తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (3)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (3)

వేదాలకు సంబంధించిన పరిభాషలో ‘బ్రహ్మ’ అంటే మంత్రమనీ, వేదమంత్రాల వినియోగాన్ని విశదీకరించి, వివరించేవి కాబట్టి బ్రాహ్మణాలని పెద్దలు చెబుతారు. ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదానికి చెందినది. సోమయాగ నిర్వాహణకు సంబంధించిన విషయాల విశదీకరణ ఐతరేయ బ్రాహ్మణానికి ప్రథాన విషయం. ఇది ఏకవ్యక్తికృతమనీ, ఆ వ్యక్తి మహీదాస ఐతరేయుడనీ సంప్రదాయ వచనం. ఇందులోని విషయం మొత్తం నలభై అధ్యాయాలుగా విభజించబడింది. ఈ నలభై అధ్యాయాలూ మళ్ళీ ఒక్కొక పంచికకు ఐదు అధ్యాయాలు చొప్పున ఎనిమిది పంచికలుగా అమర్చబడింది. ఈ ఎనిమిది పంచికలలో చివరి రెండు పంచికలు, అంటే ఏడు, ఎనిమిది పంచికలు (చివరి పది అధ్యాయాలు) భాష పరంగానూ, అందులోని విషయం పరంగానూ చూస్తే, అర్వాచీనకాలికాలనీ, ప్రక్షిప్తాలనీ పెద్దలు చెబుతారు. (A.B. Keith – “Rigveda Brahmanas” 1920;  మల్లాది సూర్యనారాయణ శాస్త్రి – “సంస్కృత వాఙ్మయ చరిత్ర – ప్రథమ సంపుటం – వేద వాఙ్మయం” – ప్రథమ ముద్రణ 1936). ఇందులోని ఏడవ పంచికలో శునశ్శేపుని వృత్తాంతం ఉంది.

అప్పటిలో జనశ్రుతిలో ఉన్న శునశ్శేపుని కథను, ఆంధ్ర పుండ్ర పుళిందాది జాతుల ఉనికికి నిదర్శనంగానూ, ఉత్పత్తికి సంబంధించిన కథగానూ ఐతరేయ బ్రాహ్మణానికి అనుసంధానం చేయబడి చెప్పబడింది. ఆంధ్రుల ప్రాచీనత్వానికి సంబంధించిన మాట ఎప్పుడు వచ్చినా, ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని వృత్తాంతాన్ని నిదర్శనంగా చూపి, చరిత్రలో ఆంధ్రుల ఉనికి ఇక్కడినుంచి ఉందన్నది చెప్పబడిందే తప్ప, ఈ వృత్తాంతానికి సంబంధించిన సాంఘిక నేపథ్యాన్ని, ఇందులో ఆంధ్రుల ప్రస్తావన రావడానికి దారి తీసిన పరిస్థితులను కాస్తంతైన critical గా అన్వీక్షించే ప్రయత్నం జరిగినట్లుగా నేను చదివినంతలో నా దృష్టికి రాలేదు. శునశ్శేపుని వృత్తాంతంలో ఆంధ్ర పుండ్ర పుళిందాది జాతుల ఉనికికి సంబంధించిన నిర్ధారణ తప్ప వేరే తెలియదగింది ఏమీ లేదా?! అన్నది నా ప్రశ్న, సందేహం.అంతమాత్రమే కాదేమో! అని నా అనుమానం.

