వేణుగోపాల శతకం – కొన్ని సంగతులు (4)

‘నాతో మాట్లాడడమే ఒక education’ అంటూండే ‘కన్యాశుల్కం’ లోని గిరీశం పాత్ర కోతలను తలపింపజేసే పద్యం ఒకటి, ఈ క్రింద చూపించినది, వేణుగోపాల శతకంలో ఉంది:

“రామాండ కతలెల్ల మేమెఱుంగని యవే, కాటమరాజుకు కర్ణు డోడె
బాగోత కతలంట పలుమాఱు వినలేదె, యిగనేశు డర్జను నిరగ మొడిసె
బారత కతలోన బాలరా జొక్కడు, కుంబకర్ణుని బట్టి గుద్ది సంపె
కంద పురాండలకత పిల్లకాటేరి, యీరబద్రుని మెడ యిరగగొట్టె,

అనుచు మూర్ఖులు పలుకుదు రవనియందు….”

ఈ పద్యంలో చెప్పినట్లుగా, రామాయణ కథలో కాటమరాజుకు కర్ణుడు ఓడడం, భాగవత కథలో గణేశుడు అర్జుజుని ఓడించడం, భారత కథలో బాలరాజు కుంభకర్ణుని గుద్ది చంపడం, కుమార స్వామి కోపంతో వీరభద్రుని మెడ విరగగొట్టడం…ఇలాంటివన్నీ ఏమీ తెలియకపోయినా అన్నీ తెల్సినట్లుగా భేషజం కనబరిచే వాళ్ళు మాట్లాడే మాటలే కదా! వినే వాళ్ళు ఉండాలే గాని, చెప్పే వాళ్ళకు కొదువ ఉండదుగా!

ఇందులోదే, మంచి ధార ఉన్న పద్యం, తన్ను తాను బేరీజు వేసుకుంటూ, చివరకు తాను నమ్మిన దేవునికి తనను తాను సమర్పించుకుంటూ చెప్పిన పద్యంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను:

“ఖేద మోదంబుల భేదంబు తెలియక గోలనై కడపితి కొన్ని నాళ్ళు,
పరకామినుల కాసపడి పాప మెఱుగక కొమరు ప్రాయంబున కొన్ని నాళ్ళు,
ఉదరపోషణమున కుర్వీశులను వేడి కొదవచే కుందుచు కొన్ని నాళ్ళు,
ఘోరమైనట్టి సంసార సాగర మీదుకొనుచు పామరముచే కొన్ని నాళ్ళు,

జన్మ మెత్తుట మొదలు ఈ సరణి గడిచె, ఎటుల కృప జూచెదో గతంబెంచబోకు,
మదరిపువిఫాల మునిజన హృదయలోల వేణుగోపాల భక్త సంత్రాణశీల!”

(అయిపోయింది)

ప్రకటనలు

వేణుగోపాల శతకం – కొన్ని సంగతులు (3)

వేణుగోపాల శతకంలోని మరి కొన్ని అర్ధవంతమైన, హృద్యమైన, ఇప్పుడు అంత విరివిగా వినబడనటువంటి లోకోక్తులను క్రింద పొందుపరుస్తున్నాను:

“కలియుగ ధర్మ మేమనగ వచ్చు, నిన్నటికి ఓర్చి ఊరక యుండవలయు”
“రంభయైన తన శరీరము కరంబుల తా బిగించిన సుఖ తరములేదు”
“నత్తు లేకుండిన ముత్తైదు ముక్కు నందు (పెద్దమ్మ కొలువు తీరి యుంటుంది అని)”
“కట్ట నిల్వని చెరువు గడియ లోపల నిండు”
“పొయి పాలికే పాలు పొంగుటెల్ల”
“పొరుగూరి కేగిన పోవునే దుర్దశ”
 
ఇవి ఇలా ఉండగా, మరికొన్ని ఆసక్తి కరమైన సంగతులను తెలిపే పద్యాలను గురించి కూడా ఇక్కడ ముచ్చటించుకోవాలి.

