తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (1)

ఆంధ్రుల లేదా తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర గురించిన ఈ notes లో తొలి వెయ్యేళ్ళు అంటే క్రీస్తు శకాబ్దం మొదలుకొని ఆపై వెయ్యేళ్ళదాకా అని అనుకున్నది.
అయితే, ఇది నిజానికి ఇంకో రెండువందల పాతికేళ్ళు ముందుకు వెళ్ళి అదనంగా మరో రెండువందలపాతికేళ్ళు కలిసి మొత్తం పన్నెందువందల పాతిక
సంవత్సరాలవుతుంది. దీనికి కారణం, శాతవాహనుల పరిపాలనతో తెలుగువాళ్ళ సాంఘిక చరిత్ర మొదలవుతుంది/మొదలుపెట్టుకోవాలనుకుంటే,
శాతవాహనుల పాలన క్రీ.పూ.225 లో మొదలై క్రీ.శ.225 తో అంతమయిందని చరిత్రకారులంటారు గాబట్టి. శాతవాహనుల పరిపాలనలో తెలుగువాళ్ళ
సాంఘిక చరిత్రకు కూడా క్రీ.పూ.225 నుంచి ఆధారలు దొరకాలి.

శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి. ఆంధ్ర భృత్యులని మాటకూడా ఉంది. దీనిమీద లేచినవివాదం ఇంకా ఎటూ తెలకుండానూ ఉంది. ఆంధ్రులైన భృత్యులా?
ఆంధ్రులకు భృత్యులా? ఆంధ్రులు వేరే రాజవంశం వారై, వారికి శాతవాహనులు సామంతరాజులా? అని మీమాంస. అదెలా ఉన్నా, నాలుగున్నర శతాబ్దాల
వీరి పరిపాలన మాత్రం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లిందని చెప్పుకోవాలి. నాలుగున్నర శతాబ్దాలు ఒకే రాజవంశం ఒక భూభాగాన్ని నిరాటంకంగా పరిపాలించడం
అంత సులభంగా జరిగే పని కాదు. అయినా శాతవాహనుల విషయంలో అది సాధ్యమైంది. తరానికి 25 సంవత్సరాల చొప్పున (చరిత్ర పరిశోధనలో తరానికి 25
సం.గా వేసుకుని లెక్కిస్తారని చదివాను) నాలుగున్నర శతాబ్దాలకు 18 తరాలవుతుంది. అంటే తరం నుంచి తరానికి సాగే జ్ఞాపకాల ప్రవాహంలో
పరిస్థితులలోనూ పరిపాలకులకు చెందిన విషయాలలోనూ ఏవిధమైన మార్పూ లేకుండా 18 తరాలు గడవడం, జ్ఞాపకాల, అనుభవాల ప్రవాహం నిరాటంకంగా
కొనసాగడం అన్నది చరిత్రలో ఒక అరుదైన సందర్భం, ఒక luxury గానే చెప్పుకోవాలి. ఆ సందర్భాన్ని, ఆ luxury ని  శాతవాహనుల పరిపాలనలో
అప్పటి ప్రజలు అనుభవించారు.

ఈ సుఖాన్ని అనుభవించిన వాళ్ళలో తెలుగు మాతృభాషగా ఉండిన తెలుగువాళ్ళూ ఉన్నారు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. అప్పుడు, అంటే
శాతవాహనుల పరిపాలనా కాలం నాటికి, ఆంధ్రులు తెలుగువాళ్ళూ ఒక్కటి కాదా? అని. కాదనే నేను అనుకుంటాను. అయితే గనక, ఆంధ్రులైన
శాతవాహనులు తమ మాతృభాష అయిన తెలుగును వదిలి ప్రాకృతాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు? శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజబాష, ప్రజల భాష
కూడాను! ప్రాకృతంలోనే కదా గాథాసప్తశతిలోని గాథలన్ని ఉన్నాయి! అయితే, అప్పటికి తెలుగింకా పూర్తిగా పరిణతిచెందిన భాషగా కాకుండానన్నా
ఉండిఉండాలి. అలా అనుకోవడానికీ వీలు లేదు.  కారణం, గాథాసప్తశతిలో అక్కడక్కడా కనుపించే అత్తా (అత్త), అద్దాఏ (అద్దం) లాంటి కొన్ని తెలుగు
పదాలు, తెలుగు అప్పటికే పూర్తిగా పరిణతి చెందిన భాషగా ఉండినదనీ, ఎంత పరిణతి అంటే, అందులోని కొన్ని మాటలు వేరే భాషలోకి వెళ్ళగలిగేంత పరిణతి
చెందిన భాషగా శాతవాహనుల కాలంనాటికే ఉండినదనీ, పూజ్యులు కీ.శే.తిరుమల రామచంద్ర గారు తమ వ్యాసాలలో ఇప్పటికే నిరూపించి ఉన్నారు కాబట్టి!