A.B. Keith గారి అభిప్రాయం ప్రకారం ఐతరేయబ్రాహ్మణ రచనా కాలం క్రీస్తుపూర్వం ఎనిమిదివందల సంవత్సరములకంటే అనంతరం కాదు, అలాగే అందులోని ప్రక్షిప్తాల రచనా కాలం క్రీస్తుపూర్వం మూడువందల సంవత్సరముల కంటే తరువాత కాదు. స్థూలంగా ఈ కాల నిర్ణయం పండితులందరి ఆమోదాన్ని పొందింది కూడా! అయితే, క్రీ.పూ.300 సంవత్సరాల కాలం నాటికే ఆంధ్ర సామ్రాజ్యం ఉన్నత దశలో ఉన్నట్లూ, ఆంధ్ర సామ్రాజ్యంలో అప్పుడు 30 దుర్గాలూ, ఒక లక్ష కాల్బలమూ, రెండువేల అశ్వములు, వేయి ఏనుగుల బలము ఉన్నట్లు మౌర్యసామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తమౌర్యుని ఆస్థానంలో రాయబారి గా ఉన్న మెగాస్తనీసు వ్రాతలను బట్టి తెలుస్తుందని ఆంధ్ర చరిత్రకారులలో శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు మొదలైనవారు వ్రాశారు (తెలుగు విజ్ఞాన సర్వస్వం, మూడవ సంపుటం). ఇందువలన, అప్పటికే ఒక సామ్రాజ్య నిర్మాతలైన ఆంధ్రులను గురించి అదే కాలంలో ప్రక్షిప్తీకరించినదిగా చెప్పబడుతూన్న, అంగీకరించబడుతూన్న శునశ్శేపుని కథలో ఆంధ్రులు నీచజాతికి చెందినవారుగానూ, సాంస్కృతికంగా అథములుగానూ ఎందుకు వర్ణించబడ్డారు? (ఐతరేయబ్రాహ్మణంలోని ఈ భాగానికి చెందిన వ్యాఖ్యలలోని ఒక వ్యాఖ్యలో విశ్వామిత్రుడు వీళ్ళను “మీ సంతానం అభక్ష్య భక్షణం చేయుగాక” అని శపించినట్లుగా కూడా చెప్పబడింది (రాహుల్ సాంకృత్యాయన్ – ఋగ్వేద ఆర్యులు)). ఆర్య ఋషి అయిన విశ్వామిత్రుడు ఆంధ్ర తదితర జాతికి చెందిన వారలను, వారి జీవన పధ్ధతులను ఇంతగా గర్హించడానికి కారణం ఏమిటి? ఇది అర్ధం కావాలంటే కాలంలో కొన్ని శతాబ్దాలు వెనకకు వెళ్ళి, మూలాలనుంచి స్థూలంగానైనా సమీక్షించుకుంటూ రావాలి.

