప ఒకింత ఆమోదయోగ్యమైన సంగతులను తెలియజేసే సమాచారం ఏదీ ముందుకు ఒక పట్టాన రాదు.

తెలుగును గురించి తెన్ (తెనుగు) – దక్షిణ దిగ్వాచకమనీ, త్రికళింగం పోను పోనూ త్రిలింగం తెలుగు అయిందనీ, త్రిలింగ భూమి కావడం వలన తెలుగు
అయిందనీ, తైలాంగు, తెల్ లేదా తెలీవాహ నదీ తీరప్రాంత వాసులవడం వలన తెలుగువాళ్ళయ్యారనీ… ఇలా వివిధాలయిన వివరణలున్నాయి. ఈ
వివరణలోని సంగతులన్నీ దక్షిణభారతానికి అంటే కృష్ణా గోదావరీ పరీవాహక ప్రాంతాలకూ, కళింగానికి (గోదావరికి  ఉత్తర భూభాగానికి కళింగమన్న పేరు
మొదటినుంచీ వాడుకలో ఉంది) చెందినవి అయి ఉన్నాయి. ఇక ఆంధ్ర ప్రదం ప్రాచీనతను గురించిన మాట ఎప్పుడు ఎక్కడ వచ్చినా సంగతులు (ఋగ్వేద)
బ్రాహ్మణాల కాలం అయిన క్రీ.పూ.1500-1000 ప్రాంతందాకా వెళతాయి. ఋగ్వేదానికి చెందినదైన ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని కథలో వచ్చిన
ఆంధ్ర జాతి ప్రస్తావన ఇంధుకు ఉదాహరణగా చెప్పడం ఇప్పటికి బహుళ ప్రసిధ్ధమై అందరికీ తెలిసినది అయిపోయింది.

శునశ్శేపుని ఉదంతంలో చివరన విశ్వామిత్రుడు తన నూరుగురు కుమాళ్ళలోని మొదటి యాభైమందిని శపించే సందర్భంలో ఈ ఆంధ్ర జాతి ప్రస్తావన వస్తుంది. ఈ
శునశ్శేపుని కథ ఐతరేయబ్రాహ్మణంలో ప్రక్షిప్తమైన కథ అని ఒక మాట కూడా పండిత అభిప్రాయమై ఉంది (A.B. Keith – “Rigveda Brahmanas” 1920, ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి – “చరిత్ర చర్చ” 1989). ఈ అభిప్రాయం ప్రకారం ఇది పురాణాల కాలమైన క్రీ.పూ.3 వ శతాబ్దానికి చెందుతుంది. అంటే ఉత్తరభారతంలో మౌర్యుల పరిపాలనా కాలం అవుతుంది.

యజ్ఞాలలోని వివిధ క్రియలను, అందులో వేద మంత్రాల వినియోగాన్ని గురింది విశద పరిచేవి బ్రాహ్మణాలు. సుయవన పుత్రుడైన అజీగర్తుడు వేద పురోహితుడు.
ఒకానొక సందర్భంలో దురాశపడి 300 గోవులకోసమై కొడుకైన శునశ్శేపుని తనచేతులతోనే నరికి బలి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. కానీ, శునశ్శేపుడు
అజీగర్తుని నుండి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునే కోరికతో విశ్వామిత్రుని అండ చేరుతాడు, అతనిని తండ్రిగా చేసుకునే తలంపుతోనే! ఆ పై సంభాషణ ఇలా
సాగుతుంది:

