“తెలుగు పత్రికల సాహిత్య సేవ” – డా|| తిరుమల రామచంద్ర (పరిచయ వ్యాసం : భాగం -4)

“తెలుగు పత్రికల సాహిత్య సేవ” – డా|| తిరుమల రామచంద్ర (పరిచయ వ్యాసం : భాగం -4)

‘సుజన రంజని’ తరువాత చెప్పుకోదగ్గ పత్రిక ‘తత్త్వబోధిని’. ఇది చెన్నపురి వేదసమాజం వారి ఆధ్వర్యాన 1864 లో వెలువడి 1870 దాకా నడిచింది. ఋగ్వేద సంహిత సస్వరంగా తెలుగు లిపిలో తొలిసారిగా ఈ పత్రికలోనే ప్రచురణ అయిందట.

తెలుగు పత్రికలలో సంపాదకీయాలు ప్రారంభించినవారు మహామహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం పంతులుగారు. సాహిత్యలోకంలో ఈయన పేరు వినని వారు అరుదు. గ్రాంధిక భాషాభిమాని.  ఈయన సంపాదకత్వంలో వెలువడిన ‘ఆంధ్రభాషా సంజీవని’ లో సారస్వత విషయ చర్చలు, సాంఘిక రాజకీయ విషయాలూ, గ్రంధ సమీక్షలు కవితలు మొదలయినవి ప్రచురితమయ్యేవట. వడ్డాది సుబ్బారాయుడు గారి శోక గీతం (elegy – తెలుగులో అప్పటిలో ఇది ఒక ప్రసిధ్ధ శోక గీతం) ఇందులోనే ప్రచురితమయిందట.  (వడ్డాది సుబ్బారాయుడు గారు వసురాయ కవి గా ప్రసిధ్ధులు. ఈయన పిల్లలకోసం రచించిన భక్త చింతామణి శతకం  ‘హిందూజన సంస్కారిణి’ అనే పత్రికలో మొదటగా అచ్చయి తరువాత 1893 లో పుస్తక రూపంగా వెలువడింది. ఆ తరువాత, అప్పటిలోనే – అంటే తెలుగు పుస్తకాలు పునర్ముద్రణ భాగ్యానికి నోచుకోవడమే కష్టమై ఉండిన ఆ
రోజులలో – ఈ చిన్న పుస్తకం 21 సార్లు పునర్ముద్రణ పొందిందట! తెలుగు సాహిత్యంలో ఏ పుస్తకమైనా ఇంత తక్కువ కాలంలో ఇన్ని సార్లు పునర్ముద్రణ పొందడం అనేది ‘భక్త చింతామణి’ శతకానికే చెల్లిందని చెబుతారు. ఈయనకు  పద్దెనిమిదేళ్ళ కొడుకు అకస్మాత్తుగా మరణించడంతో పుత్ర వియోగం సంభవించింది. అతనికి చిన్నతనంలోనే వివాహమైంది. భర్త పోయిన కొన్నాళ్ళకు ఆమె కూడా స్వర్గస్తురాలయింది. ఈ శోకంలో
ఆయన వ్రాసినదే ఈ శోకగీతం – elegy!). తెలుగు సాహిత్యంలో ఇదే తొలి శోకగీతం అని వ్రాశారు రామచంద్ర గారు ఈ సందర్భంలో.