ఎవరికి నచ్చిన మతాన్ని వారు అవలంబించుకునే స్వాతంత్ర్యాన్ని, వ్యక్తి స్వేఛ్ఛనూ భారత దేశం మొదటినుంచీ ఇస్తూ వస్తోంది.  ఆంధ్ర దేశానికి సంబంధించినంత వరకూ, శాతవాహనుల కాలంనుండీ దీనికి నిదర్శనాలున్నాయి.  శాతవాహన రాజులలో, రాజకీయ అవసరాలకోసం అనుకున్నప్పటికీ, పురుషులు హిందూ మతాన్ని అనుసరిస్తే, స్త్రీలు బౌధ్ధాన్నిఅనుసరించారు. వర్ణాశ్రమ ధర్మాలను ఎంత కట్టుదిట్టంగా అమలుపరిచినప్పటికీ, వర్ణసంకరమయ్యే సందర్భాలు ప్రతి కాలంలోనూ అన్నో ఇన్నో ఉంటూనే ఉంటాయి. ఒక ఇంటిలో, ఆ ఇంటికి సంబంధించిన బంధువర్గంతో కలుపుకుని చూస్తే, ఎన్ని రకాల మతానుయాయులూ, వర్ణాలవారూ ఉండడానికి ఆస్కారం ఉందో తెలియచెప్పే పద్యం ఒకటి, ఆసక్తికరమైనది, వేణుగోపాలశతకంలో ఉంది. ఆ పద్యం:

“తండ్రి మధ్వాచారి, తనయు డారాధ్యుండు, తల్లి రామాంజ మతస్థురాలు,
తనది కూచిమతంబు, తమ్ముడు బౌధ్ధుండు, సర్వేశ్వర మతంబు సడ్డకునిది,
ఆలు కోమటి జాతిది, అక్క జంగమురాలు, బావగారిది లింగబలిజ కులము,
ఆడుబిడ్డ సుకారి, అల్లుడు పింజారి, మఱదలు కోడలు మారువాడి,

కలియుగమ్మున వర్ణసంకరము ప్రబలి….”

ఇది కొంత అతిశయోక్తిగా అనిపించినప్పటికీ, ఇన్నిరకాలుగా ఉండడానికి అప్పట్లో అవకాశం ఉండేదంటే తప్పుకాదు. ఊళ్ళూ, నగరాలూ cosmopolitan గా మారడంలో ఆశ్చర్యపోవాలిసింది లేదుగాని, ఈ ఇల్లు దానికదే ఒక cosmopolitan ఇల్లుగా ఇందులో దర్శనమిస్తుంది.

వేణుగోపాల శతకం – కొన్ని సంగతులు (2)

నానుడులు, లోకోక్తులు అనదగినటువంటివి, అర్ధం అదే అయినా ఇప్పుడు వేరే మాటలలో ప్రయోగంలో ఉన్నటువంటివి, కొన్నైతే అసలు ప్రయోగంలో లేనటువంటివి, మరికొన్ని వేంకటకవి స్వయంగా సందర్భానికి అతికేట్లుగా కల్పించినట్లు అనిపించేటువంటివి, వేణుగోపాల శతకంలో చాలా కనిపిస్తాయి.  వాటిల్లో కొన్నిటిని క్రింద చూపడ మైంది:

‘వెన్న యుండియు నేతికి వెదికి నటుల’ – ఇంటిలో వెన్న సమృధ్ధిగా ఉన్న సంగతి మరిచి నేతికోసం ప్రయాస పడినట్లుగా అని ఈ మాటల అర్ధం. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అనే సామెత, ఒడిలో బిడ్డను పెట్టుకుని ఇల్లాంతా వెదకడ మన్న సామెతా దీనికి కాస్తంత దగ్గరగా అనిపిస్తాయి తప్ప పూర్తిగా ఈ మాటల అర్ధంతో సరిపోగల సామెత ఇప్పుడు వ్యవహారంలో ఒక్కటి కూడా లేదని నా కనిపిస్తుంది.

