తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (4)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (4)

ఆంధ్రులు ఆంధ్రులుగానే ఉండకుండా వారి రాజ వంశానికి పేరుగా సాతవాహన అనే పదాన్ని రూపకల్పన చేసుకున్నారు. ఏ అద్భుత క్షణాలలో ఈ పదరూపకల్పన
జరిగిందోగాని చరిత్రలో బహుళ ప్రసిధ్ధమై చిరస్థాయిగా ఈ పదం నిలిచిపోయింది. తరువాతి కాలంలో  ఈ పదం శాలివాహన, శాతవాహన గా రూపాంతరం కూడా
చెందింది. ఇందులోని శాలివాహన పదంతో ఒక శకం ప్రారంభం జరిగింది. తొలి, అసలురూపమైన సాతవాహన పదం మహారాష్ట్రీ ప్రాకృత పదం. మహారాష్ట్రీప్రాకృతం నుంచే నేటి మరాటీ పుట్టింది కాబట్టి, ఇప్పటి మరాటీ భాషలో ‘సాతవాహన’ పదానికి అర్ధం ఈ క్రింది విధంగా సూచించబడింది (ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి – చరిత్ర చర్చ):

“సాద – ఏడు Seven or Several
సాత – ప్రతిధ్వని An echo, a hollowing or calling to
సాతు – ధాన్యవిశేషము Barley
వాహ(ణేం) – ప్రవహించు, ప్రవహింపజేయు, విత్తనములు చల్లు (to sow), దున్ను, పండించు, వ్యవసాయము చేయు (to till)…”

పై అర్ధాలను బట్టి, సాతవాహన శబ్దసంపుటికి ‘ధాన్యమును పండించువాడు’ అని పూర్వ మహారాష్టీ ప్రాకృతంలో అర్ధం అని విదితమవుతుంది అన్నారు. ఈ సాతవాహన పదం సంస్కృతంలో శాలివాహన అన్న పదానికి సరిపోయేదిగా చెప్పబడింది.

“నూనూగు మీసాల నూత్న యౌవనమున – శాలివాహనసప్తశతి నుడివితి ” అని కాశీఖండంలో శ్రీనాథుడు పేర్కొన్నది. ఇక  శాతవాహన అన్న రూపం అర్వాచీన రూపం. ఆధునిక వ్యవహారంలోనే తప్ప, పురాణ రాజనామావళులలో గానీ, శాతవాహనుల శాసనాలలో గానీ, పరంపరాగతమైన ప్రసిధ్ధ వ్యవహారంలో గానీ ఈరూపం లేదని చెప్పారు. అందువలన, శాతవాహన శబ్దానికి ఆద్య రూపమైన సాతవాహన శబ్దం మహారాష్ట్రీ ప్రాకృతంలోనిది కాబట్టి, ఆంధ్రులైన శాతవాహనుల మాతృబాష కూడా మాహారాష్ట్రీ ప్రాకృతమన్నది అంగీకార యోగ్యమవుతుంది.తమచే నిర్మించబడిన రాజవంశానికి ఎవరూ తమది కాని పరాయి భాషలో నామకరణం చేసుకోరు కదా!సాతవాహన శబ్దం సూచించే అర్ధాన్ని బట్టి, శాతవాహనులు జాతిపరంగా ఆంధ్రులు, వృత్తిపరంగా ధాన్యమును పండించే కృషీవల కుటుంబులు అన్నది సాధకమవుతుంది. ప్రాకృతం అంటే మహారష్ట్రీ ప్రాకృతమే అన్న మాట కూడా మొదటినుంచీ వ్యవహారంలో ఉంది.

“ఊరినడుమ – గ్రామ మధ్య – గామామే”

శబ్దశాస్త్రం (Philology) లో అంతర్భాగమైన స్వరశాస్త్రం (Phonology) గురించి రాస్తూ, శ్రీమాన్ మేడేపల్లి వెంకటరమణాచార్యులుగారు వారి ‘ప్రాకృతభాషోత్పత్తి’ అనే పుస్తకంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణ పాఠం ఇది:

“ఊరినడుమ” అని చెప్పుటకు “గ్రామ”, “మధ్య” అను రెండు పదములుండవలెను. ఈ పదద్వయమును సమాసముగా చేసినచో “గ్రామమధ్య” అని యగును. యుక్తముగా నుచ్చరించుట కలవాటు లేనివాడు, అశిక్షితుడు, ప్రమాదముతో నుచ్చరించువాడు “మధ్య” కు “మజ్ఝ” యని కాని, “మద్దె” యని కాని పలుకును. మరల నీ శబ్ద రూపము “మాజ్ఝ” లేక “మాధ” యని మాఱి యంతతో నిలువక “మా” లేక “మహ” యయి కొనకు “మా” లేక “మే” యయినది. ఇట్లు “గ్రామమధ్య” శబ్దము “గామమా” లేక “గామమే” యని మాఱినది. గూర్జరీ, హిందీ, మరాటీ భాషలలో నిదియే రూపము.”

ఈ ఉదాహరణ తాత్పర్యం – సంస్కృతం నుండి ప్రాకృతం (తదితర భాషలు) పుట్టాయన్నది – ఇక్కడ సుగ్రాహ్యమే!అసలుకు, సంస్కృతం ముందా లేక ప్రాకృతం ముందా అన్నది చాలా పెద్ద చర్చకు సంబంధించిన విషయం. ఎన్నెన్నో వాదోపవాదాలు జరిగాయి. ఇరువైపుల వాదనలనూ ఉదాహరణ, ఉపపత్తులతో సహా ఒకింతగా సమీక్షించిన మీదట, శ్రీ పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారు తమ “ప్రాకృత గ్రంథకర్తలూ, ప్రజాసేవానూ” వ్యాసంలో (1933 వ సంవత్సరం డిశెంబరు నెల చివరివారంలో రాజమహేంద్రవరంలో మూడురోజుల పాటు జరిగిన గిడుగువారి సప్తతితమ జన్మదిన మహోత్సవ సభకు అధ్యక్షులుగా వ్యవహరించిన పంచాగ్నులవారు గిడుగువారికి సమర్పించిన అభినందన సంపుటమైన ‘వ్యాస సంగ్రహం’ లోనిది ఈ సుదీర్ఘ వ్యాసం) తేల్చినది – “వీటివల్ల తెలినది ఏమిటంటే – అన్నిభాసలకూ అసలు మాతృక ప్రాకృతమే అనీ, సంస్కృతాది భాషలు ఈ మాతృకకు పుత్రికలు అనీ.  ఇది పై సందర్భాల చర్చచేత తేలిన తాత్పర్యాంశం” అని. నాకయితే, ఈ తాత్పర్యాంశం నా పరిమిత బుధ్ధికి ఒకింత నేల విడిచి చేస్తున్న సాము లాగా అనిపించినా, ఈ విషయమై ఆ సంగతిని తగినవిధంగా విశదపరచగలిగేటంత పాండిత్యమూ, ప్రజ్ఞా ఏమాత్రమూ లేనివాడనవడం చేత, ఈ సంగతులన్నిటినీ విని (లేదంటే చదివి) ఊరకుండడమే క్షేమమని అనుకుంటూ ఉంటాను.