అదలా ఉంచితే, “ఆంధ్రశ్చ బహువః” అనే మాట ఒకటి ఉంది. దీని అర్ధం ఆంధ్రులు పలువురు అని. అంటే, పలు జాతుల ప్రజలు కలిసి ఆంధ్రులు
అయ్యారని ఇది సూచిస్తుంది. ఇది నానుడి. ప్రజల నాలుకలపైనుంచి వచ్చిన మాట. దీనికి నిదర్శనాలు, ఆధారాలూ దొరకవు. తరం నుంచి తరానికి ఇలా
దిగుమతి అయిన జ్ఞానంలో నిజం బొత్తిగా ఉండదు అనుకోవడం సాహసమే అవుతుంది. ఈ పలు జాతుల ప్రజలలో తెలుగు మాతృ భాషగా కలిగిన తెలుగువాళ్ళూ
ఉండిఉండవచ్చు. కాదనటానికి లేదు. బలమైన, ప్రభావవంతమైన జాతి కావడం మూలాన పోనుపోను ఆంధ్రులంటే, తెలుగువాళ్ళన్నది స్థిరపడి పోయి
ఉంటుందనుకోవాలి.

ప్రకటనలు

ప్రాకృతికం – పల్లె అందం

“ణిప్పణ్ణ సస్సరిధ్ధీ సచ్చందం గాఇ పామరో సరఏ,
దలిఅ ణవసాలి తండుల ధవల మిఅంకాసు రాఈసు.”

శాతవాహన ప్రభువులలో ఒకడైన హాలమహారాజు చే సంకలించబడిన గాథా సప్తశతి అనే పేరున్న ప్రాకృత గాథల సంకలన గ్రంథంలో ఏడవ శతకంలోని ఎనభైతొమ్మిదవ గాథ ఇది.

“నిష్పన్న సస్య ఋధ్ధిః స్వఛ్ఛందం గాయతి పామరః శరది,
దలితనవశాలి తండుల ధవల మృగాంకాసు రాత్రిషు.”

అని పై ప్రాకృత గాథకు సంస్కృత ఛాయ.

‘కోర్కె తీరగా పంట పండింది. దంచిన కొత్త బియ్యపు పిండి ఆరబోసినట్లున్న శరత్కాలపు వెన్నెలరాత్రిలో ఆనందంతో రైతు గొంతు విప్పి పాట పాడు తున్నాడు’ అని ఈ గాథకు పెద్దలు చెప్పిన అర్ధం. భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించే ఒక పల్లెటూరి రైతు జీవితంలో దైవం అనుగ్రహిస్తే పదే పదే పునరావృతమయ్యే ఒక సన్నివేశాన్నీ, ఆ సన్నివేశంలోని సౌందర్యాన్నీ కనులకు కట్టినట్లు అతి తక్కువ మాటలలో వర్ణించి చూపెట్టే ఈ గాథను ఎన్ని సార్లు చదివినా, మననం చేసుకున్నా, తనివి తీరనట్లుంటుంది.

అచ్చమైన ఆప్యాయతతో రైతు కాళ్ళకు అంటుకునే పొలంలోని మట్టీ, మట్టిని తడిపి తమకంతో తబ్బిబ్బయ్యే నీరూ, స్వచ్చంగా వీచే గాలీ, రాబోయే పంటమీదా, పచ్చదనం మీదా కారుణ్యంతో కాచే ఎండ, కాలం కనికరించి అన్ని కలిసొస్తే ఏ దిక్కుకేసి చూసిన కళ్ళ నిండుగా కనిపించే పచ్చదనం….ఇవన్నీ పల్లెటూరు అనే పడతికి ప్రకృతి తనంత తానుగా తొడిగి చూపించిన నిలువెత్తు ఆభరణాలు. జీవితంలో ఏ కొంత భాగమైన పల్లెటూరిలో గడపడం అన్నది సంభవించిన ఏ వ్యక్తికైనా వీటి సహజ సౌందర్యం ఏమంత కష్ట పడకుండానే మనసుకు తట్టి కనులకు కడుతుంది.