అజీగర్తుడు: (విశ్వామితుని ఉద్దేశించి) ఓ ఋషీ! నా పుత్రుని నాకు ఇవ్వండి!
విశ్వామిత్రుడు: ఇవ్వను. దేవతలు ఇతనిని నాకు ఇచ్చారు.
ఇట్లా చెప్పి విశ్వామిత్రుడు శునశ్శేపునికి పేరు మార్చి దేవరాత వైశ్వామిత్ర అని నూతన నామకరణం చేస్తాడు. ఆ తరువాత అజీగర్తుడు కొడుకును
బతిమాలుకుంటాడు.
అజీ: (శునశ్శేపుని ఉద్దేశించి) పుత్రా, (తల్లిదండ్రులం) మేమిద్దరం నిన్ని పిలుస్తున్నాం. నీవు అంగిరస అజీగర్త పుత్రుడవు. ఓ ఋషీ! నీవు నీ తండ్రి
తాతల గృహాన్ని విడువవద్దు. మా వద్దకు రమ్ము.
శునశ్శేపుడు: నేను శూద్రుడుకూడా ముట్టని ఆ వస్తువును (కత్తిని) నీ చేతిలో ఉండగా చూశాను. ఓ అంగిరసా! నీవు 300 ఆవులను నా కంటె
ఎక్కువనుకున్నావు.
అజీగర్తుడు: పుత్రా! చేసినదానికి నేను పశ్చాతాప పడుతున్నాను. ఆ పాపాన్ని నివారించుకుని నీకు 100 ఆవులను ఇస్తున్నాను.
శునశ్శేపుడు: ఒకసారి పాపం చేగలిగినవాడు మరొకసారి పాపం చేస్తాడు. నీవు శూద్రత్వం నుండి ముక్తిని పొందలేదు. నీవు చేసిన పాపం ఏ విధంగానూ
నివారింపబడదు.
(ఈ సంభాషణ పాఠాన్ని రాహుల్ సాంకృత్యాయన్ “ఋగ్వేద ఆర్యులు” నుండి తీసుకున్నాను).

ఈ సంభాషణలో అజీగర్తుడు శునశ్శేపుని ‘ఓ ఋషీ!’ అని సంబోధించడాన్ని బట్టి శునశ్శేపుడు అప్పటికే పెద్దవాడని, ఋషిత్వాన్ని పొందినవాడని అర్ధమవుతుంది. (ఐతరేయ బ్రాహ్మణంలోని కొన్ని ఋక్కులు కాడా వసిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, అయాస్యుడు, అజీగర్తుడు, శునశ్శేపుడు – వీరంతా సమకాలీకులని చెబుతాయని పెద్దల వ్రాతలవలన అర్ధమవుతుంది). శునశ్శేపుడిని రక్షించే క్రమంలో విశ్వామిత్రుడు అతనిని తన పుత్రునిగా చేసుకుంటాడు. విశ్వామిత్రునికి అప్పటికే నూర్గురు పుత్రులు. అందులో యాభై మంది మధుఛ్ఛందుని కంటే పెద్దవారు. ఈ యాభై మందీ శునశ్శేపుని దత్తతను, దాని ఫలితంగా శునశ్శేపునికి కలిగే పెద్దరికాన్ని ఒప్పుకోవడానికి అంగీకరించరు. ఇది విశ్వామిత్రునికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఫలితంగా వచ్చిన మాటలలో ఈ యాభై మందీ, వారి సంతానం ఆర్య భూములకావల ‘ఆంధ్ర, పుండ్ర, శబర, పులింద, మూతిబ ఇత్యాది జాతులలో కలిసిపోండ’ని శపిస్తాడు. వారే ఈ జాతుల ప్రజలనీ, ఆర్య జాతి సమ్మేళణం ఈ జాతుల ప్రజలతో జరిగిందనీ ఈ కథ తాత్పర్యం. ఈ ఫలితాన్ని సాధించడానికే ఈ ఉదంతాన్ని ఐతరేయ బ్రాహ్మణంలో ప్రక్షిప్తీకరించడం జరిగిందనీ కూడా అనుకోవాల్సి ఉంటుంది. పురాణాల కాలమైన క్రీ.పూ.3 వ శతాబ్దిలో ఇది జరిగింది అనాలి.

విశ్వామిత్రుని శాప పాఠం పై కూడా భిన్నమైన వివరణలు ఉన్నాయి. “You shall have the lowest castes for your descendants.  Therefore are many of the most degraded classes of men, the rabble for the most part, such as the Andhras, Pundras, Sabaras, Pulindas and Mutibas, descendants of Viswamitra.” అని  Martin Haag….

“Your offspring shall inherit the ends (of the earth).  These are the people the Andhras, Pundras, Sabaras, Pulindas and Mutibas who live in large numbers beyond the borders.  Most of the Dasyus are the descendants of Viswamitra.” అని A.B. Keith ….ఇలా! (“ఆంధ్ర వాఙ్మయారంభ దశ – ప్రథమ సంపుటము – పాఙ్నన్నయ యుగము” దివాకర్ల వెంకటావధాని – 1960).

