తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (2)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (2)

భారతీయులమైన మనకు చాలా భాషలే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన కొన్ని భాషలలో, సంస్కృతం సంస్కృతమే (గీర్వాణము అన్న వేరే మాట కూడాఉంది.
అయితే, ఈ మాట ఇప్పుడు అంతగా ఎక్కువ ప్రచారంలో లేదన్నది వాస్తవం). ఇంకా – హిందీ హిందీనే. కన్నడం కన్నడమే. మళయాలం మళయాలమే.
తమిళానికి అరవం అన్న వేరే మాట ఉందిగాని, ఈ మాట కూడా ఇప్పుడు అంత ఎక్కువ ప్రచారంలో లేదు (తమిళులకు అరవవాళ్ళు అన్న మాట కూడా ఒకప్పుడు
వాడుకలో ఉండినది నిజం. ఇప్పుడంతగా వాడుకలో లేదు). ఇవన్నీ ఇలా ఉండగా, ఒక్క తెలుగు మాత్రమే తెలుగు, ఆంధ్రము రెండూను! ఈ రెండు
మాటలూ ఒకదానికి ఒకటి సమానంగానూ, ఒకదానికన్నా ఒకటి ఏమాత్రమూ తక్కువ కాదన్నట్లుగానూ – జాతి పరంగానూ, మాట్లాడే భాష పరంగానూ,
ఎలా చూసినా సమానార్ధకంగానూ, అప్పుడూ ఇప్పుడూ సమానంగా వాడుకలో ఉన్నాయి! ఇది ఎందుకు ఇలాగ? అని ఆలోచించుకుంటూ పోతే ఇంకాస్త
అయోమయం తప్ప ఒకింత ఆమోదయోగ్యమైన సంగతులను తెలియజేసే సమాచారం ఏదీ ముందుకు ఒక పట్టాన రాదు.

తెలుగును గురించి తెన్ (తెనుగు) – దక్షిణ దిగ్వాచకమనీ, త్రికళింగం పోను పోనూ త్రిలింగం తెలుగు అయిందనీ, త్రిలింగ భూమి కావడం వలన తెలుగు
అయిందనీ, తైలాంగు, తెల్ లేదా తెలీవాహ నదీ తీరప్రాంత వాసులవడం వలన తెలుగువాళ్ళయ్యారనీ… ఇలా వివిధాలయిన వివరణలున్నాయి. ఈ
వివరణలోని సంగతులన్నీ దక్షిణభారతానికి అంటే కృష్ణా గోదావరీ పరీవాహక ప్రాంతాలకూ, కళింగానికి (గోదావరికి  ఉత్తర భూభాగానికి కళింగమన్న పేరు
మొదటినుంచీ వాడుకలో ఉంది) చెందినవి అయి ఉన్నాయి. ఇక ఆంధ్ర ప్రదం ప్రాచీనతను గురించిన మాట ఎప్పుడు ఎక్కడ వచ్చినా సంగతులు (ఋగ్వేద)
బ్రాహ్మణాల కాలం అయిన క్రీ.పూ.1500-1000 ప్రాంతందాకా వెళతాయి. ఋగ్వేదానికి చెందినదైన ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని కథలో వచ్చిన
ఆంధ్ర జాతి ప్రస్తావన ఇంధుకు ఉదాహరణగా చెప్పడం ఇప్పటికి బహుళ ప్రసిధ్ధమై అందరికీ తెలిసినది అయిపోయింది.

శునశ్శేపుని ఉదంతంలో చివరన విశ్వామిత్రుడు తన నూరుగురు కుమాళ్ళలోని మొదటి యాభైమందిని శపించే సందర్భంలో ఈ ఆంధ్ర జాతి ప్రస్తావన వస్తుంది. ఈ
శునశ్శేపుని కథ ఐతరేయబ్రాహ్మణంలో ప్రక్షిప్తమైన కథ అని ఒక మాట కూడా పండిత అభిప్రాయమై ఉంది (A.B. Keith – “Rigveda Brahmanas” 1920, ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి – “చరిత్ర చర్చ” 1989). ఈ అభిప్రాయం ప్రకారం ఇది పురాణాల కాలమైన క్రీ.పూ.3 వ శతాబ్దానికి చెందుతుంది. అంటే ఉత్తరభారతంలో మౌర్యుల పరిపాలనా కాలం అవుతుంది.