కనుక, సంస్కృతం, ప్రాకృతం – ఈ రెండు భాషలలో ఏది ముందు ఏది వెనక అయినప్పటికీ, ప్రాచీన భారతదేశంలో సంస్కృతం అనీ ప్రాకృతం అనీ రెండే భాషలుండేవి గాబట్టీ, ప్రాకృతం ప్రజల భాష కాబట్టీ, వృత్తి చేత కర్షకులైన ఆంధ్ర శాతవాహనుల భాష ప్రాకృతం అవడంలో అసందర్భమేమీ లేదు.

శ్లో. అయి రమణీయా రమణీయ,
సరఓ వి మణోహరో తుమం చ సాహీణో,
అణుకూల పరియణాయే,
మన్నే తం నత్థి జం ణత్థి.

తా కింపి పదోసవిణోదమేత్తనుహ అం మణహరుల్లావం,
సా హేయి అపువ్వకహం సురసం మహిళాయణమణోజ్జం.

కుతూహలుడనే కవి మహారాష్ట్రీ ప్రాకృతంలో వ్రాసిన లీలావతి కథ అనే కావ్యంలోనిది ఈ శ్లోకం. ఈ శ్లోకానికి అర్ధం:

అయి రమణీయా = రాత్రి రమణీయంగా ఉంది.
రమణీయ సరఓ వి మణోహరో = దానికి తగినట్లే శరత్కాలమూ మనోహరంగా ఉంది.
తుమం చ సాహీణో = (ప్రేమాస్పదుడవైన) నీవునూ (నాకు) స్వాధీనుడవై ఉన్నావు.
అణుకూల పరియణాయే = పరిజనులు కూడా అనుకూలురుగా వున్నారు.
మన్నే తం నత్థి జం ణత్థి = (అట్లాంటి) నాకు లేనిది లేదనే అనుకుంటాను.
తా కింపి = కనుకా, ఏదేనా
పదోస విణోదమేత్త సుహ అం = ఈ ప్రదోషకాలాపువినోదానికి తగినట్టిదిగాను
మణహరుల్లాసం = మనసుకు ఉలాసాన్ని కలిగించేదిగానూ (అయినట్టి)
అపువ్వకహం = అపూర్వమైన (ఇంతకు ముందు ఎవ్వరూ చెప్పి ఉండనట్టిది)
సురసం = చక్కని రసం జాలువారే దాన్ని
మహిళాయణ మణోజ్జం = మహిళాజనానికి ఇంపుగొలిపేది (అయినట్టి కథను)
సా హేయి = సాధించండి (అంటే చెప్పండి అని ఒక ప్రియురాలు ప్రియునితో అంది).

పంచాగ్నుల ఆదినారాయణ్శాస్త్రిగారు తమ “ప్రాకృతగ్రంథకర్తలూ, ప్రజాసేవానూ” వ్యాసంలో చెప్పిన అర్ధాన్ని పై అర్ధవివరణకి అధారంగా తీసుకుని చెప్పడం జరిగింది. ఈ వ్యాసంలోనే సందర్భవశాన ఈ లీలావతి కథ గురించి వారు చెప్పిన విషయాలు ఇవి:

“ప్రాకృతవాఙ్మయంలో లీలావతి కథకు అగ్రస్థానం ఇస్తారు. ఆంధ్రులమైన మనం తప్పకుండా ఇయ్యాలి. ఏమంటే – అది ఆంధ్రదేశమునకు సంబంధించిన వక చారిత్రక కథ అనీ, అందులో ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలు వర్ణింపబడ్డాయనీ శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు చాలారోజులక్రింద భారతిలో 2,3 వ్యాసాలు ప్రకటించారు.  గ్రంథం కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు.  ఆంధ్రులు ఆయనచేత త్వరలో ఆ గ్రంథం ప్రకటిత మయ్యేట్టు యత్నించాలి.”

మరి ఈ గ్రంథం ప్రకటితమయిందా? అంటే నాకు తెలిసినంతలో లేదు. శ్రీ మానవల్లివారు సేకరించిన ఈ గ్రంథం ప్రతి ఏమయిందో తెలీదు. కనీసం భారతిలో వ్యాసాలన్నా చూద్దామంటే, ఇప్పటివరకూ యత్నించినంతలో నాకు దొరకలేదు,ఇంకా వెదకడానికి కుదరడంలేదు. ఆయన సేకరించిన గ్రంథప్రతి ఇప్పుడు లభ్యమవుతూందా? అంటే సందేహమే! అయినా ప్రయత్నించేవారెవరు? ఆయన చెప్పినట్లు, అందులో వర్ణించబడిన అప్పటి ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలకు సంబంధించిన సమాచారం,ఇంకా పైన ఉదాహరించిన శ్లోకంలో వంటి సహజమైన, మనోహరమైన వర్ణనలూ, తెలుగులో చదువుకోవడానికి వీలయేట్లుగా పరిష్కరించబడి ఉన్నది కాలగర్భంలో కలిసిపోయిందనే అనుకోవాలా?!

***

కవిగారు (మానవల్లివారు “కవిగారు” గా ఆంధ్ర సాహిత్యలోకంలో ప్రసిధ్ధులు) సంపాదించి ముద్రించలేక పోయిన ఈ  లీలావతి కథ   కావ్యాన్ని తలుచుకున్నప్పుడల్లా,  నాకు విశాఖపట్నంలో కవిగారు (మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు) అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిన నుడికడలి   అచ్చతెనుగు పదాల నిఘంటువు గుర్తొసుంది. ఈ అముద్రిత అసంపూర్తి నిఘంటువు ప్రస్తావన శ్రీశ్రీ గారి   అనంతం ,  అబ్బూరి వరదరాజేశ్వరరావుగారి  కవనకుతూహలం  ఇత్యాది పుస్తకాల్లో వస్తుంది. అసంపూర్తిగానైనా ఈ అచ్చతెనుగు పదాల నిఘంటువుని సంపాదించి ప్రచురిస్తే భాషకు సంబంధించినది కాబట్టి ఎప్పటికైనా ఉపయోగం అనిపిస్తుంది.  ఇలాంటివే ఇంకా ఎన్నెన్నో మంచి పుస్తకాలు. ముఖ్యంగా టేకుమళ్ళ కామేశ్వరరావుగారి   నా వాఙ్మయ మిత్రులు  పుస్తకం చదువుతున్నప్పుడు ప్రస్తావన కొచ్చి అబ్బురపరిచేవి. అముద్రితాలుగా మిగిలిపోయినవీ, ఇప్పుడు అలభ్యం కాటగిరీ లోకి వెళ్ళిపోయినవీ ఎన్నెన్నో పుస్తకాలు! ఆంధ్రపత్రిక వారి ఆధ్వర్యంలో వెలువడిన  భారతి   మాసపత్రిక గురించి వేరే చెప్పక్కరలేదు! అందులో ప్రచురితాలైన చరిత్ర, సాహిత్య సంబంధ వ్యాసాలలో అత్యుత్తమైన వాటిని ఏరి ఒకటి రెండు సంపుటాలుగా నన్నా ప్రచురిస్తే బాగుంటుందని ఆలోచన! వీటిల్లో ఏ ఒకటిరెండు సాధించగలిగినా  జన్మ ధన్యమైనట్లుగా అనిపిస్తుంది. సమయం, శక్తి, డబ్బు వీలుచిక్కినంతలో వీటికోసం ఖర్చుపెట్టడం ఉపయోగం అని ఎప్పటినించో ఉన్నా,  అమలుపరుచుకోవాలని ఈ మధ్యనే తీసుకున్న నిర్ణయం!