పురాణాలు (ముఖ్యంగా వాయు, మత్స్య మరియు మార్కండేయ పురాణాలు) ఉత్తర కొంకణాన్ని అపరాంతం అన్నాయి. వింధ్య, సత్పూరా పర్వత శ్రేణులు,
వాటిల్లో పుట్టి ప్రవహించి అరేబియాసముద్రంలో కలిసే నర్మద, తాపీ నదుల తీర ప్రదేశాలలో పుండ్రులు, పుళిందులు, శబరులు జీవనం సాగిస్తుండేవారనీ చెప్పాయి (“Early History of the Dekkan” – R.G. Bhandarkar – 1895). ఈ జాతుల ప్రజలతో కలిపి చెప్పబడిన ఆంధ్రులుకూడా ఆ ప్రాంతం వారే అయి ఉంటారనుకోవడం అసంగతం కాదు. ఇక్కడి ఈ ఆంధ్రులకూ, ఇక్కడి నుండి చూస్తే చాలా దిగువన కృష్ణా గోదావరీ ప్రాంత వాసులై ఉండిన తెలుగు వాళ్ళకు ఏవిధంగా సంబంధం కుదిరింది? వీరిరువురూ ఒకే జాతివారు ఎలాగయ్యారు? వీరిరువురి భాషా ఒకే భాష ఎలాగయ్యింది? ఇవి సందేహాలు, అర్ధంలేనివి కావు.

ప్రకటనలు

6 thoughts on “తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (2)

 1. క్లుప్తంగా–ఆంధ్రులనే తెగవారు ఏవో కారణాల వలన ఉత్తరాదినుంచి మహారాష్ట్రకి,తర్వాత నేటి ఆంధ్రప్రదేశ్ కి వచ్చ్హారు.ఇక్కడ ఉన్న నాగులు మొదలైన జాతులను జయించి ,దేశాన్ని ఆక్రమించి స్థిరపడ్డారు.నాగజాతి కన్యల్ని పెళ్ళాడారు.ఆంధ్రుల ప్రాకృతం ,స్థానిక భాషలు కలిసి తెలుగుభాష ఏర్పడింది.ఆంధ్రరాజులు పాలించే భూమి లోని భాష కాబట్టి తెలుగుకి ఆంధ్ర భాష అని కూడా పేరు వచ్చింది.ఇలాంటివి చరిత్రలో ఎన్నో జరిగాయి.ఇందులో వింత ఏమీ లేదు.ఉదాహరణకి; దేశం ,కేరళ (చేర ) భాష మళయాళం .దేశం బ్రిటన్ ,భాష ఇంగ్లిష్ .దేశం పాకిస్తాన్ ,భాష ఉర్దూ.

  • మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు, రమణారావు గారూ!
   మీ వ్యాఖ్యలో మీరు చెప్పినవన్నీ ఇప్పుడు లభ్యమౌతున్న పుస్తకాల్లో ఉన్న సంగతులే! వీటిని అప్పుడే నేను కాదనే సాహసం చేయను గాని, వీటిలో చాలా మటుకు ఊహాజనిత నిర్ధారణలేమో అన్న అనుమానాన్ని మాత్రం వ్యక్తం చేస్తాను. ఉదాహరణకి, “ఆంధ్రుల ప్రాకృతం, స్థానిక భాషలు కలిసి తెలుగుభాష ఏర్పడింది” – ఇలాంటి వాక్యాన్ని నేను వ్రాయడానికి ప్రయత్నిస్తే, వ్రాయడనికి ముందు నాకు చాలా సందేహాలొస్తాయి. ఒకటి – ఆంధ్రుల ప్రాకృతం (ఆంధ్రుల భాష ప్రాకృతమా? అయితే ఎప్పటినుంచి ఎప్పటిదాకా? మాతృభాషను వేరే భాషకు ఒదులుకునే దయనీయ స్థితికి వాళ్ళు ఏ పరిస్థితులలో దిగజారారు?). రెండు – స్థానిక భాషలు (ఏమిటీ స్థానిక భాషలు? వీటి పేర్లేమిటి? అవి ఇప్పుడు ఉన్నాయా, లేవా? తెలుగులో ‘కలిసిపోయిన’ ప్రాకృతం ఉండగా ఇవి ఎట్లా లేకుండా పొయ్యాయి?). మూడు – కలిసి (భాషలు కొన్ని ‘కలిసి’ వేరే ఇంకొక కొత్త భాష ఏర్పడడం అనేది ఇప్పుడు ఊహకు కూడా అందని విషయం. తెలుగు అనే భాష ఏర్పడడానికి ఈ ‘కలియడం’ అన్నది అప్పుడు అంత సులభంగా జరిగిందా? జరిగితే ఆ సౌలభ్యానికి సహకరించిన పరిస్థితులు ఏవి, ఎలాంటివి?)…ఇలాంటివి సందేహాలు చాలా వచ్చి ఆ వాక్యం వ్రాయడం అన్నది ఆదిలోనే ఆగిపోతుంది. ఒక విధంగా ఇలాంటివే సందేహాలను తీర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ పోస్టుల పరంపర. మీ వ్యాఖ్యకు మరోసారి ధన్యవాదాలు!

