తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (3)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (3)

వేదాలకు సంబంధించిన పరిభాషలో ‘బ్రహ్మ’ అంటే మంత్రమనీ, వేదమంత్రాల వినియోగాన్ని విశదీకరించి, వివరించేవి కాబట్టి బ్రాహ్మణాలని పెద్దలు చెబుతారు. ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదానికి చెందినది. సోమయాగ నిర్వాహణకు సంబంధించిన విషయాల విశదీకరణ ఐతరేయ బ్రాహ్మణానికి ప్రథాన విషయం. ఇది ఏకవ్యక్తికృతమనీ, ఆ వ్యక్తి మహీదాస ఐతరేయుడనీ సంప్రదాయ వచనం. ఇందులోని విషయం మొత్తం నలభై అధ్యాయాలుగా విభజించబడింది. ఈ నలభై అధ్యాయాలూ మళ్ళీ ఒక్కొక పంచికకు ఐదు అధ్యాయాలు చొప్పున ఎనిమిది పంచికలుగా అమర్చబడింది. ఈ ఎనిమిది పంచికలలో చివరి రెండు పంచికలు, అంటే ఏడు, ఎనిమిది పంచికలు (చివరి పది అధ్యాయాలు) భాష పరంగానూ, అందులోని విషయం పరంగానూ చూస్తే, అర్వాచీనకాలికాలనీ, ప్రక్షిప్తాలనీ పెద్దలు చెబుతారు. (A.B. Keith – “Rigveda Brahmanas” 1920;  మల్లాది సూర్యనారాయణ శాస్త్రి – “సంస్కృత వాఙ్మయ చరిత్ర – ప్రథమ సంపుటం – వేద వాఙ్మయం” – ప్రథమ ముద్రణ 1936). ఇందులోని ఏడవ పంచికలో శునశ్శేపుని వృత్తాంతం ఉంది.

అప్పటిలో జనశ్రుతిలో ఉన్న శునశ్శేపుని కథను, ఆంధ్ర పుండ్ర పుళిందాది జాతుల ఉనికికి నిదర్శనంగానూ, ఉత్పత్తికి సంబంధించిన కథగానూ ఐతరేయ బ్రాహ్మణానికి అనుసంధానం చేయబడి చెప్పబడింది. ఆంధ్రుల ప్రాచీనత్వానికి సంబంధించిన మాట ఎప్పుడు వచ్చినా, ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని వృత్తాంతాన్ని నిదర్శనంగా చూపి, చరిత్రలో ఆంధ్రుల ఉనికి ఇక్కడినుంచి ఉందన్నది చెప్పబడిందే తప్ప, ఈ వృత్తాంతానికి సంబంధించిన సాంఘిక నేపథ్యాన్ని, ఇందులో ఆంధ్రుల ప్రస్తావన రావడానికి దారి తీసిన పరిస్థితులను కాస్తంతైన critical గా అన్వీక్షించే ప్రయత్నం జరిగినట్లుగా నేను చదివినంతలో నా దృష్టికి రాలేదు. శునశ్శేపుని వృత్తాంతంలో ఆంధ్ర పుండ్ర పుళిందాది జాతుల ఉనికికి సంబంధించిన నిర్ధారణ తప్ప వేరే తెలియదగింది ఏమీ లేదా?! అన్నది నా ప్రశ్న, సందేహం.అంతమాత్రమే కాదేమో! అని నా అనుమానం.