ఆధునిక జీవన శైలిలో, పొట్టకూటికోసం అనుకున్నా, మరెందుకోసం అనుకున్నా, తనదైన పల్లెటూరిని విడిచి పట్టణానికి వలస వెళ్ళల్సి రావడం సంభవించిన వ్యక్తికి, తలచుకునే సందర్భం దొరికినప్పుడల్లా, వాటి సహజ సౌందర్యం మనసును పూర్తిగా కమ్మేసి, ఆ దృశ్యాలను విడిచి పెట్టి  ప్రస్తుతంలోకి రావడానికి ఒక పట్టాన ఇష్టపడక మనసు మొరాయిస్తూనూ వుంటుంది.  తప్పనివి అయినా కాకపోయినా, తెచ్చిపెట్టుకున్నవి అయినా కాకపోయినా….ఈ వియోగాలు ఇప్పటి జీవితంలో తప్పించుకోలేని అంతర్భాగాలయిపోయాయి. అంగీకరించాలిసిందే తప్ప, అందులో బాధపడాలిసింది కూడా ఏమీ లేదనే అనుకోవాలి!

పల్లెటూరితో సంబంధం వున్నవాళ్ళు మరోసారి ఆ సౌందర్యాన్ని మననం చేసుకోవడానికి వీలుగానూ, సంబంధం లేని వాళ్ళు ఆ సౌందర్యాన్ని మరోసారి చూడడానికి వీలుగానూ, నా ఫోటోలు కొన్ని slide show గా…. ఇప్పుడు, ఇక్కడ! ఇక్కడ ఒక్క మాట! ఈ ఫోటోలన్నీ బస్సులో ప్రయాణిస్తూ తీసినవి. అందువలన, అక్కడక్కడా ఒకటి రెండు ఫోటోలు straight గా వుండకుండా, కొంచెం angled గా కనిపిస్తాయి. అయితే, angled గా వున్నా, అందులో వున్నది ప్రకృతి  కాబట్టి, వాటి సౌందర్యానికి ఏమీ భంగం కలగలేదనే అనుకుంటాను!

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

తెలుగు మాట, పాట, పద్యం (5)

అచ్చ తెనుగు పద్యం

తెలుగు పద్య సాహిత్యంలో ‘అచ్చ తెనుగు’ అన్న మాటను మొదటి సారిగా వాడిన వ్యక్తి మూలఘటిక కేతన అని చెబుతారు. ఈయన తిక్కన మహాకవి సమకాలికుడు. తెలుగులో మొదటి కథాకావ్యానికి (దశకుమార చరిత్ర) శ్రీకారం చుట్టినవాడు కేతన. ‘కవిత చెప్పి’ తిక్కన మహాకవినే మెప్పించినవాడు ఈయన.  ఈయన చెప్పిన ఈ ‘అచ్చ తెనుగు’ అనే మాటకు ముందు, ఈ మాట ఏ అర్ధాన్నయితే సూచిస్తుందో అదే అర్ధంలో ‘జాను తెనుగు’, ‘దేశి’ అనే మాటలు వాడుకలో వుండేవి. ఈ మాటలను తమ పద్యాలలో చెప్పిన వారు ‘నన్నె చోడుడు’, పాలుకురికి సోమనాధుడు!

పేరుకి ఇన్ని మాటలున్నా, ఈ మాటలు ‘అచ్చ తెనుగు’ భాషా స్వరూపాన్ని అర్ధమయేలా చేయడంలో సఫలీకృతం కాలేకపోయాయన్న ఒక అభిప్రాయం, విజ్ఞుల మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి! భాషా స్వరూపం అర్ధం కావాలంటే, ఒక ఉదాహరణంతో చెప్పుకుంటే, కొంతలో కొంత స్ఫష్టత వచ్చి, సులభం అవుతుంది.

“పగలు సేయుచు వేడిమి మిగుల జగము
గ్రాచు జమునబ్బ మున్నీట గలిసె ననియొ
తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపు
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”

కూచిమంచి తిమ్మకవి రచించిన ‘అచ్చ తెలుగు రామాయణం’ కావ్యంలోనిది ఈ పద్యం. సూర్యాస్తమయాన్ని సుందరంగా వర్ణించే పద్యం! నాకయితే, ఈ పద్యంలోని మాటల పొందిక, brevity, గాథా సప్తశతిలోని గాథలను తలపుకు తెస్తుంది. మంచి భావంతో నిండి వున్న పద్యం! ఊహ original ది! నాకు తెలిసినంతవరకూ, ఏ ప్రాకృత గాథనుంచో, సంస్కృత శ్లోకంనుంచో ఎత్తుకొచ్చింది కాదు!