కనుక, ఈ బ్లాగుకు ఇది ఆఖరి పోస్టు. This blog may now be treated as closed for all purposes!

ధన్యవాదాలు!

సెలవు!

ప్రకటనలు

తెలుగు మాట, పాట, పద్యం (5)

అచ్చ తెనుగు పద్యం

తెలుగు పద్య సాహిత్యంలో ‘అచ్చ తెనుగు’ అన్న మాటను మొదటి సారిగా వాడిన వ్యక్తి మూలఘటిక కేతన అని చెబుతారు. ఈయన తిక్కన మహాకవి సమకాలికుడు. తెలుగులో మొదటి కథాకావ్యానికి (దశకుమార చరిత్ర) శ్రీకారం చుట్టినవాడు కేతన. ‘కవిత చెప్పి’ తిక్కన మహాకవినే మెప్పించినవాడు ఈయన.  ఈయన చెప్పిన ఈ ‘అచ్చ తెనుగు’ అనే మాటకు ముందు, ఈ మాట ఏ అర్ధాన్నయితే సూచిస్తుందో అదే అర్ధంలో ‘జాను తెనుగు’, ‘దేశి’ అనే మాటలు వాడుకలో వుండేవి. ఈ మాటలను తమ పద్యాలలో చెప్పిన వారు ‘నన్నె చోడుడు’, పాలుకురికి సోమనాధుడు!

పేరుకి ఇన్ని మాటలున్నా, ఈ మాటలు ‘అచ్చ తెనుగు’ భాషా స్వరూపాన్ని అర్ధమయేలా చేయడంలో సఫలీకృతం కాలేకపోయాయన్న ఒక అభిప్రాయం, విజ్ఞుల మాట కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాలి! భాషా స్వరూపం అర్ధం కావాలంటే, ఒక ఉదాహరణంతో చెప్పుకుంటే, కొంతలో కొంత స్ఫష్టత వచ్చి, సులభం అవుతుంది.

“పగలు సేయుచు వేడిమి మిగుల జగము
గ్రాచు జమునబ్బ మున్నీట గలిసె ననియొ
తొగ వెలందుక నగియె నమ్మగువ పెంపు
గని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”

కూచిమంచి తిమ్మకవి రచించిన ‘అచ్చ తెలుగు రామాయణం’ కావ్యంలోనిది ఈ పద్యం. సూర్యాస్తమయాన్ని సుందరంగా వర్ణించే పద్యం! నాకయితే, ఈ పద్యంలోని మాటల పొందిక, brevity, గాథా సప్తశతిలోని గాథలను తలపుకు తెస్తుంది. మంచి భావంతో నిండి వున్న పద్యం! ఊహ original ది! నాకు తెలిసినంతవరకూ, ఏ ప్రాకృత గాథనుంచో, సంస్కృత శ్లోకంనుంచో ఎత్తుకొచ్చింది కాదు!

ఇప్పుడు, ఈ పద్య భావాన్ని కొంచెం విడమరచి చెప్పుకుంటే…

‘పగలు సేయుచు’ – పగలు సేయువాడు – దినకరుడు.
సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ, కొన్ని రకాలయిన సంస్కృత సమాసాలు అచ్చ తెలుగులోకి మారేటప్పుడు జరిగే మార్పులను గురించి కొంత వివరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో సంస్కృత సమాసాలలోని ప్రత్యయాలకు బదులుగా తెలుగు సమాసాలలో వాడు, దొర, తపసి, జోదు…ఇత్యాది శబ్దాలు జతవుతాయి అని వ్యాకరణం. ఉదాహరణకి:

అచ్చ తెలుగులో ‘కప్పు కుత్తుక వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘నీలకంఠ’ కు,
అచ్చ తెలుగులో ‘గిత్త తత్తడి వాడు’ అనే సమాసం, సంస్కృతంలో ‘వృషభ వాహన’ కు,
అచ్చ తెలుగులో ‘వెంట్రుక యడుగుల దొర’ అనే సమాసం, సంస్కృతంలో ‘రోమ పాద’ కు,
అచ్చ తెలుగులో ‘మనుబోతు కొమ్ము తపసి’ అనే సమాసం, సంస్కృతంలో ‘ఋష్యశృంగ’ కు,
అచ్చ తెలుగులో ‘పచ్చ వారువపు జోదు’ అనే సమాసం, సంస్కృతంలో ‘హరిదశ్వా’ కూ అనువాదాలని పెద్దల వివరణ. తెలుగులో వీటినే బహువ్రీహి సమాసాలుగా భావిస్తారని కూడా చెబుతారు, అర్ధంలో చివరన కలది, కలవాడు చేరతాయి కాబట్టి. (నల్లని కంఠము కలవాడు, ఎద్దును వాహనముగా కలవాడు…ఇత్యాదిగ).

నాకయితే తెలుగులో ఈ మాటలు, సంస్కృతంలో మాటలు ఎంత అందంగా కనిపిస్తాయో, తెలుగులోనూ అంతే అందంగా అనిపిస్తాయి. ఇలాంటివే ఇంకొన్ని సమాసాలు:

వలిగుబ్బలి రాచ కూతురు (హైమవతి – హిమవంతుని కూతురు, ‘వలిగుబ్బలి’ అంటే మంచుకొండ అని అర్ధం), పుట్ట బుట్టువు తపసి (వాల్మీకి – పుట్ట  నుంచి పుట్టిన తపస్వి), పదియరదముల దొర కొడుకు (దాశరధి – దశరధుని కుమారుడు) – ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలంత అందంగానే కనబడతాయి.

ఇక్కడితో ఇది ఆపి, అసలు పద్యానికొస్తే —

పగలు సేయుచు – పగటిని చేస్తూ, ఆ క్రమంలోనే; వేడికి మిగుల జగము గ్రాచు – వేడిమితో జగత్తునంతా వుడికించి ఇబ్బందికిలోను చేసే; యమునబ్బ – యముని తండ్రి (సూర్యుడు); మున్నీట – సముద్రములోనికి; కలిసె ననియొ – కలిసిపోయాడుగదా అని; తొగ వెలందుక – కలువ పూవు (అనే పడతి); నగియె – నవ్వింది; అమ్మగువ – ఆ కలువ సుందరి; పెంపు గని – సంతోషంతో వదనం పెద్దదవడం (కలువ వికసించడం అన్న భావం) చూసి; సయింపక – తాళ లేక; తమ్మి – తామర పూవు (అనే పడతి); మొగంబు మొగిచె – మొహం ముడుచుకుంది, చాటు చేసుకుంది.