హరప్ప-మొహెంజొదారొ కాలం నాటి  సాంఘిక నేపథ్యానికి (social setting కి) పూర్తిగా భిన్నమైన సాంఘిక నేపథ్యాన్ని (social setting ని) ఋగ్వేదం భారత దేశానికి ఇచ్చింది. హరప్ప-మొహెంజొదారొ లు ఒక గుర్తుగా నిలిచిన సింధు నాగరికత వర్ధిల్లిన కాలం క్రీ.పూ.2600 నుండి క్రీ.పూ.1750 ధాకా. ఈ మధ్య కాలంలో – కనిపించే నిజం, మనిషి, అతని శరీరం చేసే శ్రమ (అటు భూమిని నమ్ముకుని గానీ, లేక ఇటు వర్తకాన్ని నమ్ముకుని గానీ), శ్రమ మీద నమ్మకం, శాంతి – ఇవే ప్రధానంగా ఉండి అప్పటి జీవనం గడిచిందని పురావస్తు తవ్వకాలలో బయటపడ్డ అవశేషాల విశేషాలు, అధారాలు చెబుతాయి. ఋగ్వేదం దీనిని పూర్తిగా మార్చి వేసింది. మనిషి శ్రమ కన్నా, దైవం – దైవ కృప, దానికోసం ప్రార్ధన, యజ్ఞం, కనిపించే నిజాన్ని కాదని కనిపించని నిజం కోసం తపన, యోచన, యుధ్ధం, జయం, జయం కోసం తపన, భయం – ఇవి ముఖ్యమైన విలువలుగా మారాయి. ఇదే అప్పటికి ఆధునికతగా, సంస్కృతిగా చెప్పబడింది, అయింది.  ఇందులో ఒదగని ప్రతిదీ, హేయమైనది, గర్హ్యమైనదీ అయింది. దీనికి ప్రాతినిధ్యం వహించే ఋగ్వేద పూర్వపు సంస్కృతికి చెందిన జాతుల, తెగల జనులు దస్యులయ్యారు. ఆ కారణంగా దమనానికి అర్హులయ్యారు. తొలి రోజులలో వేద సంబంధ క్రతువులన్నిటిలోనూ హింస ఉంది. ఒక ఉత్సవంగా జరిగిన హింస ఇది. ఆ నాగరికతలో ఇది అంతర్భాగం. ఆడుతూ పాడుతూ ఆహ్లాదంలో జరిపిన హింస ఇది. ఒక సహస్రాబ్దం పైగానే ఇది కొనసాగింది. మొదలవడం జంతువులతోనే అయినా, ఇది పోనుపోనూ నరమేధం అన్న ప్రక్రియ దాకానూ వెళ్ళింది (ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని వృత్తాంతమే దీనికి నిదర్శనం). ఇది పరాకాష్ఠ. క్రీ.పూ.6వ శతాబ్దం ఉత్తరార్ధంలో గౌతముడు బుధ్ధుడై ఈ హింసను నిరసించి అహింసను ప్రబోధించడంతో దీనికి ప్రభావవంతమైన అడ్డుకట్ట పడింది. అప్పటికే ఈ సంస్కృతితో విసిగి వేసారి ఉన్న సామన్యులు తండోపతండాలుగా బుధ్ధుని ప్రబోధనలకు ఆకర్షితులై ఆ వైపు మరలడంతో నిరసన ప్రత్యక్షంగానూ, బహిరంగంగానూ వ్యక్తమైంది. వేదం ఏ సంస్కృతినైతే ఆచరణలో పెట్టిందో, ప్రబోధించిందో ఆ సంస్కృతితో పాటు, ఆ సంస్కృతికి సంబంధింధిన భాష అయిన సంస్కృతమూ నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టివేయబడ్డాయి. సామన్యుడి బాష అయిన పాలీ, ప్రాకృతాలకు జనాదరణ బాగా పెరిగింది. బుధ్ధుని బోధనలన్నీ పాలీ భాషలోనే గ్రంథస్తం చేయబడినాయి. ప్రజలే కాక ప్రభువులూ దీనిని అనుసరించక తప్పలేదు. ఆ ప్రభువువులలో ఒకరు  ఆంధ్రులు. బౌధ్ధాన్ని నిస్సంకోచంగా అనుసరించారు. అయితే, బుధ్ధుడు విష్ణుమూర్తి అవతారాలలో ఒక అవతారంగా చేయబడినట్లుగానే, ఆంధ్రులు విశ్వామిత్రుని అర్ధ సంతానం (తొలి యాభై మంది) లో అగ్రగణ్యులుగా శునశ్శేపుని కథ ద్వారా చేయబడడం అన్నది ఇక్కడ ఇంకొక ఆసక్తిని రేకెత్తించే అంశం!