ఇప్పుడు, ఈ పద్య భావాన్ని కొంచెం విడమరచి చెప్పుకుంటే…

‘పగలు సేయుచు’ – పగలు సేయువాడు – దినకరుడు.
సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ, కొన్ని రకాలయిన సంస్కృత సమాసాలు అచ్చ తెలుగులోకి మారేటప్పుడు జరిగే మార్పులను గురించి కొంత వివరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సంస్కృత సమాసాలలోని ప్రత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, దొర, తపసి, జోదు…ఇత్యాది శబ్దాలు జతవుతాయి అని వ్యాకరణం. ఉదాహరణకి:

అచ్చ తెలుగులో ‘కప్పు కుత్తుక వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘నీలకంఠ’ కు,
అచ్చ తెలుగులో ‘గిత్త తత్తడి వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘వృషభ వాహన’ కు,
అచ్చ తెలుగులో ‘వెంట్రుక యడుగుల దొర’ అనే సమాసం, సంస్కృతంలో ‘రోమ పాద’ కు,
అచ్చ తెలుగులో ‘మనుబోతు కొమ్ము తపసి’ అనే సమాసం, సంస్కృతంలో ‘ఋష్యశృంగ’ కు,
అచ్చ తెలుగులో ‘పచ్చ వారువపు జోదు’ అనే సమాసం, సంస్కృతంలో ‘హరిదశ్వా’ కూ అనువాదాలని పెద్దల వివరణ. తెలుగులో వీటినే బహువ్రీహి సమాసాలుగా భావిస్తారని కూడా చెబుతారు, అర్ధంలో చివరన కలది, కలవాడు చేరతాయి కాబట్టి. (నల్లని కంఠము కలవాడు, ఎద్దును వాహనముగా కలవాడు…ఇత్యాదిగ).

నాకయితే తెలుగులో ఈ మాటలు, సంస్కృతంలో మాటలు ఎంత అందంగా కనిపిస్తాయో, తెలుగులోనూ అంతే అందంగా అనిపిస్తాయి. ఇలాంటివే ఇంకొన్ని సమాసాలు:

వలిగుబ్బలి రాచ కూతురు (హైమవతి – హిమవంతుని కూతురు, ‘వలిగుబ్బలి’ అంటే మంచుకొండ అని అర్ధం), పుట్ట బుట్టువు తపసి (వాల్మీకి – పుట్ట  నుంచి పుట్టిన తపస్వి), పదియరదముల దొర కొడుకు (దాశరధి – దశరధుని కుమారుడు) – ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలంత అందంగానే కనబడతాయి.

ఇక్కడితో ఇది ఆపి, అసలు పద్యానికొస్తే —

పగలు సేయుచు – పగటిని చేస్తూ, ఆ క్రమంలోనే; వేడికి మిగుల జగము గ్రాచు – వేడిమితో జగత్తునంతా వుడికించి ఇబ్బందికిలోను చేసే; యమునబ్బ – యముని తండ్రి (సూర్యుడు); మున్నీట – సముద్రములోనికి; కలిసె ననియొ – కలిసిపోయాడుగదా అని; తొగ వెలందుక – కలువ పూవు (అనే పడతి); నగియె – నవ్వింది; అమ్మగువ – ఆ కలువ సుందరి; పెంపు గని – సంతోషంతో వదనం పెద్దదవడం (కలువ వికసించడం అన్న భావం) చూసి; సయింపక – తాళ లేక; తమ్మి – తామర పూవు (అనే పడతి); మొగంబు మొగిచె – మొహం ముడుచుకుంది, చాటు చేసుకుంది.

సూర్యాస్తమయంతోనూ, చంద్రాగమనంతోనూ కలువలు వికసించడం అనేది ప్రకృతి ధర్మం. సూర్యాస్తమయంతో తామరలు వికసనం కొల్పోయినట్లయి, కళావిహీనంగా, ముడుచుకున్నట్లయిపోవడమూ ప్రకృతిధర్మమే! ఈ రెండు ధర్మాలనూ కలబోసి, ఒకే సందర్భానికి జతచేసి, హృద్యంగా చెప్పడం ఈ పద్యంలో జరిగింది.