సూర్యాస్తమయంతోనూ, చంద్రాగమనంతోనూ కలువలు వికసించడం అనేది ప్రకృతి ధర్మం. సూర్యాస్తమయంతో తామరలు వికసనం కొల్పోయినట్లయి, కళావిహీనంగా, ముడుచుకున్నట్లయిపోవడమూ ప్రకృతిధర్మమే! ఈ రెండు ధర్మాలనూ కలబోసి, ఒకే సందర్భానికి జతచేసి, హృద్యంగా చెప్పడం ఈ పద్యంలో జరిగింది.

నాకు ఈ పద్యాన్ని చదివినప్పుడల్లా, ఇంకొకటి కూడా అనిపిస్తుంది. పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గాథా సప్తశతి లోని పద్యాలను తెలుగులోకి అనువదించడంలో ఈ పద్యాన్నే(సరిగ్గా ఈ పద్యాన్నే అని కాకుండా, ఇలాంటి పద్యాలనే) ఆదర్శంగా తీసుకున్నరేమో! అని. ఎందుకంటే, అందులోని చాలా పద్యాల నడక ఈ పద్యాన్నే పోలి వుంటుంది. ఉదాహరణకి:

“అడుగుదమ్ములందు బడివేడు పతివీపు
జిన్ని కొమరుడెక్కి చెలగి యాడ
అలుక యెంత తెగనిదయ్యును నిల్లాలి
మొగమునందు నవ్వు మొలచె నపుడు! ”                (శతకం 1 గాథ 11)

“ఎవని వదలిన జీవంబు నవసి చనునొ
యతని నపరాధినయ్యు నోదార్ప వలయు;
ఊరు గాలుచు బొలిపోవు చున్న గాని
యగ్గి నొల్లని వారెవ్వరతివ, చెపుమ?”         (శతకం 2, గాథ 63)

అందుండి అచ్చ తెలుగు మాటలలో వున్న ఇలాంటి రమ్యమైన పద్యాలను ఇంకా చాలానే ఉదాహరించవచ్చు!

తెలుగు మాట, పాట, పద్యం (4)

తెలుగులో శతక సాహిత్యంలో అధిక్షేప శతకానిది ఒక ప్రత్యేకమైన శాఖ అయితే, అందులో వేణుగోపాల శతకానిది ఒక విశిష్ఠ స్థానం అన్నది తెలిసినదే! ఈ శతకాన్ని రచించినది పోలిపెద్ది వేంకటరాయ కవి.  ఇతడు కార్వేటి సంస్థాన కవులలో ప్రముఖుడు అని చెబుతారు.

వేణుగోపాల శతకంలోని పద్యాలలో తెలుగు నానుడులు, సామెతలు అనదగినవి చాలా (పద్యాలకు అనువైన భాషలో)  పద్యాలలోకి ఎక్కి కనబడతాయి. వాటిలో కొన్ని మంచివాటిని పద్యాలలోంచి ఏరి విడిగాతీసి చూపించడం ఇక్కడ జరిగింది:

పొరుగూరి కేగిన పోవునే దుర్దశ
కాదె పెండిలి సన్నికల్లు దాచ
డొంకల డాగ పిడుగుపాటు తప్పునే    (డొంకలలో దాక్కుని పిడుగుపాటునుంచి తప్పుకోగలమా? అని)
కాలడ్డ నిలుచునే గాంగ ఝరము       (గంగా ప్రవాహాన్ని కాలడ్డుపెట్టి ఆపగలమా?)
ఇంకిపోవునే అనావృష్టి జలధి            (దేశంలో అనావృష్టివలన సముద్రం ఇంకిపోతుందా?)
అర్కుడుదయింప చెడునె గుహా తిమిరము  (గుహలో చీకటి సూర్యోదయంతో తొలుగుతుందా?)

పెట్టిపోసిన నాడె చుట్టాల రాకడ
సేవ చేసిన నాడె క్షితినాదు మన్నన
విభవంబు గల నాడె వెనువెంట తిరుగుట   (ఇవన్నీ సమానార్ధకాలే!)

‘అభావ విరక్తి’ అని ఒక అవస్థ వుందని, దానికి ఈ క్రిందివి వుదాహరణలనీ ఒక పద్యంలో చెప్పి…

శక్తి చాలని నాడు సాధుత్వం వహించడం
విత్తహీనుడు ధర్మ వృత్తి తలచడం
వ్యాధి పీడితుడు దైవతాభక్తి దొరలాడడం
పని పోవ మౌనవర్తనం దాల్చడం
రమణి లేకున్న విరక్తి మంచిది అనడం
భారము పైబడ్డ (పుడు) బరువెఱుంగడం (బరువు గుఱించి ఉపన్యాసాలివ్వడం)…

ఇత్యాది ‘అభావ విరక్తు’ ల వలన, తత్కాల విరక్తుల వల్ల ఫలితంలేదంటూ….

తినక చవి చొరకయె లోతు తెలియబడునె (తినక రుచి, దిగక లోతూ తెలియడం సాద్యం అవుతుందా?) అనే సామెత చెప్పబడింది.

ఆశకు ముదిమియు అర్ధికి సౌఖ్యంబు
ధనపరాయణునకు ధర్మచింత
అల్పవిద్యునకు అహంకారదూరత
పాపభీరుత సంతానబాహ్యునకు
కలదనెడువార్త కలదె లోకములయందు… (దీనికి ఏమీ వివరణ అవసరంలేదు కదా!)

ఈతకు మిక్కిలి లోతు లేదు
కవిజనంబుల కెఱుంగనివి లేవు

మెఱుపు దీపంబౌనె మేఘంబు గొడుగౌనె
అల యెండమావులు జలంబు లౌనె
కాని వస్తువు పట్టుకో కాంక్షచేత
పెనుగు మాత్రంబెగాని లభింపదేమి….

పొయిపాలికే పాలు పొంగుటెల్ల
ఆఱిపోయెడి దివ్వె కధిక దీప్తి
కట్టనిల్వని చెర్వు గడియలోపల నిండు
బ్రతుకజాలని బిడ్డ బారెడుండు
పెరుగుటయు విఱుగుటకని యెఱుగలేక
అదిరిపడుచుండు నొక్కొక్క అల్పజనుడు….

వలపు రూపెరుగదు
ఆకలిలో నాల్క అరుచి యెరుంగదు
కోపం బెదుటి గొప్పకొద్దు లెఱుంగదు
నిదుర సుఖం బెఱుంగదు
హరునకైనను నివి గెల్వ నలవికాదు
ఇతరులైనట్టి మానవులెంతవారు….