బౌధ్ధం రంగ ప్రవేశం తరువాత, ఆ కాలంలో ఆర్య సంస్కృతి ఆదరణ కోల్పోవడం అన్నది, అందులో హింసకు సంబంధించి అభిప్రాయ బేదాలు తలెత్తడ మన్నది, తత్ఫలితంగా ఆర్య గణాలలో (జనాలలో) ఏర్పడిన వేర్పాటు (division) అన్నది వ్యూహాత్మకంగా శునశ్శేపునిని కథ ద్వారా చెప్పబడిందని నేననుకుంటాను. విశ్వామిత్రునికి వందమంది సంతానం అన్నది, అందులో మధుఛ్ఛందసుని కంటే పెద్దవారు ఆయన నిర్ణయాన్ని ధిక్కరించడమన్నదీ, వారు పోను మధుఛ్ఛందసుని తరువాతి యాభైమంది పుత్రులూ అతడి నిర్ణయాన్ని ఆమోదించి అనుసరించడమన్నదీ ఆర్యులలో చీలికను వ్యూహాత్మకంగా చెప్పడమే అనుకుంటాను. విశ్వామితుడు ఈ కథలో ఒక వ్యక్తి కాదు, ఆ సంస్కృతి మొత్తానికీ ప్రతినిధి! ఆయన ప్రాతినిధ్యం వహించిన సంస్కృతిని ధిక్కరించిన జాతులలో ప్రప్రథమంగా వినిపించే పేరు ఆంధ్రులది!

ప్రకటనలు

వివిధాలు (4)

‘శుభాన్ని ధ్వంసం చేసే కలికాలంలో కూడా త్రికాల దర్శిత్వాన్ని ఇచ్చి, వర్షం సరిగా ఎప్పుడు కురిసేదీ చెప్పే జ్యోతిశ్శాస్త్రం కన్న మిన్న ఏమున్నది?’ అని ప్రశ్నించిన వరాహమిహిరుడు బృహస్సంహితను మనకిచ్చాడు. జ్యోతిశ్శాస్త్రంలో గణితము, హోర, శాఖలనే మూడు స్కంధాల కలయికను సంహిత అంటారని చెబుతారు. “సంహితా సారగః దైవచింతకో భవతి” అని. అంటే సంహితను పూర్తిగా అవగాహన చేసుకున్న వాడే దైవచింతకుడు అని ఆ మాటల అర్ధం.

*****

దేని ద్వారా జ్ఞాన ప్రాప్తి కలుగుతుందో అది వేద మనబడుతుందని పెద్దల మాట.  దర్శన వ్యాకరణ గ్రంథాలు సూత్రాలలో, కావ్య మహాకావ్యాలు శ్లోకాలలో కూర్చ బడినట్లే, వేదాలు మంత్ర రూపంలో నిబధ్ధం చేయబడినాయి.  మంత్ర సంకలనాలకు సంహిత లని పేరు. వేదాలు నాలుగు సంహితల రూపంలో ఉన్నాయి.  ఒక్కొక వేదానికి నాలుగు విభాగాలు ఉంటవి. అవి సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తులు.

*****

నీతి లోకానుభవ ప్రతిబింబము.  లోకోక్తులే క్రమముగా నీతులు అవుతున్నాయి. మహా మండలేశ్వరుడు భద్ర భూపతి (బద్దె భూపతి, బద్దెన) వివిధ నామాలతో తన్ను తాను సంబోధించుకుని, “నీతి శాస్త్ర ముక్తావళి” అని ఆంధ్ర లోక సర్వస్వమునకు పరిచితమైన “సుమతీ శతకము” ను రచించాడు.  రాజ కవి యగుట వలన ప్రతాపరుద్రుని పక్కన ఉండ దగిన వాడు.  ప్రతాపరుద్రుని “నీతి సారము” లోని పద్యాలకు “సుమతీ శతకము” లోని పద్యాలకు చాలా పోలికలున్నాయని పెద్దల మాట.