యజ్ఞాలలోని వివిధ క్రియలను, అందులో వేద మంత్రాల వినియోగాన్ని గురింది విశద పరిచేవి బ్రాహ్మణాలు. సుయవన పుత్రుడైన అజీగర్తుడు వేద పురోహితుడు.
ఒకానొక సందర్భంలో దురాశపడి 300 గోవులకోసమై కొడుకైన శునశ్శేపుని తనచేతులతోనే నరికి బలి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. కానీ, శునశ్శేపుడు
అజీగర్తుని నుండి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునే కోరికతో విశ్వామిత్రుని అండ చేరుతాడు, అతనిని తండ్రిగా చేసుకునే తలంపుతోనే! ఆ పై సంభాషణ ఇలా
సాగుతుంది:

అజీగర్తుడు: (విశ్వామితుని ఉద్దేశించి) ఓ ఋషీ! నా పుత్రుని నాకు ఇవ్వండి!
విశ్వామిత్రుడు: ఇవ్వను. దేవతలు ఇతనిని నాకు ఇచ్చారు.
ఇట్లా చెప్పి విశ్వామిత్రుడు శునశ్శేపునికి పేరు మార్చి దేవరాత వైశ్వామిత్ర అని నూతన నామకరణం చేస్తాడు. ఆ తరువాత అజీగర్తుడు కొడుకును
బతిమాలుకుంటాడు.
అజీ: (శునశ్శేపుని ఉద్దేశించి) పుత్రా, (తల్లిదండ్రులం) మేమిద్దరం నిన్ని పిలుస్తున్నాం. నీవు అంగిరస అజీగర్త పుత్రుడవు. ఓ ఋషీ! నీవు నీ తండ్రి
తాతల గృహాన్ని విడువవద్దు. మా వద్దకు రమ్ము.
శునశ్శేపుడు: నేను శూద్రుడుకూడా ముట్టని ఆ వస్తువును (కత్తిని) నీ చేతిలో ఉండగా చూశాను. ఓ అంగిరసా! నీవు 300 ఆవులను నా కంటె
ఎక్కువనుకున్నావు.
అజీగర్తుడు: పుత్రా! చేసినదానికి నేను పశ్చాతాప పడుతున్నాను. ఆ పాపాన్ని నివారించుకుని నీకు 100 ఆవులను ఇస్తున్నాను.
శునశ్శేపుడు: ఒకసారి పాపం చేగలిగినవాడు మరొకసారి పాపం చేస్తాడు. నీవు శూద్రత్వం నుండి ముక్తిని పొందలేదు. నీవు చేసిన పాపం ఏ విధంగానూ
నివారింపబడదు.
(ఈ సంభాషణ పాఠాన్ని రాహుల్ సాంకృత్యాయన్ “ఋగ్వేద ఆర్యులు” నుండి తీసుకున్నాను).

ఈ సంభాషణలో అజీగర్తుడు శునశ్శేపుని ‘ఓ ఋషీ!’ అని సంబోధించడాన్ని బట్టి శునశ్శేపుడు అప్పటికే పెద్దవాడని, ఋషిత్వాన్ని పొందినవాడని అర్ధమవుతుంది. (ఐతరేయ బ్రాహ్మణంలోని కొన్ని ఋక్కులు కాడా వసిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, అయాస్యుడు, అజీగర్తుడు, శునశ్శేపుడు – వీరంతా సమకాలీకులని చెబుతాయని పెద్దల వ్రాతలవలన అర్ధమవుతుంది). శునశ్శేపుడిని రక్షించే క్రమంలో విశ్వామిత్రుడు అతనిని తన పుత్రునిగా చేసుకుంటాడు. విశ్వామిత్రునికి అప్పటికే నూర్గురు పుత్రులు. అందులో యాభై మంది మధుఛ్ఛందుని కంటే పెద్దవారు. ఈ యాభై మందీ శునశ్శేపుని దత్తతను, దాని ఫలితంగా శునశ్శేపునికి కలిగే పెద్దరికాన్ని ఒప్పుకోవడానికి అంగీకరించరు. ఇది విశ్వామిత్రునికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఫలితంగా వచ్చిన మాటలలో ఈ యాభై మందీ, వారి సంతానం ఆర్య భూములకావల ‘ఆంధ్ర, పుండ్ర, శబర, పులింద, మూతిబ ఇత్యాది జాతులలో కలిసిపోండ’ని శపిస్తాడు. వారే ఈ జాతుల ప్రజలనీ, ఆర్య జాతి సమ్మేళణం ఈ జాతుల ప్రజలతో జరిగిందనీ ఈ కథ తాత్పర్యం. ఈ ఫలితాన్ని సాధించడానికే ఈ ఉదంతాన్ని ఐతరేయ బ్రాహ్మణంలో ప్రక్షిప్తీకరించడం జరిగిందనీ కూడా అనుకోవాల్సి ఉంటుంది. పురాణాల కాలమైన క్రీ.పూ.3 వ శతాబ్దిలో ఇది జరిగింది అనాలి.