పైన చూపినవన్నీ అదనంగా వివరణ యేమీ అవసరంలేకుండానే అర్ధమయ్యేవీ,  తక్కువ మాటలలో చక్కటి నిజాలను చెప్పేవీను! వాటిల్లో కొన్ని ఇప్పటికీ  సామెతలుగా అదపాదడపా నిత్యవ్యవహారంలో పెద్దవాళ్ళనోట వినిపిస్తూనే వున్నాయి కూడానూ!

*****

తెలుగులో అధిక్షేప శతకాలు రచించిన వారిలో కూచిమంచి తిమ్మకవి, జగ్గ కవి అని ఇద్దరు కవులున్నారు.  వీరిద్దరూ అన్నదమ్ములని తెలుస్తూనేవుంది కదా! కూచిమంచి తిమ్మకవి రచించిన శతకం శ్రీ భర్గ శతకం, జగ్గ కవి రచించిన శతకం శ్రీ భక్తమందార శతకం. వీరు  క్రీ.శ.18 వ శతాబ్దానికి చెందిన వారు. వీరిలో కూచిమంచి జగ్గకవి తెలుగులో మొట్టమొదటి అధిక్షేప ప్రబంధకర్తగా ప్రసిధ్ధుడు.  ఆ ప్రబంధం పేరు ‘చంద్రరేఖా విలాపము’. ఇందులోని కవిత్వ స్థాయిని C.P.Brown దొర కూడా మెచ్చుకున్నాడని ఎక్కడో చదివినట్లు గుర్తు.

ఆ సంగతి అలా వుంచి, ప్రస్తుత విషయానికి వస్తే – వీరిరువురు రచించిన అధిక్షేప శతకాలను  ఇప్పుడు తలుచుకోవడానికి కారణం, వీరిరువురూ వారి శతకాలలోని పద్యాలలో వాడిన పరభాషా పదాలను గుఱించి ముచ్చటించుకోవడానికి! పరభాషా పదాలలో వీరు మక్కువపడి అన్నట్లుగా ఒకటికి రెండుసార్లు వాడిన పదం  ‘ఇల్ల’. ఈ పదం తమిళ భాషలోనిది.  ‘లేదు’ అని తమిళంలో ఈ మాటకు అర్ధం. ఎందుకు అంత మక్కువపడి ఈ పదాన్ని వీరు వాడారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ‘ఇల్లె’ అనే ఈ మాటకు బదులు తెలుగు పదం ‘లేదు’ అన్నది వాడొచ్చు, ఛందోభంగం ఏమీ కాదు. (సుఖం ఇల్లె, సుఖం లేదు – తేడా ఏమీ లేదు).

“కోపంబెక్కువ; తాల్మి యిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబు తీల్”

కూచిమంచి తిమ్మకవి – శ్రీ భర్గ శతకము లోనిది ఈ శార్దూల పద్య ప్రథమ పాదం. ఈ పాదంలో  చివరిపదం   ‘తీల్’ అనేది కూడా పరభాషా పదమే, జగ్గకవి భక్తమందార శతకంలోని ఒక పద్యంలో ఈ పదం ‘తీర్’ అని కనిపించింది, నేను చూసిన పుస్తకంలో.  ఇది అచ్చు తప్పు అయివుండాలి. ఈ పదం తీల్/తీర్ ఏ భాషా పదమోగాని, అర్ధం మాత్రం ‘లేదు’ అనే అన్నది సందర్భాన్ని బట్టి అర్ధమై పోతుంది!

కూచిమంచి జగ్గకవి రచించిన శ్రీ భక్తమందార శతకం నుండి ఈ క్రింది పద్య పాదాలు:

“దానంబిల్లె, దయారసంబు నహి, సద్ధర్మంబు తీర్, మీపద
ధ్యానంబున్ గడులొచ్చు…..”

“క్రతువుల్ సేసెదనంటినా, బహుపదార్ధంబిల్లె!…”

అదలా వుంచితే, కూచిమంచి జగ్గకవి భక్త మందార శతకంలో నాకు బాగా ఆసక్తి కరంగా అనిపించిన ఒక మాట ‘దేమస’ అనే మాట. ఈ మాట బ్రౌన్ నిఘంటువులోనికి కూడా ఎక్కలేదు. ఇది ఇప్పుడు ‘తమాషా’ అన్న అర్ధంలో వాడకంలో వుంది.  భక్తమందార శతకంలోని ఆ పద్యం, మత్తేభం:

“రసికోత్తంసులు సత్కులీనులు మహాద్రాఘిష్ఠ సంసార ఘో
రసముద్రాంతరమగ్నులై దరికి జేరన్ లేక విభ్రాంతిచే
పసులం గాచిన మోటుకొయ్య దొరలం బ్రార్ధింతు రెంతేని దే
మసగాదే యిది యెంచిచూచినను రామా! భక్త మందారమా!”

తెలుగు మాట, పాట, పద్యం (3)

ఏ భాషలో నైనా సరే, పద్యం పదికాలాల పాటు నిలబడాలంటే, దానికి ముఖ్యంగా కావలసింది నడక. మంచి అర్ధసౌందర్యం కలిగిన పద్యానికి, ఒక మోస్తరు నడకైనా తోడైతే, ఆ పద్యం పదికాలాలు కాదు, వెయ్యి  కాలాలైనా నిలుస్తుంది. తెలుగులో వందల కొలది చాటు పద్యాలు, అజ్ఞాతకర్తృకాలైనవి, ప్రజల నాలుకల మీదనుంచే తరంనుంచి తరానికి అంది నిలిచి వుండడానికి కారణం ఇదే గదా!

పద్యానికి ఛందస్సు వుంది. ఛందస్సులో వున్నంతమాత్రాన పద్యం పద్యమవుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. గాలికి తావి తోడైనట్లుగా, ఛందస్సుతో వున్న పద్యానికి మరొకటేదో తోడుకావాలి. ఆ ‘మరొక’ లక్షణాన్ని ప్రతిభగల కవి మాత్రమే అందించగలడు.

తెలుగు పద్యాలలో కంద పద్యానిది ఒక ప్రత్యేక స్థానం. కేవలం 64 మాత్రల నిడివి గలిగినటువంటి ఈ పద్యాన్ని రకరకాలుగా నడిపించారు మన కవులు. ఒక కవి వినూత్నంగా సాధించిన నడకను ఆ తరువాతి కవులు మక్కువతో అనుసరించిన సందర్భాలు సాహిత్యంలో చాలానే కనిపిస్తాయి. పద్యాల నడకల విషయంలో ఎవరు ముందు ఎవరు వెనుక అనే విషయాన్ని పక్కన పెట్టి, ఆయా నడకలలో తెలుగు పద్యం వయ్యారంగా నడిచిన తీరును పట్టి చూసుకుని ఆనందించడం ఒక పధ్ధతి. ఆ పధ్ధతిలో, ఇప్పుడు కంద పద్యమనే కాకుండా, మరికొన్ని రకాల ఛందస్సులలో వున్న పద్యాలను, ఆకర్షణీయంగానూ, ఆనందదాయకంగానూ వుండే వాటి ఒకటి రెండు  రకాల ముచ్చటైన నడకలని, ఆ నడకలలో వివిధ కవుల పద్యాలను, నా దృష్టికి వచ్చిన వాటిని, ఇక్కడ మరోసారి మననం చేసుకుంటూ చూపెడుతున్నాను.