‘ఆంధ్రభాషా సంజీవిని’ కి సమాకాలికమైన పత్రిక ‘పురుషార్ధ ప్రదాయని’. సాహిత్యలోకంలో ఇది చాలా ప్రసిధ్ధమైన పత్రిక. ఉమా రంగనాయకులు గారి సంపాదకత్వంలో బందరు (మచిలీపట్నం) నుండి వెలువడడం 1872 లో మొదలై ఆ తరువాత దాదాపు 20 సంవత్సరాలు నిరాటంకంగా సాహిత్య సేవ చేసింది. అన్ని శాఖలలోనూ సాహిత్యం విరివిగా వృధ్ధి చెందాలన్నది ఈ పత్రిక ఆశయం అని చెప్పబడింది. మహాభారత టిప్పణి, పుస్తక
విమర్శలు, వైద్య విషయాలు, వింతలూ విశేషాలూ, సామెతల గురించిన సంగతులు, సమస్యాపూరణలు, ప్రకృతి శాస్త్ర విషయాలు, భాష, మతము, నీతి, వ్యవసాయం, వర్తకం, కళలు, చేతిపనులు, కథలు, లోక వ్యవహారములు, ధర్మశాస్త్ర విహయాలు…ఇలా ఒకటేమిటి, సకల విషయాలపై ఈ పత్రిక వార్తలను, వ్యాసాలనూ ప్రచురించిందట. దీనిలో ఆంగ్ల విభాగం కూడా వుండేదట! ఆంధ్ర మహాభారతానికి గుంటూరు ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూలు ఉపాధ్యాయులుగా పనిచేస్తూండిన పరవస్తు వెంకటరంగాచార్యులు గారు ఆంగ్లంలో వ్రాసిన టిప్పణులను ఈ పత్రిక ప్రచురించింది. ఈ పత్రిక అప్పటిలో బహుళ ప్రచారంలో ఉండేదనటానికి నిదర్శనాలుగా 1872 లో ప్రచురితాలయిన పాఠకుల ఉత్తరాలను రెండింటిని రామచంద్రగారు ఇందులో ప్రచురించారు. అసలు పేర్లతో కాకుండా, ‘జి.వై. Friend of the good’ అనే పేరుతో ఒకరు – ‘ఈ దివ్యమైన పత్రిక శాశ్వతముగ ప్రతి నెలకు తప్పకుండ అచ్చువేయబడి ప్రకటితమై వృధ్ధి బొందేటట్లు భగవంతుడు కరుణించి దీవించుగాక” అని దీవనలు కురిపిస్తే, ‘దురాచార మర్దనుడు’ అనే పేరుతో ఇంకొక పాఠకుడు  ఉద్యోగం వల్ల వచ్చిన హోదాను దురుపయోగం చెస్తున్న వారిని గురించి “ఓ పురుషార్ధ ప్రదాతోత్తమా, ఈ విశేషము వింటిరా – కొందరు తహశ్శీల్ దారి మొదలగు నౌకరీ చేయువారు తమ జీవిత విశేషము చేత బండ్లు సవారీ లెక్కి వీధులవెంట వచ్చునపుడు ఆయా పంచలను కూర్చునియున్న జనులందరు లేచి దండప్రణామంబులు గావించుచుండ వలెనట!” అంటూ ఈ అనభిలషణీయమైన విషయాన్ని గురించి ఇంకా వ్రాసి చివరన “…కాబట్టి ముందైనను గ్రమముగ నడుచుకొని నట్టయిన బాగుగనుండును.” అని ముగిస్తాడు. దీనిని బట్టి ఆకాలపు స్థితిగతులు తెలుసుకోవచ్చును అంటారు రామచంద్రగారు ఈ సందర్భంగా! నిజమే గదా!

‘స్వధర్మ ప్రకాశిని’ – ఈ పత్రిక కూడా బందరు (మచిలీపట్నం) నుండి వెలువడినదే. 1873 లో మొదలై 1876 దాకా తొలి దశలో ప్రకటితమై, మధ్యలో ఆగిపోయి, పునఃప్రత్యక్షమై 1924 నుండి 1932 దాకా నడిచింది. దీని సంపాదకులు, ద్వైతం కోటేశ్వరశర్మ శాస్త్రి, కనపర్తి మార్కండేయశర్మ అనే ఇద్దరు గురు శిష్యులు. ఇరువురూ గొప్ప విద్వాంసులు. ఇందులో ప్రామణికమైన శంకరాచార్య చరిత్ర, 36 గురు మంత్రుల చరిత్ర (1100-1700) అనేవి ప్రచురితమయ్యాయట. ఈ రెండు కూడా చాలా విలువైనవి అనిపిస్తుంది. ముఖ్యంగా 36 గురు మంత్రుల చరిత్ర అనేది ఇప్పుడు అందుబాటులో ఉన్నట్లయితే చరిత్రకు సంబంధించి విద్యార్థులకూ, పరిశోధకులకూ కూడా ఉపయోగకరంగా వుండేదేమో అనిపిస్తుంది! (ఈ పుస్తకాలన్నీ ఏమయి పోయాయి? ఎవరికీ పట్టనట్లు అలా అంతరించిపోయాయా? ఇప్పుడు కష్టపడి వెదికినా కూడా దొరకవా? అన్న సందేహం కూడా కలుగుతుంది.)

‘సకల విద్యాభివర్ధని’ – ఈ పత్రిక కూడా 1872 లో మొదలై ఏడేళ్ళపాటు అంటే 1879 దాక నడిచింది. ఈ పత్రిక తెలుగుదేశంలో మొట్టమొదటి మహామహోపాధ్యాయులైన పరవస్తు వేంకట రంగాచార్యులవారి సహకారంతో విశాఖపట్టణం నుండి వెలువడేదట. ఈ పత్రికలో కవిచరిత్రలు, వైద్యం, జ్యోతిషం వంటి అంశాలపై సంగతులు ప్రశ్నోత్తరాల రూపంలో వెలువడేవట. (ఇది ఎంత మంచి ఆలోచన!). పరవస్తువారి శాకుంతలం అనువాదం ఈ పత్రికలోనే అచ్చయిందట. ఈ అనువాదం వలన కలిగిన ప్రోత్సాహంతోనే వీరేశలింగంగారు కూడా శాకుంతలం అనువాదానికి పూనుకున్నారట. పరవస్తు వారిని గురించి ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఇక్కడ ఒకటి రామచంద్రగారు చెప్పారు. అదేమిటంటే, పరవస్తువారు విఙ్ఞాన సర్వస్వాన్ని సంస్కృత భాషలో  125 (అవును, నూట ఇరవై అయిదు) సంపుటాలుగా రచించారట. అందులో రెండు సంపుటాలు ప్రచురించారట. (మిగతా సంపుటాలు ఏమయినాయో తెలీదు! దీనిని ఏమనాలి?)