నాకు ఈ పద్యాన్ని చదివినప్పుడల్లా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది. పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గాథా సప్తశతి లోని పద్యాలను తెలుగులోకి అనువదించడంలో ఈ పద్యాన్నే(సరిగ్గా ఈ పద్యాన్నే అని కాకుండా, ఇలాంటి పద్యాలనే) ఆదర్శంగా తీసుకున్నరేమో! అని. ఎందుకంటే, అందులోని చాలా పద్యాల నడక ఈ పద్యాన్నే పోలి వుంటుంది. ఉదాహరణకి:

“అడుగుదమ్ములందు బడివేడు పతివీపు
జిన్ని కొమరుడెక్కి చెలగి యాడ
అలుక యెంత తెగనిదయ్యును నిల్లాలి
మొగమునందు నవ్వు మొలచె నపుడు! ”                (శతకం 1 గాథ 11)

“ఎవని వదలిన జీవంబు నవసి చనునొ
యతని నపరాధినయ్యు నోదార్ప వలయు;
ఊరు గాలుచు బొలిపోవు చున్న గాని
యగ్గి నొల్లని వారెవ్వరతివ, చెపుమ?”         (శతకం 2, గాథ 63)

అందుండి అచ్చ తెలుగు మాటలలో వున్న ఇలాంటి రమ్యమైన పద్యాలను ఇంకా చాలానే ఉదాహరించవచ్చు!

వియోగం (2)

ఇంటిలో సంధ్య వేళ దీపం, పరుచుకోబోతూన్న చీకటిని పారద్రోలే తొలి వెలుగు. అప్రయత్నంగానే కనులు మొగిడ్చి ఆ వెలుగుకు నమస్కరించడం మన సంస్కృతిలో భాగమై పోయింది, ఆ వెలుగుని దైవ సమానంగా భావిస్తాం గనుక!  దైవ సమానం గనుకనే ఆ వెలుగు వివాహం అయిన స్త్రీకి భర్తను జ్ఞాపకం తెస్తుందని ఊహించాడు వెయ్యేళ్ల క్రితమే ఊరూ పెరూ తెలియని ఒక సామాన్య ప్రాకృత కవి.  ఆ క్షణం వెలుగై అతను ఆమె కళ్ళ ముందే ఉన్నాడు గాని, భౌతికంగా అతడు దగ్గరగా ఉండే సందర్భం, అవకాశం దగ్గరలో లేదనే భావన, ఆలోచన మనస్సును బాధకు గురిచేస్తే, ఆమె కన్నీటి పర్యంతం అయింది.  ఇది అతి పవిత్రమైన, మాటలతో వర్ణించి చెప్పగాలేని వియోగ బాధ.  ఈ బాధను ఇలా ఊహించడానికి అంతే పవిత్రమైన హృదయం ఉండాలి.  అతనెవరో గాని, ఆ ప్రాకృత కవికి అంతటి పవిత్ర హృదయం ఉందనడానికి ఏమాత్రం సందేహపడనక్కర లేదు.

పై ప్రాకృత గాథకు నేను చేసుకున్న తెలుగు స్వేఛ్ఛానువాదం:

“ఇంటిలోన సందె దీపమ్ము వెలిగించునట్టి తరుణాన
ఒంటరై యున్న తరుణి హృదిన ప్రవాసుడైన పతి తలపు మెరిసె;
కంట నిండిన నీరు ధారలగు రీతి భీతి గొలుప
ఇంట దీపమ్మా కన్నీట నారునోయని మోమావంకకు తా చాటు చేసె.”

వియోగం (1)

వియోగం ఒక అవస్థ. తప్పనిసరి పరిస్థితులలో వేరైపోయి ఒకరినొకరు చేరుకోలేని దూరాలలో ఉండాల్సి వచ్చిన స్త్రీపురుషుల హృదయాలను తెరిచి చూడడం గనుక చేయగలిగితే, అక్కడ అన్యులకు అర్ధంకాకుండా కనిపించే ఒక surrealistic చిత్రం లాంటి భాధామయ దృశ్యం అది.

అది హృదయమంత అనాది. ఆకలి దాని పునాది. సంపాదించుకు రావాల్సిన బాధ్యత పురుషుడిపై ఎప్పుడు పడిందో అప్పుడే వియోగావిర్భావానికి బీజమూ పడింది. దూరాలకు బయటకు వెళ్ళే పురుషుడు తన స్త్రీని వెనుక వొంటరిగా వదిలి వెళ్ళక తప్పదు. ఇది ఒక తప్పనిసరి స్థితి. ఈ స్థితి కి సంబంధించిన ఊహ కవుల చిత్తాల్లో ఎన్నెన్నో కల్పనలకు దారి తీసింది. ఎన్నెనో బాధామయ దృశ్యాలను కవిత్వీకరించి చూపించేలా చేసింది.