విశ్వామిత్రుని శాప పాఠం పై కూడా భిన్నమైన వివరణలు ఉన్నాయి. “You shall have the lowest castes for your descendants.  Therefore are many of the most degraded classes of men, the rabble for the most part, such as the Andhras, Pundras, Sabaras, Pulindas and Mutibas, descendants of Viswamitra.” అని  Martin Haag….

“Your offspring shall inherit the ends (of the earth).  These are the people the Andhras, Pundras, Sabaras, Pulindas and Mutibas who live in large numbers beyond the borders.  Most of the Dasyus are the descendants of Viswamitra.” అని A.B. Keith ….ఇలా! (“ఆంధ్ర వాఙ్మయారంభ దశ – ప్రథమ సంపుటము – పాఙ్నన్నయ యుగము” దివాకర్ల వెంకటావధాని – 1960).

పురాణాలు (ముఖ్యంగా వాయు, మత్స్య మరియు మార్కండేయ పురాణాలు) ఉత్తర కొంకణాన్ని అపరాంతం అన్నాయి. వింధ్య, సత్పూరా పర్వత శ్రేణులు,
వాటిల్లో పుట్టి ప్రవహించి అరేబియాసముద్రంలో కలిసే నర్మద, తాపీ నదుల తీర ప్రదేశాలలో పుండ్రులు, పుళిందులు, శబరులు జీవనం సాగిస్తుండేవారనీ చెప్పాయి (“Early History of the Dekkan” – R.G. Bhandarkar – 1895). ఈ జాతుల ప్రజలతో కలిపి చెప్పబడిన ఆంధ్రులుకూడా ఆ ప్రాంతం వారే అయి ఉంటారనుకోవడం అసంగతం కాదు. ఇక్కడి ఈ ఆంధ్రులకూ, ఇక్కడి నుండి చూస్తే చాలా దిగువన కృష్ణా గోదావరీ ప్రాంత వాసులై ఉండిన తెలుగు వాళ్ళకు ఏవిధంగా సంబంధం కుదిరింది? వీరిరువురూ ఒకే జాతివారు ఎలాగయ్యారు? వీరిరువురి భాషా ఒకే భాష ఎలాగయ్యింది? ఇవి సందేహాలు, అర్ధంలేనివి కావు.

ప్రకటనలు

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

ఆంధ్రుల లేదా తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర గురించిన ఈ notes లో తొలి వెయ్యేళ్ళు అంటే క్రీస్తు శకాబ్దం మొదలుకొని ఆపై వెయ్యేళ్ళదాకా అని అనుకున్నది.
అయితే, ఇది నిజానికి ఇంకో రెండువందల పాతికేళ్ళు ముందుకు వెళ్ళి అదనంగా మరో రెండువందలపాతికేళ్ళు కలిసి మొత్తం పన్నెందువందల పాతిక
సంవత్సరాలవుతుంది. దీనికి కారణం, శాతవాహనుల పరిపాలనతో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర మొదలవుతుంది/మొదలుపెట్టుకోవాలనుకుంటే,
శాతవాహనుల పాలన క్రీ.పూ.225 లో మొదలై క్రీ.శ.225 తో అంతమయిందని చరిత్రకారులంటారు గాబట్టి. శాతవాహనుల పరిపాలనలో తెలుగువాళ్ళ
సాంఘిక చరిత్రకు కూడా క్రీ.పూ.225 నుంచి ఆధారలు దొరకాలి.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి. ఆంధ్ర భృత్యులని మాటకూడా ఉంది. దీనిమీద లేచినవివాదం ఇంకా ఎటూ తెలకుండానూ ఉంది. ఆంధ్రులైన భృత్యులా?
ఆంధ్రులకు భృత్యులా? ఆంధ్రులు వేరే రాజవంశం వారై, వారికి శాతవాహనులు సామంతరాజులా? అని మీమాంస. అదెలా ఉన్నా, నాలుగున్నర శతాబ్దాల
వీరి పరిపాలన మాత్రం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లిందని చెప్పుకోవాలి. నాలుగున్నర శతాబ్దాలు ఒకే రాజవంశం ఒక భూభాగాన్ని నిరాటంకంగా పరిపాలించడం
అంత సులభంగా జరిగే పని కాదు. అయినా శాతవాహనుల విషయంలో అది సాధ్యమైంది. తరానికి 25 సంవత్సరాల చొప్పున (చరిత్ర పరిశోధనలో తరానికి 25
సం.గా వేసుకుని లెక్కిస్తారని చదివాను) నాలుగున్నర శతాబ్దాలకు 18 తరాలవుతుంది. అంటే తరం నుంచి తరానికి సాగే జ్ఞాపకాల ప్రవాహంలో
పరిస్థితులలోనూ పరిపాలకులకు చెందిన విషయాలలోనూ ఏవిధమైన మార్పూ లేకుండా 18 తరాలు గడవడం, జ్ఞాపకాల, అనుభవాల ప్రవాహం నిరాటంకంగా
కొనసాగడం అన్నది చరిత్రలో ఒక అరుదైన సందర్భం, ఒక luxury గానే చెప్పుకోవాలి. ఆ సందర్భాన్ని, ఆ luxury ని  శాతవాహనుల పరిపాలనలో
అప్పటి ప్రజలు అనుభవించారు.

