మళ్ళీ ఒకసారి మన ‘లేపాక్షి’ గురించి…(2)

‘లేపాక్షి’ ని గురించిన ప్రస్తావన ఎప్పుడు, ఎక్కడ వచ్చినా, లేపాక్షి కి మరో పేరు అనుబంధించబడి వినబడుతుంది. ఆ పేరు ‘బసవన్న’! ‘లేపాక్షి’ ని ‘బసవన్న’ ను విడదీయలేని అనుబంధంతో పెనవేసుకునిపోయి, ఎంతగానో ప్రసిధ్ధి చెందింది ‘లేపాక్షి బసవన్న’ అనే పేరు! లేపాక్షి కి వెళ్ళి ఈ బసవన్నను దర్శించుకోనిదే, ఆ వెళ్ళిన వాళ్ళకు లేపాక్షి సందర్శనం పూర్తి అయినట్లుగా భావింపబడదు అనడం అతిశయోక్తి కానే కాదు!

లేపాక్షి శ్రీ వీరభద్రాలయానికి ఒక కిలోమీటరు లోపు (రెండు మూడు ఫర్లాంగుల కంటె ఎక్కువ దూరం వుండదనుకుంటాను!) దూరంలోనే బసవన్న శిల్పం వుంటుంది. కాలి నడకన వెళ్ళవచ్చును.  ఏకశిల నుంచి మలచబడిన ఈ బసవన్న శిల్పం కూడా, లేపాక్షి, శ్రీ వీరభద్రాలయంలోని మిగతా శిల్పాల లాగా,  జీవకళతో మెరిసిపోతూ వుంటుంది.  మొత్తం శిలనే బసవన్నగా మలిచిన అధ్బుత శిల్పం ఇది. దేశంలోనే పరిమాణంలో అతి పెద్ద (8.1 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తు పరిమాణంతో) బసవన్న శిల్పంగా ‘లేపాక్షి బసవన్న’ ను చెబుతారు! తీరుగా కూర్చుని శ్రీ వీరభద్రాలయం కేసి స్తున్నట్లుగా మలచబడింది. బసవన్న వెనక నిలబడి, కొమ్ముల మధ్య నుంచి ధృష్టి సారించి చూస్తే శ్రీ వీరభద్రాలయంలోని  ఏకశిలపై మలచబడి వున్న నాగలింగం కనబడుతుంది.

అన్ని హంగులతో మలచబడి వున్న’లేపాక్షి బసవన్న’ ఫోటోలు, ఇక్కడ ‘slide-show’ గా!

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ప్రకటనలు

మళ్ళీ ఒకసారి మన ‘లేపాక్షి’ గురించి…(1)

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం, అసంపూర్తి కళ్యాణమండపానికి పక్కన ఒకే రాతి మీద మలచిన విఘ్నేశ్వర మరియు నాగలింగ శిల్పాలున్నాయి. ఈ ప్రతిమలున్న పెద్ద శిల వున్నది, ప్రధాన ఆలయానికి సరిగ్గా వెనకవైపు అవుతుంది.

ఏకశిలలో మలచిన ఈ ప్రతిమల వెనకా ఒక కథ వుంది. ఈ ఆలయ నిర్మాణానికి నియోగించబడిన శిల్పులలో, ఒక కుర్ర శిల్పి పనితనానికి సంబంధించిన కథ అది. ఆలయ నిర్మాణం జోరుగా సాగుతున్న రోజులలో ఒకనాటి రోజు, మధ్యాహ్నం భోజన విరామ సమాయానికి, భోజనం తయారవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆ కుర్ర శిల్పి తల్లి చెప్పడంతో, ఆ మధ్య కాలంలో ఖాళీగా కుర్చోవడం ఇష్టం లేని అతను, తిరిగి అతని తల్లి వద్ద నుండి భోజనం తయారయిందని కబురు వచ్చేంతలోనే, ఆ శిలపై ఈ రూపాలను మలిచాడనీ…