వియోగం అనగానే నా తలపునకు వచ్చే మొట్టమొదటి బాధామయ చిత్రం హాలుని ‘గాథా సప్తశతి’ కాలానికి, అంటే క్రీ.శ.19-24 సం.ల రోజులకు చెందినది. ఒక మహా బాధామయ సన్నివేశాన్ని అంతే గొప్పదైన, ఉదాత్తమైన రీతిలో కళ్ళకుకట్టినట్లుగా కవిత్వీకరించి చూపిస్తుంది ఈ గాథ. భారతీయ సాహిత్యం మొత్తంలో వెదికినా, తప్పనిసరి పరిస్థితులలో తన పతికి దూరమై ఉంటున్న ఒక స్త్రీ వియోగ బాధను ఇంత ఉదాత్తంగా చిత్రించి చూపిన పద్యం గాని, పాట గాని, దీనితో సరితూగ గలిగినది వేరే ఉంటుందంటే నాకు సందేహమే!

“పిఅ సంభరణ పలోట్టంత వాహధారా నివాఆ భీఆఏ
దిజ్జఇ వంకగ్గీవాఏ దీవఓ పహిఠ జాయయా.”                    (3వ శతకం -22వ గాథ)

దీని సంస్కృత చాయ:

“ప్రియ సంస్మరణ ప్రలుఠ ద్భాష్ప ధారానిపాతభీతయా
దీయతే వక్రగ్రీవయా దీపకః పథిక జాయయా.”

భర్త వ్యాపార నిమిత్తం దూరం వెళ్ళి పరదేశంలో ఎక్కడున్నాడే తెలియకుండా ఉన్నాడు. సంజె వేళ అయింది.  ఆమే ఇంటిలో దీపం పెడుతోంది. కనుల ఎదుట వెలిగిన దీపం ఆమెకు వెంటనే భర్తను తలపులలోకి తెచ్చింది. తలపులలో అతను మెదిలినదే  తడవుగా, కనులలో కన్నీళ్ళు నిండి ధార కట్టడానికి సిధ్ధమయ్యాయి.  చెంపల మీదుగా క్రిందకు జారి పడడానికి సిధ్ధంగా ఉన్న కన్నీళ్ళు ఎదురుగా ఉన్న దీపాన్ని ఆర్పివేస్తాయేమో అన్న భయంతో ఆమె తన ముఖాన్ని అటుగా తిప్పి దీపం పెడుతున్నది. ఇది ఈ గాథ భావం. ఈ సన్నివేశం, భావం కరిగించలేని హృదయం ఉండగలదా!?

హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (4)

శ్రీనాథుని పద్యపు ప్రథమ పాదంలోని ‘దావగొను’ అనే పదానికి సంబంధించి విశేషంగా చర్చ జరిగింది. నిఘంటువులలో కనుపించని పదం ఇది. శ్రీనాథుడు ఈ పదాన్ని ‘విన్నావా? చెవిన పెట్టావా?’ అన్న అర్ధంలో వాడాడనేది స్పష్టం. ఈ పదం స్థానంలో ‘తావు గొనవా’, ‘తావి గొనవా’, ‘తాల్మి గొనవా’, ‘త్రావ గనునా’ ఇత్యాది పదాలను ఉంచి, అప్పట్లో చర్చలో పాల్గొన్న పెద్దలు, అర్ధం పొసిగేలా చేయాలని ప్రయత్నించారుగాని, ఈ పదాలలో ఏదీ శ్రీనాథుడు చెప్పిన ‘దావ గొనవా’ అన్న పదం చేకూర్చిన అందాన్ని అక్కడ ఇవ్వలేక పోవడంతో అలాగే వదిలేయక తప్పిందికాదు. ఇలాగే, మూడవ పాదంలో ‘తగవా మగవారల దూఱ’ అన్న చోట కూడ అర్ధానికి తగినట్లుగా మాటల పొంతన సరిగా కుదిరినట్లు కనుపించదు.  ‘తప్పు నీ దగ్గర పెట్టుకుని, కోపగించుకున్నాడని పతిమీద పోట్లాడడం తగునా?’ అని చెప్పడం అక్కడి సందర్భం. సందర్భానికి సరిపోయేట్లుగా లేవనిపించినప్పిటికీ, పద్యపు నడకను దృష్టిలో ఉంచుకుని చూసినప్పుడు, ఆ పదాలను శ్రీనాథుడు చెప్పినట్లుగానే ఉంచేయడం మేలనిపించి ఎటువంటి మార్పూ చేయకుండా అలాగే ఉంచేయడం జరిగింది. తెలుగు భాషా సాహిత్యాలపైన మక్కువ గల వారికి, శ్రీనాథుడు తెనిగించిన ‘గాథా సప్తశతి’ లభించి ఉన్నట్లయితే అందులో ఇంకా ఇలాంటివే ఎన్నెన్ని ఆసక్తికరమైన, సుందరమైన భాషా ప్రయోగాలు వెలుగు చూసి వుండేవో గదా! అనిపించక మానదు.