‘కల్ల పసిండికి కాంతి మెండు’ – మెరిసేదంతా బంగారం కాదు (all that glitters is not gold అన్న ఆంగ్ల సామెతకు మక్కికి మక్కి) ఇప్పుడు వ్యవహారంలో ఎక్కువుగా వినిపించే సామెత.  కాని అర్ధంలో సూక్ష్మమైన తేడా ఉంది. ‘ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది’ అన్న సామెత అర్ధానికి ఈ సామెత అర్ధానికి ఓమొస్తరుగా సామ్యం కుదురుతుంది. కానీ ఇందులో హేళణ ఎక్కువగా ధ్వనిస్తుంది. పై సామెతలో భావ గాంభీర్యం ఎక్కువ.

‘అల్ప విద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద’ ఇంత చక్కని నానుడి ఇప్పుడు ప్రయోగంలోనే లేదు. half knowledge is always dangerous అన్న ఆంగ్ల లోకోక్తిని గుర్తుంచు కున్నంతగా మనం ఈ సామెతను గుర్తుంచుకోలేదు. 

‘ఆబోతు పేదల యశము గోరు’ – ఇది అత్యంత హృద్యమైన నానుడి.  బసవయ్యను అంత ఎత్తులో, ఉన్నతమైన రూపంలో  లేపాక్షిలో మనవాళ్ళెందుకు మలుచుకుని స్థాపించుకున్నారో ఈ మాటల వల్ల అర్ధమవుతుంది.

‘గజముపై చౌడోలు గాడిద కెత్తితే, మోయునా పడవేశి కూయు గాని’ – చౌడోలు అంటే ఏనుగుపై  అంబారి. భారం మోయగలడో లేడో చూసి తలకెత్తాలి అనీ, సమర్ధత సరిగా గుర్తెరిగి కాని ఏపనినైనా అప్పగించ కూడదనీ ఈ మాటల అర్ధం. ఇదసలు ఇప్పుడు ప్రయోగంలో లేదు.

‘వలపు రూపెఱుగదు, నిద్ర సుఖం బెఱుగదు, ఆకలిలో నాల్క అఱుచి ఎరుగదు’ – ఇది ఒక నానుడుల మాలిక.  ఇందులో మొదటి దానికి సారూప్యత గలిగిన ‘ప్రెమ గుడ్డిది’ అనే ఇప్పుడు వాడుకలో ఉన్ననానుడి love is blind అనే ఆంగ్ల లోకోక్తి కి మక్కికి మక్కి.  దీనిని గుర్తుంచుకుని  వాడుతున్నాం మనం. నిద్ర సుఖ మెరుగదు అనే నానుడి అప్పటికి ఇప్పటికి అలాగే ప్రచారంలో ఉంది.  ఇక మూడవది ‘ఆకలి రుచి ఎరుగదు’ అన్న రూపంలో సంక్షిప్తమై ప్రయోగంలో ఉంది. ఆకలిలో నాల్క ‘అఱుచి’ ఎరుగదన్నదే హృద్యమైన అసలు రూపం.

వివిధాలు (4)

‘శుభాన్ని ధ్వంసం చేసే కలికాలంలో కూడా త్రికాల దర్శిత్వాన్ని ఇచ్చి, వర్షం సరిగా ఎప్పుడు కురిసేదీ చెప్పే జ్యోతిశ్శాస్త్రం కన్న మిన్న ఏమున్నది?’ అని ప్రశ్నించిన వరాహమిహిరుడు బృహస్సంహితను మనకిచ్చాడు. జ్యోతిశ్శాస్త్రంలో గణితము, హోర, శాఖలనే మూడు స్కంధాల కలయికను సంహిత అంటారని చెబుతారు. “సంహితా సారగః దైవచింతకో భవతి” అని. అంటే సంహితను పూర్తిగా అవగాహన చేసుకున్న వాడే దైవచింతకుడు అని ఆ మాటల అర్ధం.

*****

దేని ద్వారా జ్ఞాన ప్రాప్తి కలుగుతుందో అది వేద మనబడుతుందని పెద్దల మాట.  దర్శన వ్యాకరణ గ్రంథాలు సూత్రాలలో, కావ్య మహాకావ్యాలు శ్లోకాలలో కూర్చ బడినట్లే, వేదాలు మంత్ర రూపంలో నిబధ్ధం చేయబడినాయి.  మంత్ర సంకలనాలకు సంహిత లని పేరు. వేదాలు నాలుగు సంహితల రూపంలో ఉన్నాయి.  ఒక్కొక వేదానికి నాలుగు విభాగాలు ఉంటవి. అవి సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తులు.