ప్రకటనలు

“తెలుగు పత్రికల సాహిత్య సేవ” – డా|| తిరుమల రామచంద్ర (పరిచయ వ్యాసం : భాగం -3)

“తెలుగు పత్రికల సాహిత్య సేవ” – డా|| తిరుమల రామచంద్ర (పరిచయ వ్యాసం : భాగం -3)

వృత్తాంతిని లో ‘వివాహమును గురించిన దుర్వ్యయము’ అనే శీర్షికతో పై ఉత్తరాన్ని వ్రాసిన పాఠకుడు తన పేరును ‘లోక రక్షణి’ గా చెప్పుకున్నాడు. ఈ పేరు అసలు పేరో లేక కలం పేరో చెప్పలేము గాని, ఈ సందర్భంలో రామచంద్ర గారి ఈ క్రింది మాటలు గుర్తించదగినవి:

“గురజాడవారి యాంటీ నాచ్ ఉద్యమం కంటే ముందే ఈ లోక రక్షణి భోగం మేళాలపట్ల పడ్డ ఆవేదన అతని యీ జాబు ఎంతగా వ్యక్తపరుస్తున్నదో చెప్పనక్కర లేదు.  అలాగే వివాహాల దుర్వ్యయం గురించి కూడా.”

“వృత్తాంతిని భాష పూర్తిగా అప్పటి మద్రాసు శిష్టవ్యావహారికం. సంపాదకుని జవాబులు కూడా వ్యావహారికంలోనే ఉన్నాయి.” అన్న మాటలు కూడా గమనించదగినవి.

వృత్తాంతిని తరువాతిది వర్తమాన తరంగిణి. వృత్తాంతిని నాటికి సాహిత్య విషయాలను పత్రికలలో చర్చించడం మొదలుకాలేదు. వర్తమాన తరంగిణితో అది మొదలైంది. ఈ పత్రిక 1842 సం|| ఆగస్టు నెల 11వ తేదీ, గురువారం నాడు మొదలై 1850 దాకా నడిచింది. దీనికి పువ్వాడ వెంకటరావు అనే పండితుడు  కొన్ని రోజులు సంపాదకులుగా వ్యవహరించారు. ఈయన మహాభారత ముద్రణ విషయమై సి.పి.బ్రౌన్ దొరతో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు. మహాభారతం ముద్రణ వర్తమానతరంగిణి ముద్రణాలయంలోనే జరిగిందని ఈ ఉత్తరాల వలన తెలుస్తుంది. 1852 జనవరి 10వ తేదీన, అదే సంవత్సరం మే నెల 17వ తేదీన ఈయన బ్రౌన్ దొరకు వ్రాసిన ఉత్తరాల పూర్తి పాఠాన్ని ఇందులో రామచంద్ర గారు ఇచ్చారు.

వర్తమాన తరంగిణిలో ప్రచురితమైన ఒక పాఠకుని లేఖలోనిది ఈ క్రింది ఒక వాక్యం:

“…సదరహి వారధి ఇంతకంటే వెశేషంగా వెడల్పించి విశాలముగా కట్టిస్తే జనులకు మహా సౌఖ్యముగా వుండును.”

ఈ వాక్యంలోని ‘వెడల్పించి’ అనే ప్రయోగం (వెడల్పు చేయించి అనే అర్ధంలో) చూస్తే ఇలాంటి భాషా ప్రయోగాలు అప్పటి శిష్ట వ్యావహారికంలో ఉండేవని అర్ధమవుతుంది. ఇప్పుడంతగా ప్రయోగంలో లేవు.

పత్రికలలో సాహిత్య సేవ తొలిసారిగా పద్యాల ప్రతిపదార్ధ చర్చతో ప్రారంభమైంది. అదీ వర్తమానతరంగిణితోనే ఇది మొదలైంది. ఈ పత్రికకు చిన్నయసూరి గారు ఉత్తరం వ్రాసి అందులో ఒక పద్యాన్ని ఇచ్చి, ఆ పద్యానికి పండితులగువారి వలన అర్ధం తెప్పించి తిరుగా ఆ పత్రికలో ప్రచురము చేసి తమ అభీష్టంబీడేర్తురని బహుదా ప్రార్ధించెద నంటూ ఆ నిమిత్తమై ఇచ్చిన పద్యం ఈ క్రిందిది:

ఉత్పలమాల:
కోడి గమింతె గాని తనకున్ వయసెక్కడి దమ్మనేత్రముల్
వాడు గదమ్మ పంట పగబట్టిన దాని సుధారసంబు ము
ద్దాడు గదమ్మ యీ చెలియ కక్కట వల్పులటమ్మయీడికల్
వేడుక లాయెమట్ల తిరువేంగళనాథ యనంత శౌరికిన్.