అలా అంత తక్కువ వ్యవధిలోనే శిలను అద్భుతమైన శిల్పంగా మలచ గలిగిన తన కుమారుని ప్రతిభకు ఆశ్చర్య పోయిన ఆ తల్లి, తన్మయంలో ఇంగితం మరచి కుమారుని ఎదుటనే అతని ప్రతిభను గొప్పగా పొగిడిందనీ, అలా ఆమె పొగిడిన తరువాత కొద్ది సేపటికే  అందరూ ఆశ్చర్య పోయే లాగా శిల్పం మలచ బడి వున్న శిల మధ్యలోకి పైనుంచి క్రిందివరకూ ఒక సన్నని పగులు ఏర్పడిందనీ, శిలలో ఏర్పడిన ఆ పగులు కారణంగా శిల్పం  లోపం కలది అయిపొయిందనీ ప్రచారంలో వున్న కథ!

కథ సంగతెలా వున్నా, ఏక శిలపై విఘ్నేశ్వర, నాగలింగ శిల్పాలు చూడడానికి అద్భుతంగా వుంటాయి. నాగలింగ శిల్పంలో పడగ విప్పి వున్న ఏడు తలల నాగరాజు, శిల్పం చెక్కబడి వున్న శిల సహజంగానే ఎత్తుగా వుండడం వలన చాలా gigantic గా, పేరుకు తగినట్లు magnanimous గా కనిపిస్తుంది.

ఆ ఫోటోలు మొదట విఘ్నేశ్వరునివి, ఆ తరువాత నాగరాజువి ఇప్పుడు, ఇక్కడ…slide show గా!

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (12)

వివిధ (వైవిధ్య) రూపాలు (1)

ఆలయాల నిర్మాణంలో స్థపతులకు ఎదురయ్యే సమస్యలలో ముఖ్యమైనది అనదగినది space management! ఇక్కడ space అంటే, అప్పటిదాకా ఏమీ లేని ఖాళీ ప్రదేశం అనే కాదు. రాతి గోడ మీద విస్తారంగా వున్న ప్రదేశం, రాతి స్తంభంపై పరిమితంగా వున్న ప్రదేశం కూడా ఖాళీ ప్రదేశమే! ఏ అలంకరణాలేని రాతి గోడ కానీ, స్తంభం కానీ ఏమీ చెప్పదు. ఏ అనుభూతినీ కలిగించదు. దేవాలయం అనేది ఏమీ చెప్పకపోవడానికీ, ఏ అనుభూతినీ కలిగించకుండా వుండడానికి వుద్దేశించినది కాదు. దేవాలయ ప్రాంగణంలో అడుగు పెట్టిన దగ్గరనుంచీ సందర్శకుని కంటినీ, చిత్తాన్ని రూపంతో నింపాలి అన్నది ఆనాటి స్థపతులకు అవగతం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఈ realisation దేవాలయంలోని గోడలపై, స్తంభాలపై కొన్ని లోక (worldly), కొన్ని అతిలోక (unworldly and mythical) ఆకృతుల రూప కల్పనకు, మలచడానికి దారి తీసింది. అలాంటి అతిలోక (mythical and purely imaginary) శిల్పాకృతులలో చాలా ఆకర్షణీయమైనది, ముఖ్యమైనది ఒకటి – ‘ఆసీన శార్దూలం’ (కూర్చుని వున్న సింహం) అన్న పేరు కలిగిన శిల్పాకృతి.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : 'ఆసీన శార్దూలం'

