ఫొటోగ్రఫీ : images 2012 (51)- లోవెలుగు (లోపలి వెలుగు)

లోవెలుగు (లోపలి వెలుగు)

పూవుకైనా, మరే ఇతర ప్రాణికైనా ఈ లోవెలుగు (లోపలి వెలుగు) సజావుగా ఉండడం ఎంతైనా అవసరం అనుకుంటాను!

ఈ వెలుగు సరిగా ఉన్నంతకాలం అంతా సరిగానే ఉంటుందనుకుంటాను! ఈ వెలుగు క్షీణించడం  మొదలవడంతోనే, వృధ్ధాప్యమూ, క్షీణదశా మొదలవడం
జరుగుతుందేమో, బహుశా, పూవుకైనా….మరే ఇతర ప్రాణికైనా!!

లోపల, తొడెమ నుంచి పూవుగా మొదలైన చోట కాంతివంతంగా మెరవడం, అక్కడి నుంచి వెలుగు రెక్కలపైకి చిమ్మడం (reflect అవడం), అలా చిమ్మిన వెలుగు స్పష్టంగా పూవు రెక్కలపై బిందువులుగా కనిపించడం ఈ పూవులలోనే చూశాను! Very pleasing, eye-catching colors and a heartening phenomenon indeed!!

ప్రకటనలు

ఫొటోగ్రఫీ : Images 2012 (49) – “అందం చూడవయా…”

అందం చూడవయా…… ఆనందించవయా…..ఒకే (సీతాకోక) చిలుక, రెండు ఫోటోలు.

అందం చూడవయా….

ఆనందించవయా…

స్వగతాలు (10): రంగుల కల -4

రంగుల కల -4

ఏదైనా సరే  ఒక విలక్షణతతో విశ్వాన్ని సమ్మోహపరచాలని కాంక్షించే ప్రతి చిన్న పువ్వుకూ
ఏదో ఒకనాటికి ఎవరిదో ఒకరి సాన్నిధ్యంలో కనులు మొగిడ్చి తన్మయానికి లొంగి పోయే తరుణం రానే వస్తుంది.

గడ్డిపరక కైనా సరే,
వెనక్కి వాలి, వెన్నిచ్చి, కనులు మూసుకుని కాస్త సేద దీరినపుడు
నలిగి పోతున్నానన్న బాధకన్నా
నన్నే గదా ఆపు చేసుకున్నాడన్న స్పృహ, సంతోషమూ లోపల ఉండకుంటే తప్ప
మళ్ళీ లేచి కూర్చోలేదనుకుంటాను.

క్షణాలుగా గడిచిపోతుంటుంది యవ్వనం
యుగాలుగా గడుస్తూ ఉంటుంది వార్ధక్యం!

అన్నీ అయిపోయాక
కళ్ళ రెప్పల వెనుక బారులుగా తీరి ఉన్న నీళ్ళ చారల దారులలో
ఎవరిదో తెలియని ఒక విశ్వ మొహక గళం తనను తాను తప్పిపోగొట్టుకుని
ఆలాపించే అంతులేని శోకాశోక గీతానికి పారవశ్య సూచకంగానో నిదర్శనంగానో అన్నట్లుగా
ఎప్పుడూ ఒక నీటి బొట్టు కనుపించీ కనుపించకుండా కంటి రెప్పలనంటి
వేళ్ళాడుతూ ఉండడం ఒకానొక మధురాతి మధురమైన జ్ఞాపకం!

***

స్వగతాలు (9): రంగుల కల -3

రంగుల కల -3

ఎందుకో గాని
ఈ రంగుల ముందు నా మాటలు
ఎప్పుడూ మౌనంగా వుండడాన్నే
ఇష్టపడతాయి!

అదెందుకో గాని
విరిసినా విరియక ఉన్నా వాడినా
పువ్వెప్పుడూ ఒక మధుర స్వప్నానికి ఆనవాలులాగానే ఉంటుంది.
ప్రియమైన లోగిలి వైపుకు ఇంకా మొదలేకాని ఒకానొక కలల ప్రయాణంలోకి వేయ జూడబోయిన తొలి అడుగులా
విరిసినా విరియక ఉన్నా వాడినా
ఎలా ఉన్నా పువ్వెప్పుడూ ఒక మధురానుభూతిలాగానే ఉంటుంది.

ఎంతకూ మోహపడని యవ్వనాన్ని భరించి ఉండడం ఎంత కష్టమో
ఎంతకూ మోదపడని హృదయాన్ని ధరించి ఉండడమూ అంతే కష్టం!