‘సాహిత్య చర్చ అంటే అప్పటికి పదార్ధ చర్చ వ్యాకరణ విషయాలు అలంకారాలు మొదలైనవి మాత్రమే.’ అని ఇక్కడ రామచంద్ర గారి మాట.

వర్తమాన తరంగిణి తరువాత, 1848 లో వెలువడిన ‘హితవాది’, ‘దిన వర్తమాని’ పత్రికలు కూడా వార్తలతో పాటు ఇలాంటి సాహిత్య సేవ చేశాయి. హితవాది బందరు (మచిలీపట్టణం) నుండి వెలువడేది, మాసపత్రిక.

తొలినాళ్ళ ఈ పత్రికల తరువాత, సారస్వత విషయాలకే ప్రాధాన్యమిచ్చిన మొట్టమొదటి పత్రిక సుజన రంజని (1862-67). వింజమూరి కృష్ణమచార్యులు, బహుజనపల్లి సీతారామాచార్యులు (శబ్దరత్నాకర కర్త), కారుమంచి సుబ్బారాయలు నాయుడు గార్ల సంపాదకత్వంలో ఈ పత్రిక మొదట మాసపత్రికగా ఉండి, తరువాత ద్వైమాసపత్రికగా వెలువడిందట. ఈ మువ్వురూ  చెన్నపట్నం (మద్రాసు, చెన్నై) లోని స్కూళ్ళలో తెలుగు పండితులుగా అప్పుడు ఉద్యోగాలలో ఉండేవారు. చిన్నయసూరి రచనలు టీకా టిప్పణులతో సహా ఇందులో ప్రచురితమయ్యాయట. మనుచరిత్రాది ప్రబంధాలకు, భాస్కర రామాయణాదులకు లఘుటిప్పణులను ఈ పత్రిక ప్రచురించింది. చిన్నయసూరి నీతి చంద్రికకు లఘు టిప్పణి కూడా ఇందులో ప్రచురితమయిందట.

19వ శతాబ్దం ఉత్తరార్ధంలో కవిపండితుల సాహిత్య సేవకు సంబంధించి ఇక్కడ రామచంద్ర గారి ఈ క్రింది వాక్యాలు అప్పటి స్థితిని సంక్షిప్తీకరించి చెబుతాయి:

“19వ శతాబ్దం ఉత్తరార్ధంలో కవులు పండితులు పలువురు వుండేవారు. అందరి వద్ద తాటాకు పుస్తకాలుండేవి. అప్పట్లో ప్రతి పండితుడు ఏదో ఒక పత్రిక నడపడం, దానిలో ఒక ప్రాచీన కావ్యం నాలుగు పుటలో ఎనిమిది పుటలో ప్రచురించడం పరిపాటైంది… … … వీతిలో కొన్నిటిలో వార్తలూ ఉండేవి.”

19వ శతాబ్దపు ఉత్తరార్ధంలో కవుల పండితుల సాహిత్య సేవకు సంబంధించి ఇది సంక్షిప్తీకరణ అయితే, అదే కాలానికి సంబంధించి కవుల పండితుల సాహిత్యాపు స్థితికి సంబంధించిన సంక్షిప్తీకరణ తెలుసుకోవడం ఇక్కడ అసందర్భం కాదనుకుంటాను. టేకుమళ్ళ కామేశ్వరరావు గారి ‘నా వాఙ్మయ మిత్రులు’ లోని ఈ వాక్యాలు 19వ శతాబ్దపు ఉత్తారార్ధంలో తెలుగు కవిత్వ దశను సంక్షిప్తీకరించి చూపెడతాయి:

“పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్థంలో తెలుగు కవిత్వ దశ ఏమంటే – కవులు పండిత శైలిలో ప్రబంధాలను మాహాత్మ్యాలను రచించేవారు. అచ్చ తెనుగు పుస్తకాలను, నిరోష్ఠ్య నిర్గద్య వంటి, చిత్రబంధ కవిత్వాల వంటి, మొగ్గల (ఫీట్ల) కవిత్వం చేసేవారు.  అంకమ్మ, మారెమ్మ, పోలేరమ్మ, ఇత్యాది దేవతలు ఊరూరా ఉండగా భక్తి శతకాలు బహుళ మయేయి. రెండు అర్ధాలు, మూడు అర్థాల ప్రబంధాలు పుట్టేయి. మొత్తం మీద తెలుగు కవిత్వం కుక్కమూతి పిందెలను కాచిన కాలమన్నారు సాహిత్య విమర్శకులు.”