ఈ శిల్పాకృతులు విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన దేవాలయాలలో ఎక్కువగా కనబడతాయని పెద్దలు చెబుతారు. సింహం తలతోనూ, మనిషి శరీరంతోనూ వుండే ఈ రూపం, చూసేందుకు వింతగా అనిపించినా, ఆకర్షణీయంగా మలచబడి కనిపిస్తుంది. పెద్ద పెద్దగా వుండి ముందుకు పొడుచుకు వచ్చినటులుండే కళ్ళు, బయటికి చొచ్చుకు వచ్చినట్లుండే నాలుక, కాళ్ళకూ చేతులకూ పొడుగాటి గోళ్ళతో ఎక్కడ మలచబడినా కూడా కూర్చుని వున్నట్లుగానే మలచబడి కనిపిస్తుంది. ఈ రూపాన్ని కొందరు వ్యాఖ్యాతలు ‘యోగ నారసింహ మూర్తి’ గా కూడా వ్యాఖ్యానించడం కనబడుతుంది. ఈ రూపం విజయనగర శిల్పుల చేతిలో పరిణతి చెంది ఆకర్షవంతమయినప్పటికీ, ఇది విజయనగర శిల్పుల సృష్టి మాత్రం కాదనీ, పల్లవుల కాలం నుంచీ ఈ రూపం దేవాలయ స్తంభాలపై దర్శనమిస్తుందనీ పెద్దలు చెబుతారు.

లేపాక్షి శ్రీ వీరభద్రాలయంలో స్తంభాలపై ఆకర్షణీయంగా మలచబడి కనుపించే మరో వింతైన రూపం ‘మరుగుజ్జు’ ప్రతిమ రూపం.  ఈ ‘మరుగుజ్జు’ ప్రతిమలు శిల్పంలో బౌధ్ధుల కాలంనుంచీ ఉన్నాయని చెబుతారు. అన్ని కాలాల దేవాలయాలలోనూ శిల్పులు ఈ ప్రతిమను అభిమానించి ఆదరించి మలిచినట్లు చెబుతారు. శరీరావయవాలు బలిష్టంగానూ, బొద్దుగానూ, అకారంలో పొట్టిగా, శరీరంపై కొన్ని రకాలయిన అలంకరణాలతో వుండే ఈ ప్రతిమ విషేషంగా లేపాక్షి శ్రీ వీరభద్రాలయంలోని నాట్య మండపం స్తంభాలపై మలచబడి కనిపిస్తుంది. ఒక్కొక చోట వీరత్వం వుట్టిపడే ముఖ, శరీర అవయవాలతో మలచబడితే, మరింకొన్ని చోటల ఒక సంగీత వాయిద్యాన్ని ఊదుతున్నట్లుగానూ మలచబడి కనిపిస్తుంది.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : 'మరుగుజ్జు' (1)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : 'మరుగుజ్జు' (2)

మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (11)

అష్టదిక్పాలకులు

యముడు

యముడు దక్షిణ దిక్కుకు అధిపతి. యమలోకాధిపతి కూడా! ప్రతి ప్రాణి యొక్క పాప పుణ్యాలను తరచి చూసి శిక్షవేసి అమలు జరిపే ధర్మ దేవత ఈయన! ఈ లక్షణమే, ధర్మమే, ఈయనకు మిగతా దేవతల కంటే భిన్నంగా (సౌమ్యంకాని) ఉగ్రమైన, కించిత్ భయంకరమైన రూపాన్ని ఇచ్చింది అనిపిస్తుంది.

లేపాక్షి శ్రీ వీరభద్రాలయం – అసంపూర్తి కళ్యాణ మండపంలో దక్షిణ దిక్కున యముని ప్రతిమ వుంది. ఈ ప్రతిమలో యముడు రౌద్రుడుగా, పెద్ద పెద్దవిగా విప్పార్చుకున్న కనులతోనూ, గుండ్రని కనుబొమలతోనూ మలచబడి కనిపిస్తాడు. నాలుగు చేతులు – పై చేతులలో గద, పాశం, క్రింది చేతులు అభయ, వరద ముద్రలలో వున్నాయి. అన్ని ఆభరణాలతో అలంకరించబడి వున్న ఈ ప్రతిమ, అసంపూర్తిగా మిగిలి వుందన్న భావనను కలగజేస్తుందని చెబుతారు.