ఈ సుఖాన్ని అనుభవించిన వాళ్ళలో తెలుగు మాతృభాషగా ఉండిన తెలుగువాళ్ళూ ఉన్నారు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అప్పుడు, అంటే
శాతవాహనుల పరిపాలనా కాలం నాటికి, ఆంధ్రులు తెలుగువాళ్ళూ ఒక్కటి కాదా? అని. కాదనే నేను అనుకుంటాను. అయితే గనక, ఆంధ్రులైన
శాతవాహనులు తమ మాతృభాష అయిన తెలుగును వదిలి ప్రాకృతాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు? శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజబాష, ప్రజల భాష
కూడాను! ప్రాకృతంలోనే కదా గాథాసప్తశతిలోని గాథలన్ని ఉన్నాయి! అయితే, అప్పటికి తెలుగింకా పూర్తిగా పరిణతిచెందిన భాషగా కాకుండానన్నా
ఉండిఉండాలి. అలా అనుకోవడానికీ వీలు లేదు.  కారణం, గాథాసప్తశతిలో అక్కడక్కడా కనుపించే అత్తా (అత్త), అద్దాఏ (అద్దం) లాంటి కొన్ని తెలుగు
పదాలు, తెలుగు అప్పటికే పూర్తిగా పరిణతి చెందిన భాషగా ఉండినదనీ, ఎంత పరిణతి అంటే, అందులోని కొన్ని మాటలు వేరే భాషలోకి వెళ్ళగలిగేంత పరిణతి
చెందిన భాషగా శాతవాహనుల కాలంనాటికే ఉండినదనీ, పూజ్యులు కీ.శే.తిరుమల రామచంద్ర గారు తమ వ్యాసాలలో ఇప్పటికే నిరూపించి ఉన్నారు కాబట్టి!

అదలా ఉంచితే, “ఆంధ్రశ్చ బహువః” అనే మాట ఒకటి ఉంది. దీని అర్ధం ఆంధ్రులు పలువురు అని. అంటే, పలు జాతుల ప్రజలు కలిసి ఆంధ్రులు
అయ్యారని ఇది సూచిస్తుంది. ఇది నానుడి. ప్రజల నాలుకలపైనుంచి వచ్చిన మాట. దీనికి నిదర్శనాలు, ఆధారాలూ దొరకవు. తరం నుంచి తరానికి ఇలా
దిగుమతి అయిన జ్ఞానంలో నిజం బొత్తిగా ఉండదు అనుకోవడం సాహసమే అవుతుంది. ఈ పలు జాతుల ప్రజలలో తెలుగు మాతృ భాషగా కలిగిన తెలుగువాళ్ళూ
ఉండిఉండవచ్చు. కాదనటానికి లేదు. బలమైన, ప్రభావవంతమైన జాతి కావడం మూలాన పోనుపోను ఆంధ్రులంటే, తెలుగువాళ్ళన్నది స్థిరపడి పోయి
ఉంటుందనుకోవాలి.