“తెలుగు పత్రికల సాహిత్య సేవ” – డా|| తిరుమల రామచంద్ర (పరిచయ వ్యాసం : భాగం -2)

“తెలుగు పత్రికల సాహిత్య సేవ” – డా|| తిరుమల రామచంద్ర (పరిచయ వ్యాసం : భాగం -2)

1835 లో బళ్ళారి నుండి ప్రకటితమైన ‘సత్యదూత’ అనే పత్రిక తెలుగులో మొట్టమొదటిదని ఒక అభిప్రాయం ఈ విషయంపై అప్పటిదా వ్రాస్తూండిన పెద్దలలో వుండేదనీ, అయితే ‘ది కర్నాటక్ క్రానికిల్ ‘ అనే పత్రికే తెలుగులో మొదటగా వెలువడిన పత్రికని చెప్పడానికి తిరుగులేని అధారాలున్నాయి కనుక ఆ అభిప్రాయం సత్యదూరమనీ రామచంద్ర గారు ఇందులో చెప్పారు. ఈ సందర్భంలో ‘బ్రౌన్ జాబులు – జర్నలిజం చరిత్ర’ అనే పుస్తకంలో, తెలుగు సాహితీలోకంలో ‘బంగోరె’ గా ప్రసిధ్ధులైన బండి గోపాల రెడ్డి గారి  (వీరిని సాహితీ వర్గాలలో ‘తవ్వకప్పనిమంతుడు’ అని కూడా వాత్సల్యంతో  పిలుచుకునే వారని చదివాను. ఒకరి చేతినుంచి ఇంకొకరి చేతులకు మారి, అక్కడనుంచి మరొకరి చేతులకు మారి, అలా దాదాపు కాలగర్భంలో కలిసి పోయాయనుకున్నా ఎన్నిటినో పెద్దవాళ్ళ వ్రాతప్రతులను, ఉత్తరప్రత్యుత్తరాల దస్త్రాలనూ, సాహిత్యానికి సంబంధించిన నోట్సులనూ తవ్వి వెలికి తీయడంలో అంతులేని ఓపికా, ప్రజ్ఞ కలవాడవడం చేత ఈయనకా పేరు వచ్చిందని చెబుతారు. తెలుగు సాహిత్యానికి సంభంధించినంతవరకూ మరుగున పడిపోయిన పుస్తకాలను తవ్వి తీయించడంలో బ్రౌన్ దొర, తవ్వి తీయడంలో మాన్యులు, మాహజ్ఞానసంపన్నులు అయిన మానవల్లి రామకృష్ణకవిగారూ,  ఇద్దరూ ఇద్దరే! వీరి నిస్స్వార్ధ కృషియే లేకుంటే తెలుగు సాంప్రదాయ సాహిత్యంలోని ఎన్నో గ్రంధాలు ఇప్పటికీ వెలుగు చూసేవో కాదో చెప్పలేం! పాండిత్యంలో వారితో సమవుజ్జీ అనదగ్గంతటివాడు అయినా కాకపోయినా, సాహిత్యానికి సంబంధించిన సంగతులను వెలికితీసి వెలుగు చూపించాలన్న కాంక్షలో ‘బంగోరె’ వారితో సమవుజ్జీ అనదగిన వాడే!) మాటలను ఉటంకిస్తూ ‘సత్యదూత’ 1835 లో లేదనీ ఇది కేవలం ఊహేననీ శ్రీ బండి గోపాలరెడ్డి అంటున్నారు’ అని వ్రాశారు రామచంద్ర గారు.

వృత్తాంతిని – ఇది తెలుగులో మొట్టమొదటి వారపత్రిక. 1838-41 మధ్య కాలంలో ప్రకటించబడింది. ఇందులో ప్రచురించిన లేఖను బ్రౌన్ దొరయే సేకరించాడు. కలిగిన వారి ఇళ్ళ పెళ్ళిళ్ళలో జరిగే దుబారా వ్యయాన్ని, దురాచారాలనూ అందరి దృష్టికీ తెచ్చి ఈ పధ్ధతులను సంస్కరించాలన్న సదుద్దేశంతో 1845వ సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తేదీన వ్రాసిన ఒక పాఠకుని  లేఖ అది. గిడుగు రామమూర్తి గారు కూడా ఈ లేఖను  తమ సపాదకత్వంలో వెలువడిన గద్యచింతామణిలో ఉదాహరించారట.  ‘వివాహమును గురించిన దుర్వ్యయము’ అనే శీర్షికతో వున్న ఈ లేఖ పూర్తి పాఠం రామచంద్ర గారు కూడా ఇందులో ఇచ్చారు. ఈ లేఖలోని భాష, వాక్య నిర్మాణం, దాదాపు రెండు శతాబ్దాల క్రితంనాటి తెలుగు వ్రాత పధ్ధతులను తెలుసుకోవడానికీ, అప్పటి ఆచారవ్యవహారాలను తెలుసుకోవాలన్న కుతూహలం కలవారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో నాకు ఆసక్తికరంగా అనిపించిన కొన్ని సంగతులను ఈ క్రింద చూపుతున్నాను:

“… … తమ తమ వారిలో వృధ్ధులుగా నున్ను పెద్దలుగానున్ను వుండే వారిచేత ఆశీర్వచనములు చెందడమున్ను, యీ యావత్తున్ను మన శాస్త్ర సంమతిగానున్ను అయా కులాచార సమ్మతిగానున్ను వుంటుందని… …”
సంమతి – ఇలాంటి చోట్ల బిందుపూర్వక ‘మ’ అప్పటికింకా ప్రయోగంలో ఉండేది. ఇప్పుడు లేదు.