లేపాక్షి శ్రీ వీరభద్రాలయంలోని యముని ప్రతిమలో ముఖ్యంగా గమనించాల్సినది – కళ్ళు, ముఖం రౌద్రంగా మలచబడినా, ఆయన కున్న నాలుగు చేతులలో క్రింది రెండు చేతులూ అభయ, వరద ముద్రలలో మలచబడి వుండడం అనీ, చేతులు ఇలా అభయ, వరద ముద్రలలో వున్న యముని ప్రతిమలు చాలా అరుదనీ పెద్దలు చేబుతారు. విజయనగర రాజుల కాలపు దేవాలయాలలో కుడా, లేపాక్షిలో వున్నటువంటి యముని ప్రతిమ ఎక్కడా లేదని కూడా చెబుతారు.

దృష్టిని ఆకర్షించే ఇంకొక సంగతి ఏమిటంటే, యముని ప్రతిమ యజ్ఞోపవీతంతో అలంకరింపబడి కనపడదు. ఈ కారణంగానే ఈ ప్రతిమ అసంపూర్తిగా మిగిలివుందన్న భావనను కలగజేస్తుందేమోనని అనిపిస్తుంది.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : యముడు (photo-1)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : యముడు (photo-2)

 

 

మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (10)

అష్టదిక్పాలకులు

కుబేరుడు

కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి. పురాణాలలో యక్షులకు రాజుగానూ, మహాదేవునికి స్నేహితునిగానూ, అలకాపురికి ప్రభువుగానూ చెప్పారు.  ఈయన భార్య పేరు వృధ్ధి. ఈయన వాహనం నరుడని, మేషమనీ, గాడిద అనీ రకరకాలుగా చెప్పబడింది. లేపాక్షి ప్రతిమలో మాత్రం ఇవేవీ కాకుండా అశ్వాన్ని ఈయన వాహనంగా చూపారు. ఇది ప్రత్యేకత, ఆసక్తిని రేకెత్తించే విషయం.

లేపాక్షిలోని కుబేరుని ప్రతిమ చాలా అందంగా తీర్చబడింది. నాలుగు చేతులు, పై రెండు చేతులలో గద, ఖడ్గం వుండి, క్రింది రెండు చేతులూ అభయ, వరద ముద్రలలో వున్నట్లుగా మలచబడి వుంది.  కుబేరునిది కుండ లాంటి పొట్ట అని కూడా చెబుతారు.  లేపాక్షి ప్రతిమలో మాత్రం అలా కనపడదు. అందమైన రూపంతో వుంటుంది ప్రతిమ. ప్రతిమ క్రిందిభాగాన ఫలకంపై అందంగా మలచబడిన అశ్వం, పైకి లేచి వున్న ముందరి కాలుతో ముందుకు పరుగెడుతున్నట్లుగా కనిపిస్తుంది.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : కుబేరుడు (photo-1)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : కుబేరుడు (photo-2)

 

మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (9)

అష్టదిక్పాలకులు

ఈశాన్యుడు

దక్షిణ భారతదేశంలో గానీ, ఉత్తర భారతదేశంలోగానీ ఈ దిక్పాలుని ప్రతిమలు చాలా తక్కువగా కనబడతాయి. దక్షిణ భారతదేశంలో శ్రీకాళహస్తి, శ్రీశైలం మొదలైన ప్రదేశాలలో వున్న విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన ఆలయాలలో ఈ దిక్పాలుని ప్రతిమలున్నాయని చెబుతారు.

పురాణాలు, ఆగమాలలో చెప్పిన సంగతుల ప్రకారం, ఈశాన్యుడు గౌరీశ్వరుడని, శిరస్సుపై అర్ధచంద్రుడు, నాగ యజ్ఞోపవీతం, రత్న కుండలాలు, చేతులు అభయ వరద ముద్రలలోనూ, దక్షిణ హస్తంలో శూలం, వామ హస్తంలో కపాలం, మూడు కన్నులు, తెల్లటి దుస్తులలో వుండి వాహనమైన ఎద్దుపై స్వారీ చేస్తున్నట్లుగా వుంటాడు.