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర: అంధ యుగం – గ్రంథ యుగం

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర: అంధ యుగం – గ్రంథ యుగం

తెలుగువాళ్ళ సాంఘిక చరిత్రను గురించిన ముఖ్యమైన సమాచారాన్ని, సంగతులను సేకరించుకుని ఒకచోట రాసుకోవడానికి వీలుగా ఇదేమిరకమైన విభజన అనిపించినా, నాకు మాత్రం ఇది ఒక విధమైన (convenient) స్థూల విభజనలాగానే అనిపిస్తుంది.

ఇందులో, అంధ యుగం అని నేను విభజించుకున్నది – తారీకంటూ లేని/తెలియని తొలినాళ్ళ నుంచి క్రీ.శ.1000 సం. దాకా (అంటే గీత గీసినట్లు వెయ్యవ సంవత్సరందాకా అని కాకుండా ఆ ప్రాంతాలదాకా) ఈ అంధ యుగంలోకి చేర్చుకుంటాను. కారణం – వ్రాతలో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్రను గురించి తెలిపే ఆధారాలేవీ ఈ యుగంలో దొరకవు గాబట్టి. దొరికిన శిలాశాసనాలన్నీ దానశాసనాలు. ఇందులో పెద్దగా సామాన్యజనుల సాంఘిక చరిత్రకు సంబంధించిన అంశాలేమీ వుండవు. అందువలన, ఈ యుగానికి చెందిన జనజీవనానికి సంబంధించిన ఆసక్తికరమైన అదనపు సమాచారం చిన్నదైనా సేకరించడం చాలా కష్టం, challenging గా ఉండే పని.

ఇక రెండవది  గ్రంథ యుగం – పేరు సూచించేటట్లుగానే, రాజరాజు కోరికతో నన్నయ మహనీయుని చేతులమీదుగా క్రీ.శ.1050 ప్రాంతంలో మొదలైన గ్రంథ రచన, ఆ తరువాత శతాబ్దాలుగా నిరాటంకంగా సాగి, ఇప్పటికీ సాగుతూనే ఉంది. పోను పోను కాలంలో వ్రాత అనేది  పరిణతిచెంది సర్వ సామన్యమైన తరువాత సంగతులన్నీ గ్రంథస్థం చేయబడినాయి.  శాసనాలు చాలమటుకు రాజుల చరిత్రనే చెప్పాయి. తాళపత్రాలు మిగతా సంగతులతో పాటు, అప్పుడప్పుడూ జనసామాన్యం జీవన విశేషాలను చెప్పాయి. అయితే, ఈ యుగానికి సంబంధించి అదనపు సమాచారం పెద్దగా సేకరించగలిగింది ఏమీ లేదనే అనిపిస్తుంది. ఉన్నదేదో ఇప్పటికే పెద్దలచేత బయటపెట్టబడింది గాబట్టి. ఈ యుగంలో కూడా, వెతకడానికి మిగిలి ఉన్నవిగా చెప్పాల్సినవి దొరకకుండాపోయిన ప్రసిధ్ధకవులవే గానీ, అంత ప్రసిధ్ధులు కానివారివి గానీ రచనలు. కాలగర్భంలో కలిసిపోయినవిగా అనుకోబడుతున్నవాటిని వెలికి తీసి వెలుగుచూపించడానికి కొంత అదృష్టంతో సహా ఇంకా చాలా కలిసిరావాలి.

అలాగని ఈ గ్రంథయుగంలో ఇక వెదకడానికి ఏమీ లేదని అనుకోవడంకూడా తెలివైన మాటకాదు. ఎందుకంటే, తెలుగువాళ్ళ చరిత్రకు సంబంధించిన చాలానే సంగతులు ఇంకా అపరిష్కృతాలుగా మిగిలున్నవి ఉన్నాయి. ఉదాహరణకి, శాతవాహను లెవరు? వీళ్ళు పుట్టుకతో ఆంధ్రులేనా? అనే ప్రశ్నకు ఇది final అని చెప్పుకోదగిన సమాధానం ఇంతవరకూ లేదు. అలాగే, కాకతీయులు ఎవరు? అన్న ప్రశ్నకూ, ‘కాకతి’ అనే మాట ఏ అర్ధాన్ని సూచిస్తుంది? కాకతి శక్తి ఎవరు? ఇలాంటి ప్రశ్నలకూ ఇది అంతిమం, దీనికిక తిరుగులేదు అని చెప్పుకోదగ్గ, అందరూ ఒప్పుకోదగిన, ఒప్పుకున్న సమాధానం లేదు, నాకు తెలిసినంతవరకూ, నేను చదివున్నంతవరకూ. ఇలాగే, పల్లవులు ఇక్కడివారా? బయటనుంచి వచ్చిన వారా? పల్లవ అనే మాటకు ఏమిటి అర్ధం? బృహత్ఫలాయన, శాలంకాయన, ఇత్యాది చిన్న చిన్న రాజవంశాలవారు ఇక్కడివారేనా? లేక బయటినుంచి వచ్చినవారా? ఇక్కడివారే అయితే వీరి పూర్వులు ఎవరు? ఈ వంశనామాలు దేనిని సూచిస్తాయి? ఇవి వంశనామాలేనా లేక గోత్రనామాలా? గోత్రనామాలే వంశనామాలుగా ఎందుకయ్యాయి? ఇలాంటి ప్రశ్నలకూ సరయిన convincing సమాధానాలు దొరకవలసే ఉంది ఇంకా!