లోలోపల మధురంగా జ్వలించలేని మనుషులున్న చోటున
పువ్వు వికసించినా వికసించకున్నా పెద్దగా తేడా ఉండదు.

నీకోసమే అన్నట్లుగా విరిసి విప్పారి ఉన్న విరి తనువును
తనకుతానుగా చేయి చాచి స్పృశించలేని మనిషికి మోహస్పర్శ ఎలాంటిదో ఎప్పటికీ తెలియదు!

స్వగతాలు (8): రంగుల కల -2

రంగుల కల -2

మనిషిగా
ఉన్నంతకాలం ఇంత సామాన్యంగా, స్వచ్చంగా మెరవడానికి
ఎన్నెన్ని యాగాల యుగాల యోగాల ఫలితాల్ని ధరించి ఉండాలో అనుకోవడం అత్యూహ కాదు కదూ…

ఇంత తోడుతోడుగా, సామీప్యంలో ఉన్నంతకాలం ఉండడానికీ…
ఉంటూ చూడడానికీ చూడబడడానికీ…

ఈ రంగులదొక వింత లోకం.
కమ్ముకుంటున్న ఉషోదయం లాంటిదో, అస్తమయం లాంటిదో వెలుతురు వర్ణం
ఒకానొక ఇంకా మొదలుకాని సంగతిని సూచిస్తున్నట్లుగా ఉంటుంది.
ఎన్నో వింతలను రాత్రి మోసుకు వస్తుంది.
భయపడతాం భయపెడతాం గానీ, స్వతహాగా చీకటి ఒక సాధువు.
చూడాలని వెలిగిస్తే చిన్నచిన్న సంగతులను కూడా దివ్యంగా వెలిగించి చూపెడుతుంది.

ఈ అనంతమైన విశ్వంలో
ప్రతి రేణువంత ప్రాణికి కూడా  ఒక ప్రత్యేకమైన ఉనికి ఉంటుంది.
ఎటొచ్చీ, సానుభూతితో సంయమనంతో చూసే చూపే మనిషికి ఉండాలి.

స్వగతాలు (7): రంగుల కల -1

రంగుల కల

అవును, ఇది ఒక రంగుల కల!
ఈ కల ఎప్పటికప్పుడు పరుచుకుంటున్న మంచు తెరలా కళ్ళను కమ్మేసి కలవరపెడుతూనే ఉంటుంది.
ఎందుకో తెలియని భావోద్రేకాన్ని భరించి ఉండడం ఎంత కష్టమో, కళ్ళముందు కమ్ముకుంటున్న ఈ రంగుల కలనూ పక్కకు నెట్టి విడిగా చూడడమూ అంతే కష్టంగా ఉంటుంది.

flowers, clrs (18)తల వంచుకుని నడుస్తూనే ఉంటామా…
అడుగులు ముందుకు పడుతూనే ఉంటాయా…
ఇంతలో ఏదో ఒక ఊహించని మూలనుంచి ఒక వర్ణమో, వర్ణాల సముదాయమో తెలియకుండా వచ్చి తమ ఉనికిని తెలుపుకుంటున్నట్లవుతుంది.
అదెందుకలా అవుతుందన్న దానికి సమాధానాం దొరకదు గాని,
తల అటుగా తిప్పి చూస్తే, ఇదిగో ఇలా చూడాలన్నట్లుగా వాటికవే చూపులకు దారి పరిచినట్లవుతుంది.

flowers, clrs (19)చంద్రుడితో పాటే పోయే వెన్నెలలా,
ప్రియుడి వెంట ప్రేయసి పోతుందని ఎవరో ఒక పూర్వ కవి ఉత్ప్రేక్షించినట్లు,
వర్ణంతో పాటుగానే నా కంటి చూపూ పోతుంది.

flowers, clrs (20)వర్ణ సౌందర్యం, వర్ణ సముదాయాల సమ్మేళనల సౌందర్యం. నాకొక తన్మయ నయనానందకర సమ్మోహ భీభత్సం!

flowers, clrs (21)విరియడానికి వేసటతో వేచి చూస్తున్నట్లుగా కనుపించే వర్ణం, పువ్వు వెంట ఒకానొక  తన్మయాన్ని గాలిలోకి నిరంతరంగా నిశ్వాసిస్తూనే ఉంటుంది;
మొగ్గగా విలసిల్లడానికి ముందే, ఒకా నొక …కాదు కాదు, అనేకానేక తమోహ రణాల సమీకరణాలను అణువణువునా నింపుకుని గదా అది అవతరించేది!