ఇదిలా ఉండగా, ఆశ్చర్యకరమైన విషాయాలేమిటంటే, క్రీ.శ. 1931 దాక శ్రీనాథుని ‘శాలివాహన సప్తశతి’ కావ్యం లభ్యమై ఉండినదనడానికి నిదర్శనాలు ఉన్నాయి. క్రీ.శ.1931 లో జరిగిన కాకతీయ చారిత్రక మహోత్సవాలలో భాగంగా జరిగిన గ్రంథ ప్రదర్శనలో శ్రీనాథుని ‘సప్తశతి’ ప్రదర్శించబడినట్లుగా ‘కాకతీయ సంచిక’ కు అనుబంధమైన ‘ఉత్సవమున ప్రదర్శించిన గ్రంథములు’ పట్టికలో ఉన్నట్లుగానూ, ఆచార్య బిరుదురాజు రామరాజుగారి తాతగారి వద్ద ఉండిన ప్రతిని ప్రదర్శనకోసం ఇవ్వగా, ప్రదర్శనానంతరం ఆ ప్రతి తిరిగి వారి వద్దకు చేరలేదని చెబుతారని ‘అలబ్ధ కావ్య పద్య ముక్తావళి’ లో ఉల్లేఖాన్ని బట్టి తెలుస్తుంది. ఇదే కాకుండా, మాన్యులు మానవల్లి రామకృష్ణ కవిగారు ఈ పద్యాన్ని, తాము ఉధ్ధరించి ప్రచురించిన నన్నెచోడుని ‘కుమార సంభవం’ ప్రథమ భాగంలో ఉదాహరిస్తూ, ఇది శ్రీనాథుని సప్తశతిలో నాల్గవ ఆశ్వాసంలోనిదని పేర్కొన్నారనీ, ఇందు మూలకంగా కవిగారి వద్ద శ్రీనాథుని సప్తశతి ప్రతి ఉండినదేమో, చెప్పలేం అనీ, కూడ ఈ గ్రంథంలోని ఉల్లేఖాన్నిబట్టి తెలుస్తుంది.

ఏదేమైనా,  కాల ప్రవాహంలో ఏమంత వెనుకటిది కాని, క్రీ.శ.1931 దాకా లభ్యమై వుండిన శ్రీనాథుని ‘సప్తశతి’ అప్పటిలోనే ముద్రణ భాగ్యానికి నోచుకోక పోవడం ఆంధ్రుల దురదృష్టం. సాహిత్యాభిలాషులూ, పెద్దలూ, ప్రచురణకర్తలూ పూనుకుని వెదికితే ఇప్పటికయినా శ్రీనాథుడు తెనిగించిన ‘సప్తశతి’ ప్రతి లభించవచ్చునేమోనని అనుకోవడం అత్యాశ కాదు గదా!

(‘భారతి’ లో స్వర్గీయ తిరుమల రామచంద్ర గారి వ్యాసాలు, డా.రవ్వా శ్రీహరి గారి సంపాదకత్వంలో వెలువడిన ‘అలబ్ధ కావ్య పద్య ముక్తావళి’ గ్రంధం ఈ వ్యాస రచనలో సంప్రదించడం జరిగింది.)

హాలుడు, శ్రీనాథుడు, గాథా సప్తశతి (3)

శ్రీనాథుడు ఆంధ్రీకరించిన ‘శాలివాహన సప్తశతి’ ఇప్పుడు అలభ్యం. అందులోనివిగా చెప్పుకునే ఐదు పద్యాలు మాత్రమే ఇప్పుడు లభ్యమై ఉన్నాయి. ఈ అయిదింటిలో రెండు వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామం’ లో ఉన్నాయి. మిగతా మూడూ విడిగా లభ్యమై ఉన్నాయి. ఈ మూడింటిలో ప్రసిధ్ధమైనది ‘వారణ సేయ దావ గొనవా’ అనే పద్యం. క్రీ.శ.1960 సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మాసాల భారతి సంచికలలో ఈ పద్యం పై ‘తెలుగు మఱుగులు’ శీర్షికన చర్చ జరిగింది. ఈ పద్యానికి మూలమైన ప్రాకృత గాథ పాఠం, దాని సంస్కృత చాయ, చర్చ చివరన పెద్దలు అంగీకరించిన శ్రీనాథుని పద్య పాఠం (ఉత్పలమాల వృత్తంలో) వరుసగా:

“కస్స వ ణ హోఇ రోసో దష్టూయ పియాఏ సవ్వణం అహరమ్
సభమర ఉపమగ్ఘాఇణి వారిఅవామే సహసు ఏహ్మిమ్”

“కస్యవా న భవతి రోషో దృష్ట్వా, ప్రియాయాః సవ్రణ మధరమ్
సభ్రమర పద్మా ఘ్రాణశీలే! వారితవామే! సహస్వేదానీమ్.”

“వారణసేయ దావ గొనవా? నవ వారిజ మందు తేటి క్రొ
వ్వారుచునుంట నీ వెరుగవా? ప్రియ వాతెఱ గంటు కంటి కె
వ్వారికి కెంపు రాదు? తగవా మగవారల దూఱ? నీ విభుం
డారసి నీ నిజం బెరుగు నంతకు నంతకు నోర్వు నెచ్చెలీ!”

శ్రీనాథుని ఈ పద్యం పై ఒకింత ఆసక్తి కరంగా జరిగిన చర్చ సారాంశం ఇది – అప్పటికి (అంటే క్రీ.శ.1960 నాటికి) లభ్యమవుతూండిన ప్రాకృత ‘గాథా సప్తశతి’ లో శ్రీనాథుని ‘వారణ సేయ’ పద్యానికి మూలమైన ప్రాకృత గాథ లేదు. అయితే, ధ్వన్యాలోక ప్రవర్తకుడైన ఆనందవర్ధనాచార్యుని ‘ధ్వన్యాలోకం’ లో ఈ ప్రాకృత గాథ ఉదాహరించబడి ఉంది. ఆనందవర్ధనాచార్యుని ‘ధ్వన్యాలోకా’ నికి అభినవగుప్తపాదులవారి లోచన వ్యాఖ్యలో ఈ ప్రాకృత గాథకు సంస్కృత ఛాయతోపాటు సవిస్తర వ్యాఖ్య ఉంది.

ఈ ప్రాకృత గాథను స్వర్గీయ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు క్రింది విధంగా తెనిగించారు:

“ఎవరి కలుక గలుగదే ప్రియురాలి కె
మ్మోవి కాటుగన్న? ముగుద! తేంట్లు
ముసరియున్న తమ్మి మూరుకొంటివి వల
దన్న వినక! సైపవమ్మ యిపుడు.”

“ఓ చెలీ! వలదని ఎంత వారించినా విన్నావా, చెవిన పెట్టావా? అప్పుడే వికసిస్తూన్న కమలంలో కనిపించకుండా తేనెటీగ మకరందాన్ని చప్పరిస్తూ వుంటుందని నీకు తెలియదా? ఇప్పుడు చూడు, నీ పెదవిపై ఏర్పడిన ఈ గంటు నీ ప్రియునికి (పతికి) కోపం తెప్పించిందంటే తెప్పించదా మరి? ఇందులో అతని తప్పేమున్నది? దానికి అతనితో తగవా? నిజం తెలిసిన మీదట అతని కోపం ఉపశమించి నీ దరి చేరేవరకూ నీవు సహించి ఊరక ఉండవలసినదే, తప్పదు మరి!” అని ఈ గాథ తాత్పర్యం. ఇందులో ధ్వని ఊహకందనిదేం కాదు. ఈ ధ్వని తెలుగులో ఇంకో స్వతంత్ర పద్యానికి కారణమైనదని ఈ క్రింది పద్యం వలన తెలుస్తుంది.

“మాకంద ఫల రసంబుల
నాకలిగొని మేము గ్రోలు నా కొమ్మలలో
చీకటినప్పుడు నొక చిలు
కేగతినో మోవి గఱచె నెఱుగవె చెలియా!”

కవి ఎవరో తెలియని ‘ఉమా మహేశ్వరము’ అనే పేరున్న ఒక అలభ్య కావ్యంలోనిదిగా లభ్యమైన ఒకే ఒక్క పద్యం ఇది. వెల్లటూరి లింగయమంత్రి కృత ‘సరసాంధ్ర వృత్తరత్నాకరం’ అనే ఛందో గ్రంథంలో ఇది ఉదాహరింపబడింది.