అందువలన, (నా విభజనలో) అంధయుగంలోనే కాదు, గ్రంథయుగంలోని సంగతులకు సంబంధించిన సమాచారమూ సమగ్రమేమీ కాదు! అందులోకూడా ఇంకా తెలియాల్సింది ఉందనే అనుకోవాలి. చరిత్ర గురించి రాయడం out of fashion అయిపోయి చాల రోజులే అయింది. ఒకప్పుడు, 1970 ల దాకా కూడా, చరిత్ర గురించి రాయడం ఒక యజ్ఞంగా తీసుకుని కృషి చేసిన వాళ్ళున్నారు. ప్రచురించిన పత్రికలూ ఉన్నాయి. అవన్నీ గ్రంథాలయాల్లో భద్రంగానే ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుతూనే ఉన్నారు, రాయడానికి సాహసించకపోయినా!

కీ.శే. సురవరం ప్రతాపరెడ్డిగారు తమ ఆంధ్రుల సాంఘిక చరిత్రలో శాతవాహనుల కాలం నుండి క్రీ.శ.వెయ్యి దాకా ఆంధ్రుల సాంఘిక చరిత్రను గ్రంథస్థం చేయాలని అభిలషించారుగాని, ఏ కారణం చేతనో, అది కార్యరూపం దాల్చలేదు. ముందు చెప్పుకున్నట్లుగానే, వెయ్యి తరువాత ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాయడానికి తగినన్ని ఆధారాలు ఉన్నందువలన వీలయ్యే పనే! వెయ్యికి ముందు చరిత్ర రాయడానికి సరయిన ఆధారాలు ‘sources’ లేకపోవడం అనడం కంటే లభ్యంకాకపోవడం వలన అంత సులభంగా జరగే పనికాదు.

అందువలన ఆంధ్రుల చరిత్రలో తొలి వెయ్యేళ్ళు ఓరకంగా అంధయుగమే! అలా అన్నంత మాత్రాన, ఇక కృషి చెయ్యడానికి ఏమీ లేదని కాదు; చేయగలిగినంత ఉంది…ఉంటుంది!

కీసరగుట్ట

కీసరగుట్ట – శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం

హైదరాబాదు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంటుంది కీసర (కీసర గుట్ట). ప్రసిధ్ధ శైవక్షేత్రం.

క్రీ.శ. తొలి శతాబ్దాలలో ఆంధ్ర దేశాన్ని (వేంగీ దేశాన్ని) పరిపాలించిన రాజవంశాలలో ఒకటైన విష్ణుకుండినులకు, ఈ కీసరకు సంబంధం ఉందని ఒక మాట ఉంది. ఈ రాజవంశం రాజులలో ఒకడైన రెండవ మాధవ వర్మ పరిపాలనా కాలం అయిన క్రీ.శ.4-5 శతాబ్దాలలో ఈ కీసర రాజధానిగా ఉండేదని చెబుతారు.
విష్ణుకుండిన రాజులలో రెండవ మాధవ వర్మ చాలా ప్రసిధ్ధుడు. రాజ్యాన్ని బాగా విస్తరింపజేసి విష్ణుకుండినుల ప్రభను ఒక వెలుగు వెలిగించిన దీటైన రాజు. ఈయన వైదికమతాభినివిష్టుడనీ, అగ్నిష్టోమ, వాజపేయ, పౌండరీక, అశ్వమేధ, రాజసూయ ఆది క్రతువులను చేశాడనీ చరిత్ర పరిశోధకులు చెప్పారు. పదకొండుసార్లు అశ్వమేధ యాగాన్ని చేయడం వలన ఈయన రాజ్యకాలంలో పదకొండు సార్లు దిగ్విజయ యాత్ర సాగించి ఉంటాడనీ చరిత్ర పరిశోధకులు అంటారు. అప్పటిలో బలవంతులైన వాకాటకులను పోరులో ఓడించి, సంధిలో భాగంగా వాకాటక రాజు కుమార్తెను వివాహం చేసుకుని, తదనంతరం రెండు రాజ్యాలకూ వారసుడు అయ్యాడని కూడా చరిత్ర పరిశొధకులు ఊహించారు. ఇంత ప్రసిధ్ధుడైన రాజుతో సంబంధం కలిగి ఉండిన ఈ క్షేత్రం కూడా అంత ప్రసిధ్ధమైనదే! శివరాత్రి నాడు ఏటా జరిగే ఉత్సవాలకు హైదరాబాదు నుండి ప్రత్యేకంగా బస్సులను వేస్తారు. జనం తండోపతండాలుగా వెళ్ళి ఉత్సవంలో పాల్గొంటారు.