“అయితే రాత్రులలో కచ్చేరి యుంచవలెగదా, పందిరి వేసి శృంగారించవలసి యున్నది గదా…”
అలంకరించ వలసి ఉన్నది కదా అనే అర్ధంలో ఈ ప్రయోగం.

“కచ్చేరి పందిలి నాట్యం వీటిని నిలిపితే – యిందుకుగాను వృథాశలవయ్యే మొత్తాన్ని దానధర్మముల కింద అగత్యంగా సెలవు చేతురనే దానికి సందేహించ లేదు.”
అగత్యముగా – అవశ్యముగా, తప్పనిసరిగా అనే అర్ధంలో ప్రయోగం. ‘సందేహించ లేదు’ – సందేహించాల్సిన పనిలేదు అని అర్ధం.

“….తనకు విహితులు కాకపోయినా తన వియ్యంకులవారికి విహితుడేమో అని భ్రమించి వారికంతా తాజంచేసి మర్యాదలు చేయవలసి సంభవించినది గదా అని మనసులో నొచ్చుకుంటాడు.”
‘తాజం చేసి’ – ‘తాజా’ అనే మాటనుంచి ఇది పుట్టిందనుకుంటాను. ఈ మాటకు కొత్తది, చేర్చినది అని రెండు అర్ధాలున్నాయి. ఇందులో ‘చేర్చినది’ అనే అర్ధంలో,  వారినికూడా కలుపుకుని అనే అర్ధంలో ఇలాంటి సందర్భాలలో అప్పటిలో వ్యవహారంలో వుండేదనుకుంటాను. ఇప్పుడు ప్రయోగంలో లేదు.

‘”…సార్ధకము కద్దా అని విచారిస్తే యెవరికిన్ని ఏమీ లేదు.”
“…నాట్యమాడుతు యుండే దాసీకి రూపాయలు వేసే మర్యాద కద్దు.”

‘కలదు’ అనే మాటకు సంక్షిప్త రూపం – ‘కద్దు’. ఇప్పుడు వ్యవహారంలోనే కాదు, వ్రాతలలో కూడా కానరాదు.

“దాని వలన ఇంటివానికి కొంచెం కూడుదల యుండినది.”
‘కూడుదల’ – ఖర్చులో కొంచెం తగ్గుదల (saving) అనే అర్ధంలో ఇక్కడ ప్రయుక్తమైంది ఈ మాట. లాభము అని దీనికి బ్రౌణ్యంలో చెప్పిన అర్ధం.

ఈ పోస్టులో పలుమార్లు బ్రౌనుదొర పేరు స్మరించుకోవడం జరిగింది గాబట్టి, సమకాలిక పండితులు ఆయన గురించి చెప్పిన ఒక మంచి చాటు కంద పద్యం, ప్రొ.జి.ఎన్. రెడ్డి గారి పర్యవేక్షణలోనూ, బంగోరె సంశోధనతోనూ వెలువడిన ‘బ్రౌన్ లేఖలు’ అనే పుస్తకంలోనిది – ప్రొ|| జి.ఎన్.రెడ్డి గారు ఆ పుస్తకానికి రాసిన ప్రస్తావనలో ప్రస్తుతించినది – ఇక్కడ ఒకసారి చెప్పుకోవడం తగిన పని అనుకుంటాను:

నూరార్లు లెక్క సేయక
పేర్లెక్కిన విబుధవరులఁ బిలిపించుచు వే
మార్లర్థమిచ్చు వితరణి
చార్లెసు ఫీలిప్సు బ్రౌను సాహెబు కరుణన్!

“తెలుగు పత్రికల సాహిత్య సేవ” – డా|| తిరుమల రామచంద్ర (పరిచయ వ్యాసం : భాగం -1)

“తెలుగు పత్రికల సాహిత్య సేవ” – డా|| తిరుమల రామచంద్ర (పరిచయ వ్యాసం : భాగం -1)

“ప్రపంచ మొక పద్మవ్యూహం,
కవిత్వ మొక తీరని దాహం!”

అని శ్రీశ్రీ మాట! ఇందులో ‘కవిత్వం’ అన్న పదానికి ఛందోబధ్ధమైన/కాని కవిత్వం అన్న అర్ధంలోనే కాకుండా, మొత్తంగా సాహిత్యం అన్న అర్ధాన్ని అపాదించి చూసుకున్నాకూడా అర్ధవంతంగానే ఉంటుంది తప్ప,  అందులో అభ్యంతరకరమైనది ఎమీ వుండదనుకుంటాను, మొత్తంగా సాహిత్యాపేక్ష అనేది ఒక తీరని దాహం లాంటిదే కనుక!

తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకూ, ఈ దాహాన్ని గురించి చెప్పుకోవడం మొదలిడితే సంగతులు  ఎంత కాదన్నా వెయ్యెళ్ళ వెనక్కి వెళతాయని ఘంటాపదంగా చెప్పుకోవచ్చును. సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువదించమని నన్నయకు రాజరాజు చెప్పడం ఇలాంటి దాహంతోనే కదా, మహాభారతాన్ని ఆంధ్రంలో చదువుకోవాలన్న కోరికతోనే కదా!

తెలుగు వ్యక్తులలో అలా మొదలైన ఈ సాహిత్య దాహం, ఆ తరువాతి కాలంలో దేవుళ్ళకు కూడా సోకి తెలుగు కవుల చిత్తాలలోకి కలల రూపంలో ప్రవేశించి ఫలానా కథను కావ్యంగా మలచమని తమ కొరికలను వెళ్ళబుచ్చుకునేదాకా కూడా వెళ్ళిందంటే, ఈ సాహిత్య దాహం అనేది ఎంతటి శక్తి కలదో అర్ధమవుతుంది! (ఇది సరదాకు అనుకున్న మాటే తప్ప, ఇందులో ఏ తెలుగు పూర్వ కవినీ ఎగతాళి చేసేందుకు ఉద్దేశించినది కాదని
ఇక్కడ ఒకసారి చెప్పడం క్షేమం అనుకుంటాను!).

అచ్చుయంత్రం కనిపెట్టబడి, అది ఆంధ్ర దేశంలో అందుబాటులోకి వచ్చిన తరువాత, (అంటే క్రీ.శ.1830 తరువాత) సాహిత్య వ్యాసంగంలో ఏ కొద్ది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి అయినా సరే, తమ కున్న ఇంకా ఈ తీరని సాహిత్య దాహాన్ని తమదైన ఒక పత్రికను నడపడం ద్వారా చేసిన సాహిత్య సేవతో మరింతగా తీర్చుకునే ప్రయత్నం చేసిన వారే అని తెలుగులో ఆ కాలంలో విరివిగా వెలువడిన ‘సొంత’ సాహిత్య పత్రికలు చెప్పకనే చెబుతాయి. లెక్కలేనన్ని సాహిత్య పత్రికలు ఈ తెలుగు నేలన ఆ కాలంలో వెలిసి, నడిచినంత కాలం నడిచి, చేయగలిగినంత సాహిత్య సేవను చేసి వాటిని ప్రచురించిన/ప్రకటించిన వ్యక్తులకు ఎంతో కొంత సంతృప్తిని మిగిల్చడంలో సపలం చెందాయని అనుకోవడంలో ఏమాత్రం విప్రతిపత్తి లేదు!

క్రీ.శ.1832 సం|| లో తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషలలో వెలువడిన ‘ది కర్ణాటక్ క్రానికిల్’ అనే పత్రిక దగ్గరనుంచి, క్రీ.శ.1975 సం|| దాకా తెలుగు భాషలో ఇలా వెలువడిన పత్రికలలో ముఖ్యమైన పత్రికల సమాచారాన్ని అంతటినీ ఎంతగానో శ్రమకోర్చి ఒకచోటకు చేర్చి తయారు చేసిన పుస్తకం ‘పత్రకార శిరోమణి’ గా పేరుగాంచిన డా|| తిరుమల రామచంద్ర గారి “తెలుగుపత్రికల సాహిత్య సేవ’ అనే 72 పేజీల చిన్న పుస్తకం. 1989 జనవరి నెలలో ఇది ముద్రించబడింది. అదే ప్రథమ ముద్రణ. ఆ ముద్రణలో ఈ పుస్తకం వెల 5 రూపాయలు. ఈ పుస్తకానికి రామచంద్ర గారు వ్రాసిన ‘మనవి మాటలు’ లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ పుస్తకంలోని విషయాలను ఒక బృహద్వ్యాసంగా 1985 లో జరిగిన శ్రీ మద్దుకూరి చంద్రశేఖరరావు గారి (చంద్రం గారు) స్మారక సభలో రామచంద్ర గారు చదివారు. ఆ తరువాత 1986 లో ఇది విశాలాంధ్రలో ధారావాహికగా ప్రచురితమైంది.