A.B. Keith గారి అభిప్రాయం ప్రకారం ఐతరేయబ్రాహ్మణ రచనా కాలం క్రీస్తుపూర్వం ఎనిమిదివందల సంవత్సరములకంటే అనంతరం కాదు, అలాగే అందులోని ప్రక్షిప్తాల రచనా కాలం క్రీస్తుపూర్వం మూడువందల సంవత్సరముల కంటే తరువాత కాదు. స్థూలంగా ఈ కాల నిర్ణయం పండితులందరి ఆమోదాన్ని పొందింది కూడా! అయితే, క్రీ.పూ.300 సంవత్సరాల కాలం నాటికే ఆంధ్ర సామ్రాజ్యం ఉన్నత దశలో ఉన్నట్లూ, ఆంధ్ర సామ్రాజ్యంలో అప్పుడు 30 దుర్గాలూ, ఒక లక్ష కాల్బలమూ, రెండువేల అశ్వములు, వేయి ఏనుగుల బలము ఉన్నట్లు మౌర్యసామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తమౌర్యుని ఆస్థానంలో రాయబారి గా ఉన్న మెగాస్తనీసు వ్రాతలను బట్టి తెలుస్తుందని ఆంధ్ర చరిత్రకారులలో శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు మొదలైనవారు వ్రాశారు (తెలుగు విజ్ఞాన సర్వస్వం, మూడవ సంపుటం). ఇందువలన, అప్పటికే ఒక సామ్రాజ్య నిర్మాతలైన ఆంధ్రులను గురించి అదే కాలంలో ప్రక్షిప్తీకరించినదిగా చెప్పబడుతూన్న, అంగీకరించబడుతూన్న శునశ్శేపుని కథలో ఆంధ్రులు నీచజాతికి చెందినవారుగానూ, సాంస్కృతికంగా అథములుగానూ ఎందుకు వర్ణించబడ్డారు? (ఐతరేయబ్రాహ్మణంలోని ఈ భాగానికి చెందిన వ్యాఖ్యలలోని ఒక వ్యాఖ్యలో విశ్వామిత్రుడు వీళ్ళను “మీ సంతానం అభక్ష్య భక్షణం చేయుగాక” అని శపించినట్లుగా కూడా చెప్పబడింది (రాహుల్ సాంకృత్యాయన్ – ఋగ్వేద ఆర్యులు)). ఆర్య ఋషి అయిన విశ్వామిత్రుడు ఆంధ్ర తదితర జాతికి చెందిన వారలను, వారి జీవన పధ్ధతులను ఇంతగా గర్హించడానికి కారణం ఏమిటి? ఇది అర్ధం కావాలంటే కాలంలో కొన్ని శతాబ్దాలు వెనకకు వెళ్ళి, మూలాలనుంచి స్థూలంగానైనా సమీక్షించుకుంటూ రావాలి.