*****

నీతి లోకానుభవ ప్రతిబింబము.  లోకోక్తులే క్రమముగా నీతులు అవుతున్నాయి. మహా మండలేశ్వరుడు భద్ర భూపతి (బద్దె భూపతి, బద్దెన) వివిధ నామాలతో తన్ను తాను సంబోధించుకుని, “నీతి శాస్త్ర ముక్తావళి” అని ఆంధ్ర లోక సర్వస్వమునకు పరిచితమైన “సుమతీ శతకము” ను రచించాడు.  రాజ కవి యగుట వలన ప్రతాపరుద్రుని పక్కన ఉండ దగిన వాడు.  ప్రతాపరుద్రుని “నీతి సారము” లోని పద్యాలకు “సుమతీ శతకము” లోని పద్యాలకు చాలా పోలికలున్నాయని పెద్దల మాట.

సామెతలూ, వాటి సంగతులు(5)

నీతి లోకానుభవ ప్రతిబింబము. లోకోక్తులే క్రమముగా నీతులు అవుతున్నాయి. లోకోక్తులకు లోకానుభవం నుంచి తెలుసుకున్న నిజాలు, నేర్చుకున్న పాఠాలూ ప్రాతిపదిక. ‘ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలువుతాయి’ అన్న సామెతకు కూడా లోకానుభవం నుంచి తెలుసుకున్న నిజమే ప్రాతిపదిక.

పూర్వ కాలంలో, వ్యాపారం రెండు విధాలుగా జరెగేది. చిన్న చిన్న వ్యాపారులు వస్తువులను బళ్ళమీద ఒక ఊరి నుండి ఇంకొక వూరికి తిప్పుతూ చేసే చిల్లర వస్తువుల వ్యాపారం ఒకటి. రెండవ రకం, బాగా ధనవంతులైన వ్యాపారులు ఓడల మీద సరుకులను విదేశాలకు తీసుకువెళ్ళి చేసే వ్యాపారం. దైవం అనుకూలించనప్పుడు, అదృష్టం కలిసిరానప్పుడు, సముద్ర యానంలో సంభవించిన ఏ తుఫాను లోనో సరుకులను తీసుకెళుతూండిన  ఓడలు గల్లంతై పెద్ద పెట్టున నష్టపోయి తెల్లవారేసరికల్లా ధనవంతుడు దరిద్రుడై మిగలడం, దేశంలో పొరుగూళ్ళలో చేస్తూండిన చిన్న సరుకుల వ్యాపారమే దైవం అనుకూలించడం వలన బాగా కలిసొచ్చి కొద్ది రోజుల్లోనే బాగా ధనవంతుడై బళ్ళలో చేస్తూండిన వ్యాపారం వృధ్ధి చెంది ఓడల కెక్కి విదేశాలకు మళ్ళడం లాంటి సందర్భాలూ సన్నివేశాలూ నిజజీవితంలోనివి కథలలో కెక్కి కనిపిస్తూంటాయి.

‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అన్న సామెత ఇలాంటి దృష్టాంతాలనుంచి పుట్టిందే. ఇందులో, కాలం కలిసొస్తే బండి ఓడవడం, కలిసి రానప్పుడు ఓడ బండవడం సరియైనది. అయితే, సుమతీ శతక కర్త అయిన బద్దెన మంత్రి ఈ సామెతను కలిమి లేముల్లాగా ఓడలు బళ్ళ మీదా, బళ్ళు ఓడల మీదా వస్తాయి అంటూ కలిమి లేముల ప్రసక్తి తెచ్చి వాటి రాకపోకలను అన్వయించడానికి చేసిన ప్రయత్నంలో, అన్వయం అంత బాగా కుదరక పోయినప్పటికీ, లోకం సరిపెట్టుకుంది. కానీ, భాస్కర శతక కర్త అయిన మారయగారి వెంకయ గారు దీని అర్ధాన్నే పూర్తిగా మార్చి వేశాడు. కష్టాల్లో పరస్పర సహకారం అన్న అర్ధంలో దృష్టాంతంగా దీనిని వాడాడు.  సరిపెట్టుకుందామని చూసినా సరే, సరిగా అన్వయం కుదరని సందర్భం ఇందులోది. నీటిపై ఓడలో బళ్ళు ప్రయాణించడం, నేల మీద బళ్ళపై ఓడలు ప్రయాణించడం లోకానుభవానికి దృష్టాంతాలుగా సాధారణంగా దొరికే సన్నివేశాలు కావు. అందువలన, సుమతీ శతకంలోనూ, భాస్కర శతకంలోనూ వాడబడిన రూపాలు సరియయినవి కావు. అన్వయానికి కుదరని రూపాలని తేలుతుంది.