కొండ (‘గుట్ట’ అనే అనాలనుకుంటాను!) మీద ఆలయం. మెట్లు ఎక్కుతూండగా కనిపిస్తుంది ఆలయ గోపురం. కొండ (‘గుట్ట’) మీద ఆలయ ప్రాంగణంలో ఏ వైపు చూసినా శివలింగాకృతులు కనిపించి అబ్బుర పరుస్తాయి. కొండ మీదనుంచి చుట్టు scenery చూడడానికి బాగానే ఉంటుంది. ఈ మధ్యనే వెళ్ళి నప్పుడు తీసినవి ఫోటోలు ఇక్కడ కొన్ని. ఈ ఫోటోలు 2 megapixel లెన్స్ తో ఉన్న సెల్ ఫోనుతో తీసినవి. ఈ ఫోటోలలో చివరి నాలుగు ఫోటోలూ dimensions లో పెద్దవి. వాటి మీద ఎక్కడైనా సరే click చేస్తే, image ని original dimensions లో చూడడానికి వీలవుతుంది.

స్వగతాలు (6) : జ్ఞాపకం -2

జ్ఞాపకం (2)

ఒకప్పటి అతి గాఢమైన ప్రేమ కూడా
ఇప్పటికి ఒక అగాఢమైన, అస్పష్టమైన జ్ఞాపకాల సముదాయంగా అంతమై మిగలొచ్చని ఒక మాట!

ఏది పరమ నిజం (absolute truth)?
ఏదీ కాదు.
సంబంధ నిజమో (relative truth)?
అన్నీ!
నీవూ నేనూ, నీ ప్రేమా నా ప్రేమా…. ఇలా అన్నీ!

చూడగలిగితే, చదవ గలిగితే, కాలంలో ఎప్పుడూ ఒక అప్రకటిత దాన శాసనం శిలామయమై క్షణానికో మారు లిఖించబడి వుండి కనబడుతూ వుంటుంది!

ఇదివరకే పడివున్న అక్షరాల అడుగుజాడలలో తడబడుతూ నడుస్తూండేవే
నీవీ నావీ, ఇంకా మనలాంటి వాళ్ళవే అందరివీ, జ్ఞాపకాలు.

చిక్కుపడిపోయి వున్న కురులలోకి వేళ్ళు పోనిచ్చి, ఉదయం అరవిప్పారిన కన్నులతో ఆవులిస్తూ బడలికగా పురివిప్పుకుంటున్నట్లు కదిపినప్పుడల్లా, హటాత్తుగా రాలిపడే ఒక వాడిపోయిన మల్లెపూవు లాంటిది ఈ జ్ఞాపకం.

కళ్ళు నులుముకుని చూడాల్సి వచ్చేటంత అపనమ్మకంగా, నమ్మశక్యం కానంత నిర్నిమిత్తంగా,
ఒక మధురాతి మధురమైన స్మృతిని జ్ఞప్తికి తెచ్చి ఒళ్ళు ఝల్లుమనిపిస్తుంటుంది.

కురులమధ్య కవోష్ణంలో కాలిపోయి మిగిలిన అప్పుడెప్పటిదో మోహాన్నీ, మొహాన్నీ
అక్షరాలా ఈ అక్షరాల జలపాతంలో తడుపుకుని తృష్ణ తీర్చుకుంటూ
నేనిక్కడ ఎన్నాళ్ళుగా నయినా సరే పడి ఉంటూనే ఉంటాను….