హరప్ప-మొహెంజొదారొ కాలం నాటి  సాంఘిక నేపథ్యానికి (social setting కి) పూర్తిగా భిన్నమైన సాంఘిక నేపథ్యాన్ని (social setting ని) ఋగ్వేదం భారత దేశానికి ఇచ్చింది. హరప్ప-మొహెంజొదారొ లు ఒక గుర్తుగా నిలిచిన సింధు నాగరికత వర్ధిల్లిన కాలం క్రీ.పూ.2600 నుండి క్రీ.పూ.1750 ధాకా. ఈ మధ్య కాలంలో – కనిపించే నిజం, మనిషి, అతని శరీరం చేసే శ్రమ (అటు భూమిని నమ్ముకుని గానీ, లేక ఇటు వర్తకాన్ని నమ్ముకుని గానీ), శ్రమ మీద నమ్మకం, శాంతి – ఇవే ప్రధానంగా ఉండి అప్పటి జీవనం గడిచిందని పురావస్తు తవ్వకాలలో బయటపడ్డ అవశేషాల విశేషాలు, అధారాలు చెబుతాయి. ఋగ్వేదం దీనిని పూర్తిగా మార్చి వేసింది. మనిషి శ్రమ కన్నా, దైవం – దైవ కృప, దానికోసం ప్రార్ధన, యజ్ఞం, కనిపించే నిజాన్ని కాదని కనిపించని నిజం కోసం తపన, యోచన, యుధ్ధం, జయం, జయం కోసం తపన, భయం – ఇవి ముఖ్యమైన విలువలుగా మారాయి. ఇదే అప్పటికి ఆధునికతగా, సంస్కృతిగా చెప్పబడింది, అయింది.  ఇందులో ఒదగని ప్రతిదీ, హేయమైనది, గర్హ్యమైనదీ అయింది. దీనికి ప్రాతినిధ్యం వహించే ఋగ్వేద పూర్వపు సంస్కృతికి చెందిన జాతుల, తెగల జనులు దస్యులయ్యారు. ఆ కారణంగా దమనానికి అర్హులయ్యారు. తొలి రోజులలో వేద సంబంధ క్రతువులన్నిటిలోనూ హింస ఉంది. ఒక ఉత్సవంగా జరిగిన హింస ఇది. ఆ నాగరికతలో ఇది అంతర్భాగం. ఆడుతూ పాడుతూ ఆహ్లాదంలో జరిపిన హింస ఇది. ఒక సహస్రాబ్దం పైగానే ఇది కొనసాగింది. మొదలవడం జంతువులతోనే అయినా, ఇది పోనుపోనూ నరమేధం అన్న ప్రక్రియ దాకానూ వెళ్ళింది (ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని వృత్తాంతమే దీనికి నిదర్శనం). ఇది పరాకాష్ఠ. క్రీ.పూ.6వ శతాబ్దం ఉత్తరార్ధంలో గౌతముడు బుధ్ధుడై ఈ హింసను నిరసించి అహింసను ప్రబోధించడంతో దీనికి ప్రభావవంతమైన అడ్డుకట్ట పడింది. అప్పటికే ఈ సంస్కృతితో విసిగి వేసారి ఉన్న సామన్యులు తండోపతండాలుగా బుధ్ధుని ప్రబోధనలకు ఆకర్షితులై ఆ వైపు మరలడంతో నిరసన ప్రత్యక్షంగానూ, బహిరంగంగానూ వ్యక్తమైంది. వేదం ఏ సంస్కృతినైతే ఆచరణలో పెట్టిందో, ప్రబోధించిందో ఆ సంస్కృతితో పాటు, ఆ సంస్కృతికి సంబంధింధిన భాష అయిన సంస్కృతమూ నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టివేయబడ్డాయి. సామన్యుడి బాష అయిన పాలీ, ప్రాకృతాలకు జనాదరణ బాగా పెరిగింది. బుధ్ధుని బోధనలన్నీ పాలీ భాషలోనే గ్రంథస్తం చేయబడినాయి. ప్రజలే కాక ప్రభువులూ దీనిని అనుసరించక తప్పలేదు. ఆ ప్రభువువులలో ఒకరు  ఆంధ్రులు. బౌధ్ధాన్ని నిస్సంకోచంగా అనుసరించారు. అయితే, బుధ్ధుడు విష్ణుమూర్తి అవతారాలలో ఒక అవతారంగా చేయబడినట్లుగానే, ఆంధ్రులు విశ్వామిత్రుని అర్ధ సంతానం (తొలి యాభై మంది) లో అగ్రగణ్యులుగా శునశ్శేపుని కథ ద్వారా చేయబడడం అన్నది ఇక్కడ ఇంకొక ఆసక్తిని రేకెత్తించే అంశం!

బౌధ్ధం రంగ ప్రవేశం తరువాత, ఆ కాలంలో ఆర్య సంస్కృతి ఆదరణ కోల్పోవడం అన్నది, అందులో హింసకు సంబంధించి అభిప్రాయ బేదాలు తలెత్తడ మన్నది, తత్ఫలితంగా ఆర్య గణాలలో (జనాలలో) ఏర్పడిన వేర్పాటు (division) అన్నది వ్యూహాత్మకంగా శునశ్శేపునిని కథ ద్వారా చెప్పబడిందని నేననుకుంటాను. విశ్వామిత్రునికి వందమంది సంతానం అన్నది, అందులో మధుఛ్ఛందసుని కంటే పెద్దవారు ఆయన నిర్ణయాన్ని ధిక్కరించడమన్నదీ, వారు పోను మధుఛ్ఛందసుని తరువాతి యాభైమంది పుత్రులూ అతడి నిర్ణయాన్ని ఆమోదించి అనుసరించడమన్నదీ ఆర్యులలో చీలికను వ్యూహాత్మకంగా చెప్పడమే అనుకుంటాను. విశ్వామితుడు ఈ కథలో ఒక వ్యక్తి కాదు, ఆ సంస్కృతి మొత్తానికీ ప్రతినిధి! ఆయన ప్రాతినిధ్యం వహించిన సంస్కృతిని ధిక్కరించిన జాతులలో ప్రప్రథమంగా వినిపించే పేరు ఆంధ్రులది!