లోకానుభవాలను సామెతల రూపంలో నీతి బోధకాలుగా చెప్పే ప్రక్రియలో, అతి తక్కువ మాటలలో చెపాల్సిన విషయాన్ని చెప్పడానికి వీలుగా మాటల్ని వడపోసి వడపోసి కూర్చగా అయినవే సామెతలు.  వాటిలో వ్యర్ధ పదాలూ, అర్ధ రహితమైన మాటలు సాధారణంగా ఉండవు.  ప్రతి మాట వెనుకా ఏదో బలమైన కారణం, అర్ధవంతమైన అనుభవ సారం తప్పకుండా ఉంటుంది. అందువల్ల ఈ సామెత ‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అన్న రూపమే అసలైనదీ, లోకానుభవ సిధ్ధమైనదీను!

సామెతలూ, వాటి సంగతులు(4)

“ఓడల బండ్లును వచ్చును
ఓడను నాబండ్ల మీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు కలిమిలేమి వసుధను సుమతీ!”

సుమతీ శతకం లోని ఈ పద్యంలో కూడ ఈ ‘ఓడలు బండ్ల’ సామెత వాడబడి కనిపిస్తుంది. ఇందులో కూడా ఓడలు బండ్ల మీదా, బండ్లు ఓడల మీదా వస్తాయి అన్న అర్ధంలోనే సుమతీ శతకకారుడైన బద్దెన మంత్రి కూడా వాడాడు. అయితే, జీవితాల్లో కలిమి లేముల రాకపోకలతో  తారుమారవుతూండే పరిస్థితులను సూచించే అర్ధంలోనే బద్దెన ఈ సామెతను వాడాదన్నది స్పష్టం.

సుమతీ శతక కర్తృత్వ విషయంలో వివాదములున్నప్పటికీ, ఇది బద్దెన చేత వ్రాయబడినాదిగానే ప్రసిధ్ధం.  జనసామాన్యం చేత బద్దెన అని పిలవబడిన భద్ర భూపతి క్రీ.శ.13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి.  కనుక సుమతీ శతకం కూడా 13వ శతాబ్దానికి చెందినదే అనుకుంటే, ఈ సామెత చరిత్ర కూడ 13వ శతాబ్దం కంటె వెనకకు వెళుతుంది. లోకంలో బహుళ ప్రచారంలో ఉంటేనే కదా, పద్యాలలోకి ఎక్కేది! అయితే, అప్పట్లో ఈ సామెత బద్దెన చేత పైన సూచించిన అర్ధంలో వాడబడితే, భాస్కర శతక కర్త అయిన మారయగారి వెంకయ చేత తన పద్యంలో వేరే అర్ధంలో, అంటే కష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం అన్న అర్ధం సూచితమయ్యేలా వాడాడు. దీని వలన  ఈ సామెత అర్ధాన్ని గురించి పండితులలో అప్పటికే అభిప్రాయ బేధాలు ఉన్నాయని అనుకోవాల్సి ఉంటుంది. అయితే, చివరికి సుమతీ శతక కర్తయైన బద్దెన సూచించిన అర్ధమే జనామోదం పొంది నిలిచిపోయిందని కూడా అనుకోవాల్సి ఉంటుంది. ఇరువురి పద్యాలలోనూ ఈ సామెత ఉన్న రూపం ఒకటే. ‘ఓడలు బండ్ల మీద వస్తాయి, బండ్లు ఓడల మీద వస్తాయి’ అని. ఇందులో ‘రావడం’ అన్నదే గాని ఇప్పుడున్న విధంగా ‘అవడం’ లేదు. పద్యంలో ఛందస్సు కోసం ‘వచ్చు’ ను చేర్చి ఉన్నట్లయితే, ఆ తప్పు మొదటగా సుమతీ శతక కర్తయైన బద్దెనదే అవుతుంది. అలా కాకుండా, అవసరమైనప్పుడు ‘ఓడలను బండ్లు లాగుతాయి, బండ్లను ఓడలు లాగుతాయి’ అన్నట్లుగా ఉండిన ఈ సామెత, వాడకంలో కాల క్రమేణా అసలు రూపం పోగొట్టుకుని ‘లాగుతాయి’ కాస్తా ‘లావుతాయి’, ‘లవుతాయి’ గా మారి, చివరికి ‘ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి’ అని మారి ఉన్నట్లయితే, ఈ రూపమే జనసామాన్యనికి ఇష్టమైనదిగా అనుకోవాల్సి ఉంటుంది.