‘వినయ పత్రిక’ అనే శీర్షికతో ఒక ముందుమాటను లేదా పీఠికను శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు ఈ చిన్న పుస్తకానికి వ్రాశారు. ఈ పీఠికలో ఒక చోట ‘పత్రిక’ అనే పదానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ “లేఖ అనే అర్ధంలో ‘పత్రిక’ అనే పదం మొట్టమొదటిసారి ప్రభావతీ ప్రద్యుమ్నంలో కనబడింది” అని వ్రాశారు రమాపతిరావు గారు. పింగళి సూరన రచించిన ప్రభావతీ ప్రద్యుమ్నం 1545 నాటిది. అందులోని తృతీయ ఆశ్వాసంలోని
పద్యాలలో ‘పత్రిక’ అన్న పదం ‘లేఖ’ అన్న అర్ధంలో కనబడుతుంది. ఉదాహరణకు మూడు పద్యాలు:

మత్తకోకిల:
అంచతొయ్యలి దేవతాపతి యాన చొప్పొనరించి యే
తెంచుటెన్నడు దాని చేత మదీయ హృద్గతి జెప్పియే
బంచుటెన్నడు గావున న్వెస బత్రికన్ లిఖియించి యా
యంచ కిప్పుడు పంచెదన్సతికిం దెల్పెడునట్లుగాన్.       (27వ పద్యం)

కందం:
చిత్రము మిక్కిలి నిప్పుడీ
పత్రిక చందంబ యోప్రభాతాబ్జస
న్నేత్రయది చూతమనుచున్
బత్రిక పుచ్చుకొని విచ్చి భాసుర ఫణితిన్.      (133 వ పద్యం)

తేటగీతి:
సంతసము నోపజాలక చంక వైచు
కొనుచు నొకదాటు గొని నిన్ను గూర్చి కాంతు
డనిపినట్టి పత్రికయె కదమ్మ భాగ్య
వతివినీ వని చెలి ప్రభావతిని బల్కె.     (134వ పద్యం)

ఈ పద్యాలలోని ‘పత్రిక’, ప్రణయ సందేశ పత్రిక (Love letter)! పోను పోను జన వ్యవహారంలో ఈ పత్రక అన్న మాట, పెండ్లి పత్రిక, వార్తా పత్రిక లాంటి పదబంధాలలో ఆయా సందర్భాలకు సరిపోయే అర్ధాలతో రూఢమై మిగిలింది అనుకోవాలి. ‘వ్యవహారము యొక్క చెల్లుబడికై ఒకరొకరు వ్రాసుకొనెడి పత్రము’ అని శబ్దరత్నాకరం ‘పత్రిక’ అన్న మాటకు అర్ధం చెప్పింది. అయితే, ఆ తరువాత 50 ఏళ్ళకు వెలువడ్డ సూర్యరాయాంధ్ర నిఘంటువు ‘పత్రిక’ అంటే ‘వ్రాతకాధారమగు తాటియాకు, కాగితము, వ్యవహారమున పరస్పరము వ్రాసికొనెడు పత్రము’ అని మాత్రమే అర్ధాన్ని ఇచ్చిందనీ, వార్తాపత్రిక అనే అర్ధంలోగాని, పెళ్ళిపత్రిక అనే అర్ధంలో కాని వివరణం ఇవ్వలేదనీ, ఈ నిఘంటువు వెలువడేనాటికి తెలుగులో పత్రికలకు శతాబ్దం పైనే చరిత్ర ఉంది కాబట్టి వీటికి సంబంధించిన పూర్తి వివరణ నిఘంటువులో ఇవ్వకపోవడం చింత్యమనీ రమాపతిరావు గారు తమ పీఠికలో ప్రస్తావించారు.

ఇక పుస్తకంలోని విషయాలను గురించి మొదలెడితే – రామచంద్ర గారి అభిప్రాయంలో తెలుగులో క్రీ.శ.16వ శతాబ్దం ఉత్తరార్ధంలో  ‘రాయవాచకం’ రూపంలో తొలి వార్తాపత్రిక ఉద్భవించింది. విజయనగర సార్వభౌముల సమాచారాన్ని, ముఖ్యంగా కృష్ణదేవరాయల దినచర్యతో కూడుకున్న సమాచారాన్ని తెలిపే ఈ ‘పత్రిక’ కు కర్త విశ్వనాథనాయకుని స్థానాపతి. ఇది ఒక విథంగా డైరీ లాంటిదని కూడా రామచంద్ర గారు చెబుతారు.

ఆధునిక భారత దేశంలో అవతరించిన మొట్ట మొదటి వార్తాపత్రిక ‘దిగ్దర్శన్’. ఇది 1818 లో వంగ దేశంలో శ్రీరాంపూర్ లో వెలువడింది. సంపాదకుడు మార్షుమేన్. అటు తరువాత 14 సంవత్సరాలకు తెలుగులో (పైన ఉటంకించినట్లుగా) ‘ది కర్నాటిక్ క్రానికిల్’ రూపంలో తొలి వార్తాపత్రిక వెలువడింది. ఈ పత్రిక ఉపోద్ఘాతంలో “ఇది కేవలం వార్తలను యథాతథంగా పొందుపరచడమే కాని వ్యాఖ్య కాద” ని తెలుపుచున్నది, కాబట్టి ఇది బాల్యావస్థకు తార్కాణం అనియున్న రామచంద్రగారి మాట, ఎంతైనా నిజం!