 2. నేను భాషాశాస్త్రజ్ఞుడిని కాను.కాని కొన్ని విషయాలు చదివి కొద్దిగా తెలుసుకొన్నాను.పుల్లెల శ్రీరామచంద్రుడు గారి ప్రాకృతం వంటి పుస్తకాలు చదివితే కొంత తెలుస్తుంది.ప్రాకృతంలో కూడా మాండలికాలు ఉండి ఆయా ప్రాంతాల్లో వేరువేరు భాషలు ఏర్పడ్డాయి.కనీసం 2000 సం.క్రితం భాషాస్వరూపాలు ఎలా ఉండేయో?ఐతే దయనీయస్థితి ఏముంది?వివిధ జాతుల సమ్మేళనం వలన వారి భాషలు కూడా మిళితమై కొత్త భాష ఏర్పడిన సంఘటనలు చరిత్రలో ఉన్నాయి కదా.మీ సందేహాలకి సమాధానాలు యూనివర్సిటీల్లో భాషాశాస్త్రజ్ఞులనే అడగవలసి ఉంటుంది.

 3. చాలా ఆసక్తికరమయిన విషయాలను పంచుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే నా సందేహాలకు సమాధానాలు దొరుకుతున్నాయి. తరువాతి టపా కోసం చూస్తూ….

 4. Venkat b. rao, M.V Ramanaraoగారు
  చాలా బాగా చర్చిస్తున్నారు.

  రమణారావుగారు..
  చిన్న సమాచారం కావాలి. //వివిధ జాతుల సమ్మేళనం వలన వారి భాషలు కూడా మిళితమై కొత్త భాష ఏర్పడిన సంఘటనలు చరిత్రలో ఉన్నాయి // అన్నారు. ఉదహరింపులు ఇవ్వగలరా..?

  ఆంధ్రులు అనబదే వారు ఉత్తరం నుండి వచ్చారని చాలామంది చెబుతున్నదే. వారి భాష ప్రాకృతమే కావచ్చు. సంస్కృతమే కావచ్చు. తదనంతర కాలంలో తెలుగువారితో కలిసిపోయారనేది బహుశా, నిర్వివాదాంశం. బహుశా, శాతవాహనుల కాలమే తెలుగులోకి తత్సమాలు, తత్భవాలు చేరిన కాలం అవుతుంది. అయితే, అప్పటికే తెలుగు పరిణితి చెందిన భాషగా ఉందని మనం ఇంకోసారి గుర్తు చేసుకోవాలి. అదలా ఉంచితే, “ఆంధ్ర భాష” అనే పేరు, ఆంధ్రులు తెలుగువారితో పూర్తిగా కలిసిపోయిన తర్వాత జరిగిన పరిణామం కావచ్చు. అప్పుడు మాత్రమే, తెలుగు భాష, “ఆంధ్ర భాష” అని పిలువబడగలదు. ఇప్పటి రోజుల్లో ఈ పరిణామం జరగడానికి 4-5 తరాలు పడుతుందని అంటున్నారు. పాత రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ తరాలే పట్టేది. అందువల్ల శాతవాహనుల రాజధాని ధాన్యకటకానికి మారిన నాలుగు – ఐదు వందల సంవత్సరాలకి గానీ వారు పూర్తిగా తెలుగువారు అయి ఉండకపోవచ్చు.