ఏదేమైనా, అదృష్టాలు మారితే సంపన్నుడు బికారి కావడం, బికారి సంపన్నుడు కావడం అన్న సందర్భానికి సరిపోయేట్లుగానే ఈ సామెత ఇప్పుడు మిగిలి ఉంది.

సామెతలూ, వాటి సంగతులు (3)

“ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి” అని తెలుగులో ఒక సామెత ఉంది.  దీనిని అదృష్టం కలిసి రాకపోతే పరిస్థితులు తారుమారై ఈ రోజు భాగ్యవంతుడు రేపటికల్లా బికారి కావచ్చు, ఈ రోజుటి బికారి రేపటికి భాగ్యవంతుడు కావచ్చు గనుక మనిషిని మనిషిగా గౌరవించాలి గాని ఉన్న సంపదను చూసుకుని మిడిసిపడడం తగదు అన్న అర్ధంలో ఒక హెచ్చరికగా వాడ బడుతోంది.

తెలుగులో ఈ సామెత  భాస్కర శతకం రచించ బడిన రోజుల నుంచీ ఉంది.  దీనికి నిదర్శనం భాస్కర శతకంలోనే ఉంది.  భాస్కర శతకంలో మూడవ పద్యం:

“అక్కరపాటు వచ్చు సమయంబున జుట్టము లొక్క రొక్కరి
న్మక్కువ నుధ్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ
యొక్కట; నీటిలో మెరక నోడల బండ్లను బండ్లనోడలున్
దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా!”

బేధమల్లా, ఈ పద్యంలో భాస్కర శతకకర్తగా భావింప బడుతూన్న మారయగారి వెంకయ ఇప్పుడు వాడబడుతూన్న ‘ఓడలు బళ్ళు అవుతాయి’ అన్నరూపంలో కాకుండా, ‘ఓడల బండ్లు వచ్చుట’ అన్న రూపంలో వాడాడు. అర్ధం విషయంలో సందేహం లేకుండా స్పష్టత కోసంగా ‘నీటిలో, మెరక’ అన్న పదాలు గూడా వాడాడు.  దీనిని బట్టి చూస్తే ఈ సామెత పూర్వం ‘ఓడలు బళ్ళు లాగుతాయి, బళ్ళు ఓడలు లాగుతాయి’ అన్న రూపంలో ఉండి, రాను రాను ‘ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి’ అని మారినట్లుగా కనిపిస్తుంది.

భాస్కర శతకంలో ఈ సామెత వాడబడిన సందర్భములో విశదమయ్యే అర్ధానికీ, ఇప్పుడు వాడ బడుతూన్న అర్ధానికి కూడా తేడా కనిపిస్తుంది.  భాస్కర శతకంలో ఇది ‘ఆపత్కాలంలో పరస్పర సహకారం’ అన్న అర్ధంలో వాడబడి కనిపిస్తూండగా, ఇప్పుడు దానికి సంబంధం లేని అదృష్టంతో తారు మారు కాగలిగే పరిస్థితులకు సూచకంగా వాడబడుతోంది.