అటూ ఇటూ ఒకేసారి మండుతూన్న సూర్యునిలా
ఉదయం సాయంత్రం, పగలూ రాత్రీ అనే ప్రాపంచిక సంగతులను వేటినీ పట్టించుకోకుండా
ఇలా…..

స్వగతాలు (3) : జ్ఞాపకం

జ్ఞాపకం

ప్రతి జ్ఞాపకానికీ వేలిముద్ర లాంటి ఒక personal ముద్ర వుండడమన్నది వాటి నైజం.

Memory loss అంటే?
జ్ఞాపకం పోవడం….అంతే!

ముఫ్ఫై నలభై ఏండ్లుగా వెంట పడి వున్న ఒక జ్ఞాపకాన్ని
ఎలక్ట్రానిక్ కాగితం మీదికి – అదే కంప్యూటర్ స్క్రీన్ మీదికి – వ్రాయడానికి ఎంత సమయం పడుతుంది?
ఒక గంటా?
రెండు గంటలా?
మూడూ? నాలుగూ? ….. పోనీ ఒక రోజు!

జ్ఞాపకం పోవడం అంటే
ఒక memory మన నుంచి వేరై పోవడం – అంతే!

Memory ని Memory గానే మాటలలో మూట కట్టి బయటికి నెట్టేయడంలో పోయే ప్రతి జ్ఞాపకం, తన వెంట ఒక తనువంత అనుభూతి బరువును తీసుకొని పయనమై పోయినట్లనిపించకపోవడం తెలియకుండా జరిగిపోతుంది.

వ్యక్తి హరువును జ్ఞాపకాల బరువు నిర్ణయించడమన్న తెలియని నిజం, తేలికైపోయిన జ్ఞాపకాల బీరువాలోని చీకటిలోనికి తొంగి చూసుకుని ఒకానొక రోజు తముళ్ళాడుకోవాల్సి రావడం జరిగినప్పుడు, ఒక్కసారిగా తెలిసి భయపెట్టే క్షణం రాకూడదనుకుంటాను!

అన్నీ అయి పోయి

ఎప్పటికైనా సరే, చెప్పడానికి ఇక ఏమీ మిగలకుండా అయిపోయి మిగలడం మాటలలో చెప్పలేనంత misery!

Memory loss అంటే?
శిథిలానికి సిధ్ధమౌతూన్న ఒక ఖాళీ అయిపోయిన గది!

స్వగతాలు (2) : ఏడుపు

ఏడుపు

బాగా రాయని నాటకాన్ని ఆడి బతుకులో గెలుపొందడం ఏలాగ? అన్నది ఇక్కడ సమస్య.

కొత్తగా బతకడం మొదలెట్టిన ఏ మనిషికైనా
ఇక్కడ కష్టం చేసే శరీరంకన్నా
మతలబు చేసే బుధ్ధికే బతకగలిగే అవకాశాలు మెండని అర్ధమవడానికి ఆట్టే కాలం పట్టదు.
ఇది అనైతికం అన్న సందేహం ఒక పక్కనుంచి కలుగుతూనే వున్నా
బుధ్ధి మాత్రం మతలబు చేయగలిగే బుధ్ది వైపుకే పరుగులు పెడుతూ వుంటుంది.

మనిషికి తెలివిగల బుధ్ధి వున్నందుకే ఇది జరుగుతూంటుందన్నది
ప్రతి యేడూ మార్కెట్లో పదీపదిహేను రూపాయలకు తక్కువ దొరకని కిలో టమోటాలు
మడి దగ్గర అర్ధరూపాయకు కూడా అమ్ముడవని సందర్భాల్లో అర్ధమవుతుంది.
అదే ఇంకా బాగా అవే టమోటాలు అర్ధ రూపాయకూ అమ్ముడవక
రోడ్ల మీద లారీల చక్రాల కింద చితికి పచ్చడైన దృశ్యంలో ఇంకా బాగా అర్ధమవుతుంది.
ఈ నాటకాన్నంతా చూసే మనకే ఇలా వుంటే,
మొదటినుంచీ పిల్లల్లా చూసుకుంటూ పెంచి ఆశలు పెంచుకుంటూ పోయిన వాడి కెంతుండాలి…
శోకం?
శోకమా?! ….(కాదుకాదు….ఇందులో మచ్చుకైనా మట్టివాసన పలకడంలేదు.)
ఏడుపు! ….(అవునవును …ఏడుపే! ఎంత కన్నీళ్ళ మయంగా వున్నదీ మాట!!)