“లేమా, దనుజుల గెలువగ
లేమా నీవేల కడగి లేచితి విటురా
లే! మాను, మానవేనిన్
లే, మా విల్లందికొనుము లీలంగేలన్.”

పోతనగారి భాగవతంలోనిది ఈ కంద పద్యం. ఈ పద్యానికి ఒక వీనులవిందైన నడక వుంది. ఈ నడక పోతనగారితో ఆగిపోలేదు. ఇంకా ముందుకు వెళ్ళింది. ఆడిదం సూరకవి ( క్రీ.శ.18 వ శతాబ్దం) తరం దాకా వెళ్ళింది. రేకపల్లి సోమనాథకవి అని  ఆడిదం సూరకవికి బలవత్ ప్రత్యర్ధియైన ఒక కవి ఉండేవాడట! ఆయన మీద ఒక భట్రాజు చెప్పన ఈ క్రింది కంద పద్యంలో మళ్ళి ప్రత్యక్షమైంది:

“అప్పా! రేకపలీ సో
మప్పా! విభుదాళి పాళి అమృతపు లప్పా!
ఒప్పులు నీ కవితలు వె
న్నప్పాలకు సాటి వచ్చునౌ భళి రుచులన్!”

ఈ పద్యం చెప్పి, సోమనాథకవికి రాజుగారు బహుమానంగా ఇచ్చిన దుశ్శాలువను ఆయనదగ్గరనుంచి కొట్టేశాడట ఆ భట్రాజు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో సంగతి ఏమిటంటే, కంద పద్యంలో సాధింపబడిన ఈ  నడక, క్రీ.శ.18వ శతాబ్దం వాడే అయిన కూచిమంచి జగ్గకవి భక్తమందార శతకంలో ‘మత్తేభ’ ఛందంలో వున్న రెండు పద్యాలలో సాధింపబడి కనిపిస్తుంది. ఆ పద్యాలు ఇవి:

“అదిరా! పిల్చినబల్కవేటికి? పరాకా చాలు నిం కేలగా
గదరా! మిక్కిలివేడి వేసిరిలు బాగా? నీకు శ్రీజానకీ
మదిరాక్షీ శరణంబులాన! నను ప్రేమన్ బ్రోవరా….”

“గడియల్ రెండిక సైచిరా, వెనుకరా, కాసింత సేపుండిరా,
విడిదింటం గడె సేద దీర్చుకొనిరా, వేగంబె బోసేసి రా,
యెడపొద్దప్పుడు రమ్మటంచు….”

భాగవతంలోని ద్వితీయాశ్వాసంలో పోతనగారిదే మరొక కంద పద్యం:

“రామున్ మేచక జలద
శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సు
త్రామున్ దుష్టనిశాట వి
రామున్ పొమ్మనియె పంక్తిరథుడడవికిన్.”

కందపద్యానికి ఇది వీనులవిందైన, హాయిగొలిపే నడక. అయితే ఈ అనుప్రాసమే కొంచెం ఎక్కువైతే పద్యం ఎలా వుంటుందో తెలియడానికి పోతనగారిదే ఒక కందపద్యం:

“అడిగెదనని కడువడిజను
నడిగిన దనుమగుడ నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్.”

ఇందులో మోతాదు కొంచెం ఎక్కువైందని నేననుకుంటాను.  అయితే, ఈ మోతాదులో అనుప్రాసము నచ్చే వాళ్ళూ వుండవచ్చు. కాదనలేం! ఈ రకపు నడకను, అనుప్రాసాన్ని కొంచెం మితంగా అంటే తగినంతగా వుంచి, చెప్పిన పద్యం ఎలా వుంటుందో ఈ క్రింది పద్యంలో తెలుస్తుంది:

“కడుపునకు కూడుగానక
పడి మిడిమిడి మిడుకునట్టి బడుగునకీయా
రడి అమరత్వం బేటికి
కడుపిటగాలంగ కంటకాటుక యేలా?”

కొఱవి గోపరాజు రచించిన సింహాసనాద్వాత్రింశిక లోనిదనుకుంటాను ఈ పద్యం, నాకు సరిగా గుర్తులేదు.

దొరకకుండా పోయిన తిక్కనసోమయాజిగారి ‘కృష్ణశతకము’ లోనిదిగా ఈ క్రింది పద్యం, మత్తేభ విక్రీడిత వృత్తం లోనిది, ప్రచారంలో వుంది:

“అరయన్ శంతనుపుత్రుపై విదురుపై నక్రూరుపై కుబ్జపై
నరుపై ద్రౌపదిపై కుచేలునిపయి న్నందవ్రజస్త్రీలపై
పరగం గల్గు భవత్కృపారసము నాపైగొంతరానిమ్ము నీ
చరణాబ్జంబులు నమ్మినాడ జగదీశా! కృష్ణ! భక్తప్రియా!”

తెలుగులోని సరళాతిసరళమైన పద్యాలలో ఇది ఒకటి. ఈ పద్యం చదివినతరువాత ఎవరికైనా పోతనగారి భాగవతంలోని పద్యం గుర్తుకురాకుండా ఉంటుందా? ఆ పద్యం:

“ఇంతింతై వటుడింతింతై మఱియు దానింతై నభొవీధిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్థియై!”

పోతనగారి ఈ పద్యం శార్దూలవిక్రీడిత ఛందంలోనిది.

తెలుగు మాట, పాట, పద్యం (2)

తెలుగు మాట, పాట, పద్యం - image (1)

“ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తర తారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధ బంధురో
దారసమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబులై.”

తెలుగు పద్యం ఒక పధ్ధతిగా నన్నయతోనే మొదలైంది. నన్నయచే ఆంధ్రీకరించబడిన మహాభారత భాగంలో,  అరణ్యపర్వం, చతుర్ధాశ్వాసం 142వ పద్యం ఇది. నన్నయ చివరి పద్యం.

“వర్షాకాలం గడిచి, చలి కాలం అప్పుడప్పుడే మొదలౌతున్న రోజుల నాటి రాత్రులు.  చంద్రుడు కర్పూర పరాగం లాంటి వెన్నెలను కురిపిస్తున్నాడు. ఇలాంటి చంద్రుణ్ణి చూసి అప్పుడే వికసించినటువంటి తెల్లకలువల నుంచి వెలువడుతూన్న గంధాన్ని తనలో కలుపుకుని గాలి మత్తుగా వీస్తొంది.  అలా కాస్తూన్న వెన్నెలనూ ఇలా వీస్తూన్న గాలినీ వహించి చుక్కలు మైమరచి మెరుస్తూంటే ఆ మెరుపులో రాత్రులు ఇంకా మెరిసిపోతున్నాయి” అన్నది ఈ పద్యపు భావం.