  తెలుగుని, “ఆంధ్రం” అనే ఎందుకు పిలిచారు సంస్కృత సాహిత్యంలో..? అని అలోచిస్తే, నాకు తోచిన తర్కం ఇది. తెలుగునాట, సంస్కృత సాహిత్యంతో సంబంధాలు కలిగినవారు, తక్కిన భారతీయుల దగ్గర కొద్దో గొప్పో పరిచయమున్నవారు “ఆంధ్రులు” (తెలుగులు,యక్షులు, నాగులు వంటి స్థానిక తెగల కన్నా), కారణం వారు ఉత్తరాది నుండి వచ్చినవారు కాబట్టి. అదే తర్కం, ముస్లింలకి కూడా అన్వయించవచ్చు, ముస్లింలు మనదేశాన్ని “హిందుస్తాన్” అని పిలుస్తారు, అదే పిలుపు పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ , అరబ్ దేశాల్లో కూడా ఉంటుంది, లేదా ఇండియా అని పిలుస్తారు తప్ప “భారత్” అని పిలిచేవారు చాలా అరుదు. అది అలా అలవాటైపోయి ఉండొచ్చు. లేదా వారి గ్రంథాలలో అదే పేరున ప్రస్తావించి ఉండొచ్చు.

  ఇహ, పైన రమణారావుగారు పాకిస్తాన్ – ఉర్దూ అన్నారు. అది తప్పనుకుంటున్నా. పాకిస్తాన్ లో అతి పెద్ద భాష పంజాబీ (షాహ్ ముఖీ లిపిలో, సుమారు 40% మందికి మాతృభాష ), తర్వాతది సింధీ. ఉర్దూ అధికార భాషగా ఎందుకు చేసుకున్నారో వాళ్ళకే తెలియాలి. మనదేశంలో సుమారు అంతే మంది ఉన్న హిందీని అధికార భాష చేసుకున్నాం. మన రెండు దేశాలకీ ఉన్న తేడాలలో ఇదీ ఒకటి.

 5. 1.ఆంధ్ర సాతవాహనులు 400 సం.పాలించుటచేత దేశాన్ని ఆంధ్రదేశం అని,అక్కడి భాషని ఆంధ్రభాష అనీ అన్నారు.తెనుగు,తెలుగు ,ఆంధ్రం పర్యాయపదాలు.ఒకే దేశాన్ని,ఒకే భాషనీ సూచిస్తాయి.
  2.అనేక భాషలు,జాతులు సమ్మిళితమైనప్పుడు ఒక కొత్తభాష ఏర్పడవచ్చును.మన తెలుగు,కన్నడము అందుకు ఉదాహరణలు.ఇండొనీసియన్ ,కంబోడియన్ భాషలు,జెర్మన్ భాషలు కూడా ఉదాహరణలే.ఉర్దూ కూడా అలాగే ఏర్పడింది.
  3.పాకిస్తాన్లో పంజాబీ,సింధీ వంటి భాషలున్నా అధికారభాష ఉర్దూయే కదా.
  4.చాలా భాషల్లో ముందు మౌఖిక సాహిత్యం వస్తుంది.కొంతకాలం తర్వాతే గ్రంథ లిఖిత సాహిత్యం వస్తుంది.తెలుగులో క్రీ.శ.5,6,శతాబ్దులనుంచి శాసనాల్లో తెలుగు కనిపిస్తుంది.11 వశతాబ్దిలో మొదటి గ్రంథం నన్నయగారి భారతం.ఇంగ్లీష్ లో మొదటి గ్రంథం 15వ శతాబ్దిలో చ్హాసర్ రచించిన canterburytales .అంతకు ముందు ballads అనిబుర్రకథల్లాంటి పాటల సాహిత్యం ఉండేది.
  ఈ వ్రాసింది నా స్వంతం కాదు.మారేపల్లి రామకృష్ణ శాస్త్రి,భద్రిరాజు కృష్ణమూర్తి ,ఫిలిప్స్ బ్రౌన్,ఆరుద్ర,వంటి పరిశోధకులు,పండితులు వ్రాసినవి.Encyclopedia Britannica వంటి ప్రామాణిక గ్రంథాల్లో కూడా చూడ వచ్చును.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s