ప్రకటనలు

3 thoughts on “తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (3)

 1. I dont think Buddhism has got its attraction because of its principles. Whatever the basis they have, those were told in our Hinduism. As Hinduism was in bad shape at that time, people were attracted to Buddhism. (Anyways not like today’s Christianity in India, though! Here money matters!)

  But once with the incarnation of Jagadguru Shankaracharya, Buddhism was answered with our scriptures’ intellctual values. Here, point to be noted is… in the era of Shankaracharya, Buddhism’s violence and their rules and way of life were too much! May be, its the time or correct time Shankaracharya came!

  Chandu

  • గౌతమ బుధ్ధుడు క్రీ.పూ.6వ శతాబ్ది. (ఆయన నిర్యాణం క్రీ.పూ.486 లో). శంకరాచార్యులవారు క్రీ.శ.788-820. వీరిరువురికీ మధ్య 1300 సంవత్సరాల కాలం గతించింది. బుధ్ధుడు ఉన్నప్పుడు బుధ్ధుని బోధనలకే ప్రజలు ఆకర్షితులయ్యారు. అప్పుడున్న పరిస్థితులలో He was a phenomenon, a freshness, in a way comparable to Jesus Christ! His teachings were simple…they were easy to understand and importantly they did not call for any complex metaphysical thinking! ప్రపంచం అంతా దుఃఖం చేత నిండి వుంది; ఈ దుఃఖం కోరికల వలన, విషయ వాంచల (desire) వలన కలుగుతుంది; ఈ కోరికనూ, విషయ వాంచనూ జయిస్తే జీవితాన్నించి సజావయిన ముక్తి దొరుకుతుంది; ఈ విషయవాంచను జయించడమన్నది నియమబధ్ధంగా బతకడం వలన సాధ్యమవుతుంది – ఇవి క్లుప్తంగా బుధ్దుని బోధనలు. అర్ధంగాని వేదమంత్రాలనూ, వేద సంబంధ బోధనలనూ వినివిని విసుగెత్తిపోయి ఉన్న అప్పటి (క్రీ.పూ.6వ శతాబ్దం నాటి) మామూలు మనుషుల చెవులకు, సరళమైన వాళ్ళకు అర్ధమయే భాషలో ఉన్న ఈ బోధనలు కర్ణపేయంగా ఉండివుంటాయనుకోవడం అతిశయోక్తి కాదు. వేదాలు చాలా భాగం కర్మకాండ సంబంధ సంగతులు. హిందూ మతానికి సంబంధించిన తాత్త్విక భూమిక అంతా ఉపనిషత్తులలో ఉంది. వేదాలు, బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు….ఇది వరస. ఇందువలననే వేదాంతం అనే మాట వ్యవహారంలోకి వచ్చింది. ఈశావాస్య మిదం సర్వం – ప్రపంచమంతా ఈశ్వర మయం – అని మొదలవుతుంది ఈశావాశ్య ఉపనిషత్తు. ప్రపంచమంతా ధఃఖ మయం అని బుధ్ధుడు. బుధ్దుని బోధన లన్నిటికీ తాత్త్విక భూమిక ఈ దుఃఖమే! ఈ రెండింటికీ పోలికే లేదు! అదలా ఉంచితే, బుధ్ధుని కాలంలో బుధ్ధిజానికి(నిజానికి బుధ్ధుని కాలంలో ఇవి బోధనలు మాత్రమే! ఒక ‘ఇజం’ స్థాయికి ఇంకా చేరుకోలేదనే అనాలి!), బుధ్ధుని నిర్యాణానంతర బుధ్ధిజానికీ (మహాయాన, హీనయాన….) తేడావుంది. అలాగే,బుధ్దుని కాలంనాటికి ఉన్నది హిందూమతం కాదు. అది వేదమతం. ఆ తరువాతి కాలంలో అందులోని పధ్ధతులను (practices) కొన్నిటిని ఒదులుకుని ఇప్పుడున్న హిందూమతం అయింది! నేను పుస్తకాలలో చదివినంతలో నాకు తెలిసింది ఇది!