పై ఫొటోకి తెలుగులో పద్యాన్ని ఊహించుకుంటున్నప్పుడు, నా మనస్సులో మెదలిన పద్యం నన్నయగారి ఈ పద్యం. పై ఫొటోలో వెన్నెల ఎంతగా కనిపిస్తుందో నేను చెప్పలేనుగాని, నన్నయగారి ఈ పద్యం నిండా వెన్నెల పరుచుకుని కనిపిస్తుంది.

ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వర్ణించడానికి అంతే అహ్లాదకరమైన చింతనలో మనసుండాలి, చిత్తంతో మనిషుండాలి. ఈ పద్యం లిఖించేటప్పుడు నన్నయగారు కూడా అంతే ఆహ్లాదకరమైన చిత్తంతో వుండి వుంటాడని నేననుకుంటాను. అప్పటికిక స్వస్తి చెప్పుకుని, మిగతాది మరుసటి దినానికి వాయిదా వేసుకుని, మామూలుగానే నిద్రకుపక్రమించి వుంటాడనీ నేననుకుంటాను. అయితే, తెల్లవారేసరికి పరిస్థితులు మారిపోయాయి. అలా మారిన ఆ పరిస్థితులు ఎలాంటివో,  ఆ మారిన పరిస్థితులు నన్నయ భారత ఆంధ్రీకరణం అర్ధంతరంగా ఆగిపోవడానికి ఎందుకు దారితీశాయో ఇదమిధ్ధంగా తేల్చి చెప్పుకోవడానికి సరిపడా ఆధారాలేవీ చరిత్రలో మిగలలేదు. అది  ఇప్పటికీ  ఒక mystery గానే మిగిలిపోయింది.

ఏదేమైనా, నన్నయ చివరి పద్యం ఒక బధామయ సన్నివేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని నాకనిపిస్తుంది. ఆ బాధకు ఒక కారణం ఆ పద్యంలో నిండుగా వున్న ఆహ్లాదకరమైన సన్నివేశమే అని కూడా నేననుకుంటాను! తాను వెన్నెలలాగా నిండుగా మెరుపులు కురిపిస్తూ, తన వెనుక ఎంతకూ వీడని ఒక చిక్కుముడిలాంటి చీకటినీ, రహస్యాన్నీ బంధించి దాచి ఉంచడం లాంటిది ఆ సన్నివేశం!!

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (4)

నన్నెచోడదేవుని ‘కుమార సంభవం’ (4)

“వీంగు నపారసత్త్వ గుణవిస్ఫురణం బరమేశ్వరోరువా
మాంగమునందు మున్నుదయమై నియమస్థితి గొల్చి తద్దయున్
లోంగొని పేర్మితో నఖిలలోకములుం దగగాచుచున్నవే
దాంగు ననంతు విష్ణు గమలాధిపు సంస్తుతి దేల్తు సమ్మతిన్.”

ఉత్పలమాల వృత్తంలోని పద్యం – కుమార సంభవం, ప్రథమాశ్వాసం, నాల్గవ పద్యం ఇది.

ఈ పద్యాన్ని స్మరించుకోవడానికి ముఖ్యమైన కారణం, ఈ పద్యం ప్రథమ పాదంలోనూ, మూడవ పాదంలోనూ వాడిన ‘వీంగు’ ‘లోంగొని’ అనే పదాలూ, వీటితో ‘వామాంగము ‘ ‘వేదాంగు ‘ అనే పదాలలోని పూర్ణబిందుపూర్వకాక్షరం ‘గ’ కు చెల్లించిన ప్రాసమైత్రి.

ఈ ‘వీంగు’ ‘లోంగొను’ అనే పదాలు ఖండబిందు యుక్తంగా ‘వీఁగు’ ‘లోఁగొను’ అనే వాటికి పూర్వరూపాలు.  ఇప్పుడు ఇవి ఖండబిందువును కూడా విడిచిపెట్టి బిందురహితంగా ‘వీగు’ ‘లోగొను’ అనే రూపాలలో మిగిలి ఉన్నాయి.

ఈ ప్రయోగాలనే నన్నెచొడుని ప్రాచీనతకు నిదర్శనాలుగా పూజ్యులు మానవల్లి వారు చూపి, నన్నయ కవిత్వంలో గానీ, ఆ తరువాతి కవుల ప్రయోగాలలో గానీ ఇలాంటి ప్రయోగాలు లేని కారణంగా నన్నెచొడుని నన్నయకంటే పూర్వునిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. “నన్నెచోడుడు నన్నయకంటె పూర్వుడని కుమార సంభవము నందలి వ్యాకరణ ఛ్ఛందో విశేషాత్మకాపూర్వపద ప్రయోగములు సహస్ర ముఖముల ఘోషించుచున్నవి” అంటూ పూజ్యులు మానవల్లి వారు చూపిన ఉదాహరణలలో రెండు పద్యాలు ఈ క్రిందివి:

“పోండిగ నగజ తపశ్శిఖి
మూండు జగంబులను దీవ్రముగఁ బర్విన బ్ర
హ్మాండము గాఁచిన కాంచన
భాండముక్రియఁ దాల్చెఁ దత్ప్రభాభాసితమై.” (షష్టాశ్వాసం, 157వ పద్యం)

“వీండేమి సేయుఁ బంచిన
వాం డుండఁగ నిక్కమునకు వధ్యుఁడుగా నా
ఖండలుఁడు గాక యేసిన
వాండుండఁగ నేమిసేయు వరశర మనిలోన్.” (దశమాశ్వాసం, 155వ పద్యం).

పూర్ణార్ధ బిందుప్రాసము — అంటే దీర్ఘముమీది అరసున్నను నిండుసున్నగా చేసి సిధ్ధపూర్ణానుస్వార పూర్వాక్షరముతో ప్రాసను చెల్లించడం అన్నది పై పద్యాలలోని ఛ్ఛందోవిశేషం. నన్నయకానీ, ఆ తరువాతి కవులుగానీ ఈరకపు ప్రాసను ఎక్కడా వాడి యుండలేదనీ, ఇట్టి ప్రాసమైత్రి నన్నయకు పూర్వం వుండియుండును కాబట్టి నన్నెచోడుడు నన్నయకు పూర్వుడు కావలయుననీ, ‘ఇది పూర్ణార్ధబిందుప్రాసముకాదు, కవి ఈ శబ్దములను పూర్ణబిందుయుతములుగనే వాడాడు’ అనుకున్నా, పూర్వమొకప్పుడు పూర్ణమై యుండిన బిందువు తరువాత్తరువాత ఖండబిందువయినట్లు భాషాచరిత్రనుబట్టి తెలుస్తుంది కాబట్టి, అప్పుడుకూడా నన్నయకంటె నన్నెచోడుడు పూర్వుడే అవుతాడు అన్నది మానవల్లివారి వాదన.