లేపాక్షి, శ్రీ వీరభద్రాలయం – అసంపూర్తి కళ్యాణమండపంలోని స్థంభంపై మలచబడిన ఈశాన్యుని ప్రతిమ చాలా అందమైనది. నాలుగు చేతులుండి, పైనున్న చేతులలో పరశు, త్రిశూలం ధరించి వుండి, క్రింది చేతులు అభయ, వరద ముద్రలలో వున్నాయి. ఈ స్వామి, అందమైన ఆభరణాలతో అలంకరింపబడి కనిపిస్తాడు.

ఈశాన్యుడి వాహనమైన నంది, ఈశాన్యుడి ప్రతిమకు క్రిందిభాగాన ఫలకంపై మలచబడి కనిపిస్తుంది.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : ఈశాన్యుడు (photo-1)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : ఈశాన్యుడు (photo-2)

మరోసారి లేపాక్షి – శ్రీ వీరభద్రాలయం (8)

అష్టదిక్పాలకులు

అగ్ని

ఋగ్వేదం భక్తితో స్తుతించిన మొదటి ముగ్గురు ప్రధాన దేవతలలో ‘అగ్ని’ ఒకడు. మిగిలిన ఇరువురూ – ఇంద్రుడు, సోముడు.  యజ్ఞయాగాదులలో సమర్పించబడిన హవ్యాన్ని దేవతలకు చేరవేసేవానిగా – హవ్యవాహకునిగా, భోక్తగా అగ్ని ఎంతగానో స్తుతింపబడ్డాడు. ఈ నాటికీ ఇది కొనసాగుతూనే వుంది.

లేపాక్షి,  శ్రీ వీరభద్రాలయం – అసంపూర్తి కళ్యాణమండపంలోని ఒక స్తంభంపై అగ్ని ప్రతిమ చెక్కబడి వుంది.  అగ్ని ప్రతిమ చెక్కబడివున్న ఈ స్తంభం కల్యాణమండపంలో ఆగ్నేయ దిక్కున వుండడం గమనించాల్సిన విషయంగా పెద్దలు చెబుతారు. ఇక్కడ అగ్నిదేవుడు ‘ద్విభంగాకృతి’ లో ఉన్నాడని కూడ చెబుతారు.  ఈ మాట అర్ధం – ఇక్కడ అగ్నిదేవుడు రెండు ముఖాలు, నాలుగు చేతులు కలిగి వున్నాడని.  పై రెండు చేతులలో పరశు, త్రిశూలం కలిగి వుండి, క్రింది రెండు చేతులు అభయ వరద ముద్రలలో వుండడం చూడవచ్చు.

పురాణాలలో (విష్ణుధర్మోత్తర, మత్స్య ఇత్యాది.) చెప్పిన సంగతుల ప్రకారం, అగ్నిదేవుడు గడ్డంతోనూ, నాలుగు చేతులతోనూ, మూడు కన్నులతోనూ వుండాలి. లేపాక్షిలోని ప్రతిమకు గడ్డం లేకపోవడం గమనించాల్సిన సంగతి. మరొక ముఖ్యమైన విషయం,  ద్విముఖుడుగా చెక్కబడివున్న అగ్ని ప్రతిమలు చాలా అరుదు.  దక్షిణాదిన ఒక్క చిదంబరంలో తప్ప వేరే ఎక్కడా ద్విముఖుడుగా వున్న అగ్ని ప్రతిమ లేదని చెబుతారు. అగ్ని వాహనమైన పొట్టేలు,  లేపాక్షిలోని విగ్రహం క్రిందిభాగంలో వున్న పీఠం పై చెక్కబడి కనిపిస్తుంది.

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : అగ్ని (చిత్రం -1)

లేపాక్షి - శ్రీ వీరభద్రాలయం : అగ్ని (చిత్రం -2)