   Thanks for commenting!

   • మరి… అంత సరళమైన బుద్ధ-వాక్యాలు ఎందుకు ప్రజాదరణ నోచుకోలేదు తరువాత తరువాత?
    ప్రతీ మనిషికీ… “కొత్త ఒక వింత. పాత ఒక రోత.”
    మీరే అన్నారు గా… (అర్ధంగాని వేదమంత్రాలనూ, వేద సంబంధ బోధనలనూ వినివిని విసుగెత్తిపోయి ఉన్న అప్పటి (క్రీ.పూ.6వ శతాబ్దం నాటి) మామూలు మనుషుల చెవులకు……..etc etc.)

    మీరు అన్న ఈ పై మాటలు చాలా ఖండించదగినవి. మీరు అలా అస్సలు చెప్పి ఉండకూడదు.
    బుద్ధుడు జనాలందరికీ ఏదో మీ మాత్రుభాషలో చెప్పినట్టు… సరళమైనవి… అంటారేంటి? యె కార్యానికైనా… భాష్యం ఉంటుంది. వేదాలకి కూడా భాష్యం ఉంది. కావాలంటే వాటిని చదువుకోని అర్ధం చేసుకోవచ్చు.

    వేదాలు ఎంత పురాతన కాలంనాటివి? అవి ఈ క్రీ.శ కాలం వాళ్లకి ఎలా అర్ధం ఔతాయి? ఎంత గొప్ప విషయానికైనా కాల క్రమేణా జనాదరణ తగ్గుతుంది. ఎంతమంది భారతదేశాన్ని దోచుకోని, దుర్మార్గంగా మన జాతిని, సంస్కృతిని నాశనం చేశారు? చివరికి ఇది మనకి మిగిలింది – మీరు అన్న అర్ఢం కాని వేదాలు. బుద్ధి ఉండాలి ఈ మాట అనటానికి.

    అంత ఎందుకు? క్రిస్టియానిటీ వచ్చి ఎన్ని శతాబ్దాలు? అది పుట్టిన దేశం లో నే దాని విషయం సరిగ్గా లేదు. ఇంక అమెరికా, వేరే దేశాలు సరే సరి. వాళ్లు మన కర్మ సిద్ధాంతాన్ని నమ్మినట్టు మనం కూడా నమ్మ. అదే… మన దేశం లో క్రిస్టియానిటీ… వావ్… ఏం చెప్పను… డబ్బులు, మత మార్పిడులు, బెదిరింపులు, ఆశ చూపించటం…!

    క్రీ.పూ నాటి పునాది ఉన్న ఇప్పటి హిందూ మతం నిజం గా ఇన్నేళ్లు నడిచి… బట్ట కదుతుంది అంటే… అర్ఢం కాని మంత్రాల వల్లనే. అవి మంత్రాలు కాదు. వాటి అర్ఢం ఈ ప్రదేశాలలో ప్రకృతికి తెలుసు. మన భూమి కి తెలుసు.

    వేదాలను, ఉపనిషత్తులని గేలి చేయటం కామెడీ ఐపోయింది జనాలకి.
    మళ్లీ ఇంకొక గొప్ప విషయం. మన ఇండియా లోనే ఇలా జరుగుతుంది.
    మన అంబేడ్కర్ బౌద్ధుడు కాబట్టి, ఆయన జన్మ దినాన, ప్రజలు వేలం వెర్రి గా బుద్ధిజం లోకి మరతారు.

    మతాన్ని అర్ఢం చేసుకోని ఆచరించాలి. మతం మారేది కాదు. ఆచరించవలసినది.
    మతం అమ్మ. అమ్మ ని మార్చుకోకూడదు. ఎవడో వెధవ డబ్బులిస్తే వెళ్ళి చేరకూడదు.

    ఇంకా ఇంకా చాలా చెప్పాలి. అవి నా బ్లాగ్ లో రాస్తా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s