ఇక అసలు పద్యం యొక్క అర్ధం విషయానికొస్తే:

‘వీంగు (వీఁగు) – అపార సత్త్వగుణ – విస్ఫురణన్ – పరమేశ్వరు (ని) – ఉరు వామాంగము నందు’ — విజృంభించు అపారమైన  సత్త్వగుణముయొక్క స్ఫూర్తితో పరమేశ్వరుని (శరీరంలో) యెడమభాగమందు,

‘మున్ను – ఉదయమై – నియమస్థితి – కొల్చి’ — పూర్వం ఉద్భవించి నిష్ఠతో  అతనిని సేవించి,

‘తద్దయున్ – లోంగొని (లోఁగొని) – పేర్మితో – అఖిల లోకములుం – తగ కాచుచున్న’ — (అతని అనుగ్రహముతో) ఎల్లలోకములను ప్రేమతో వశపరచుకొని సముచితముగా కాచుచున్న,

‘వేదాంగున్ – అనంతున్ – విష్ణున్ – కమలాధిపున్’ — వేదమునే శరీరముగా గలవాడూ, అంతములేనివాడూ, కమలాధిపుడూ అయిన విష్ణువును,

‘సంస్తుతిన్ – తేల్తు – సమ్మతిన్’ — మంచి స్తోత్రముతో, సమ్మతితో, సంతోషపెట్టెదను.

ఈ పద్యంలో పైకి కనబడేది విష్ణు స్తుతి. అంతరంగా, విష్ణువు ఉద్భవానికీ, ఆయన సముచితంగా అఖిల జగత్తునూ కాచుకోవడానికీ కారణమైనది శివతత్త్వమే అన్నది లీలామాత్ర ధ్వని.

 

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (3)

తెలుగు కావ్యాలు – కుమారసంభవం (3)

“హరి వికచామలాంబుజసహస్రము పూంచి మృగాంకునం దవి
స్ఫురిత మలాసితాబ్జమని పుచ్చగ జాచిన చేయి జూచి చం
దురు డది రాహు సావి వెఱ దుప్పలదూలగ జాఱుచున్న న
య్యిరువుర జూచి నవ్వు పరమేశ్వరు డీవుత మా కభీష్టముల్.”

చంపకమాల వృత్తంలో ఉన్న పద్యం ఇది, కుమార సంభవం, ప్రథమాశ్వాసం మూడవ పద్యం.

ఇందులో ఒక చిత్రమైన సన్నివేశం ఊహించబడి, పద్యంగా వర్ణించబడింది.

ఎక్కడా మచ్చంటూ లేనటువంటి వెయ్యి తామరలతో విష్ణువు శివుని శిరస్సును పూజిస్తూంటాడు. విష్ణువుచే అలా పూజలో సమర్పించబడిన తామరపుష్పాలలో, మచ్చకలిగిన (అంటే స్వఛ్ఛమైనది కాని) ఒక తామరపూవుగా భ్రమింపజేస్తూ అకస్మాత్తుగా శివుని జటాజూటంలోని చంద్రునివదనం, మృగాంక సహితంగా, కనుపించి విష్ణువును కలవరపాటుకు గురిచేయగా, కలత చెందిన మనస్సుతో విష్ణువు ఆ మలినపుష్పాన్ని తీసివేసే ఉద్దేశ్యంతో చేయిచాస్తాడు. అలా విష్ణువుచే చాచబడిన (నీల వర్ణం కలిగిన) చేతిని తనను మింగడానికి సమీపిస్తున్న రాహువుగా భ్రమసి, చంద్రుడు శివజటాజూటాన్ని వీడి పారిపోయే ప్రయత్నంలో ఉండగా,
భ్రాంతికిలోనయిన ఆ ఇరువురి చేష్టలను చూసి పరమేశ్వరుడు నవ్వుకుంటుంటాడు – ఇదీ ఆ సన్నివేశం.

‘హరి – వికచ – అమల – అంబుజ – సహస్రము – పూనిచి’ –వికసించినటువంటి నిర్మలమైనట్టి వేయి తామరలను సమర్పించి, హరి (శివునికి పూజ చేసేటప్పుడు)….

‘మృగాంకున్ – అందున్ – అవిస్ఫురిత – మల – అసిత – అబ్జమని’ –వాటిలో చంద్రుని మాలిన్యముచే నల్లనైన వికసించని తామరపూవుగా అనుకుని…

‘పుచ్చగ – జాచిన – చేయి చూచి’ –తొలగించుటకు చాచిన చేతిని చూసి…

‘చందురుడు – అది – రాహు సావి – వెఱన్ – తుప్పలతూలగ – జాఱుచున్నన్’ –చంద్రుడు దానిని (తనను కబళించడానికి వస్తున్న) రాహువని తలచి, ఆ భయంతో మిక్కిలిగా చలించి పారిపోయే చర్యలో ఉండగా…

‘అయ్యిరువుర – జూచి – నవ్వు – పరమేశ్వరుడు – ఈవుత – మాకు – అభీష్టముల్’ (భ్రమలో వింత వింత చర్యలకు పాల్పడియున్న) ఆ ఇరువురినీ చూచి నవ్వు పరమేశ్వరుడు మా కోరికలను తీర్చు గాక!

ఇందులో ‘అయ్యిరువురన్’ అనే మాట, నా జ్ఞాపకాలను ఒక్కసారిగా మా హైస్కూలు 10వ తరగతి గదిలోకి తీసుకువెళ్ళి మా తెలుగు మాష్టారిముందు బాసింపట్లు వేయించి కూర్చోబెడతాయి.

‘అయ్యిరువురన్’ అనేది యడాగమానికీ, ఆపై  త్రికసంధికి మంచి ఉదాహరణ. బాలవ్యాకరణం, సంధి/సమాస పరిఛ్ఛేదాలలోని మూడు సూత్రాలు ‘ఆ’ ‘ఇరువురన్’ అనే రెండు మాటలను ఒకటిగా సంధిస్తాయి. దీనిని వివరిస్తూ మా తెలుగు మాష్టారు ‘ఆ, ఈ, ఏ లు త్రికములు’ అనే సూత్రంతో మొదలు పెట్టేవారు. అప్పుడు ఈ పదాలు ‘ఆ + ఇరువురన్’ అని వాటి సాధారణ రూపంలో వుంటాయి. ఆ తరువాత వరుసగా –

‘సంధి లేని చోట స్వరంబుకంటె పరంబయిన స్వరంబునకు యడాగమంబగు’ (బాల వ్యా.సంధి.3)

ఆ + యిరువురన్

‘త్రికంబుమీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు’ (బాల వ్యా.సమాస.14)

ఆ + య్యిరువురన్

‘ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు ఆఛ్ఛికంబగు దీర్ఘంబు హ్రస్వంబగు’ (బాల వ్యా.సమాస.13)

అ + య్యిరువురన్ = అయ్యిరువురన్ గా  మారి మిగులుతుంది చివరికి.

ఎన్నిసార్లు ఈ త్రికసంధి సూత్రాలను practice చేయించారో చెప్పలేను…ఆ రోజులలో నిద్రలో లేపి అడిగినా అక్షరం పొల్లుపోకుండా చెప్పగలిగి ఉండేవాళ్ళం.

తెలుగు భాషపై ఏమాత్రం పట్టు సాధించాలన్నా బాలవ్యాకరణం జోలికిపోకుండా సాధ్యమవుతుందంటే నాకు సందేహమే!