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (9)

తండ్రి నోట ఉద్దేశ్యపూర్వకంగా వెలువడని మాటలయినా సరే అర్ధంలేనివి కావడానికి వీల్లేదన్న తలంపుతో నచికేతుడు తనకు తానుగా మృత్యువుకు సమర్పించుకోవడానికి సిధ్ధమై యముని సదనము ముందు నిలుస్తాడు.  మూడు రోజులు ఓపికగా వేచి ఉన్న తరువాత ప్రత్యక్షమైన యముడు, నచికేతుని సంకల్పానికి ముచ్చటపడి ఇవ్వడానికి అంగీకరించిన మూడు వరాలకు ప్రతిగా ఆత్మజ్ఞానం ప్రసాదించమంటాడు నచికేతుడు. అందుకు అంగీకరించి, సందేహాలను అడుగమన్న యముడిని నచికేతుడు “స్వామీ! మనుష్యుడు మర్త్యుడు. అయితే కొందరు చెబుతారూ మృత్యువు అంతంకాదని.  ఆత్మ అనేది ఒకటుంటుందనీ, అది అనంతమయిన దనిన్నీ.  కొందరంటారూ, అదంతా ఒట్టి పుక్కిటి పురాణం అనీ. వీటిల్లో ఏది నిజం?” అని ప్రశ్నిస్తాడు.

నచికేతుని ప్రశ్నకు  యముడు చెప్పిన సమాధాన సారాంశం ఇది –  “రెండు రకాల అనుభవాలు ఉంటాయి.  శ్రేయము, ప్రేయము అని వాటి పేళ్ళు. మనుష్యుని ఈ రెండు రకాల అనుభవాలూ, వీటి తాలుకు అనుభూతులూ అల్లుకుని ఉంటాయి. శ్రేయము విముక్తిని ఇచ్చేటువంటిది.  ప్రేయము కట్టిపడవేసేటువంటిది. వివేకులు శ్రేయమనే దారిని ఎన్నుకుంటారు.  అవివేకులు ప్రేయమనే దారిని ఎన్నుకుని అవిద్యలో మగ్గుతుంటారు.  వారికి విముక్తి ఉండదు.  ఆత్మ అంతం, అనంతం రెండూను.  ఆత్మను గురించి ఎరిగినవాడు వైరుధ్యాలను గురించి ఖేదపడడు.  ఆత్మ అనేటువంటిది తెలుసుకోగలిగినటువంటి వస్తువు కాదు.  అది అంతిమ సత్యం.  ఆత్మ జ్ఞానాన్ని పొందడం బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే.  ఆత్మ జ్ఞానాన్ని గురించి ఎరుకపరచడం అత్యుత్తమమైన జ్ఞాన బోధన అవుతుంది. అందులో బోధ పరచువాడు బ్రహ్మమే, బోధ బ్రహ్మమే, బొధపరచబడునదీ బ్రహ్మమే.  ఇది తెలుసుకోవడమే ముక్తి.  ఇది నమ్మకంతో సాధించుకోవలసిందే గాని తర్కానికి అందేటువంటిది కాదు.”

ఇందులో కొత్తగా విశదమయ్యిందేమీ లేదు.  అయినప్పటికీ భారితీయ చిత్తాన్ని ఈ విశదీకరణ విశేషంగా ఆకర్షించి వశపరచుకుంది. అస్పష్టతనూ సంధిగ్దతనూ అలాగేవుంచి మబ్బు విడీవిడకుండునట్లుగా చేసిన ఈ విశదీకరణ సామాన్య ప్రజానీకం ఎవరి చిత్తానికి తోచినట్లుగా వాళ్ళు పరమాత్మ స్వరూపాన్ని ఊహించుకోవడానికి అవసరమైన సౌలభ్యాన్ని కలిగించింది.

చాందోగ్యోపనిషత్తులోని తండ్రీకొడుకుల సంభాషణలో చివరకు ఎదురైన శూన్యాన్ని పరమాత్మగా చెప్పడాన్ని భారతీయ చిత్తం అంగీకరించింది.  అదే శూన్యాన్ని శూన్యంగానే ఒప్పుకోమన్న నాగార్జునుని శూన్యవాదాన్ని, మిగతా సంగతుల మాటెలాఉన్నా, హర్షించలేక పోయింది.

ఈశావాస్య ఉపనిషత్తు పరమాత్మ భావనను అన్నిటినుంచి విడిగా, అత్యంత ఉన్నతంగా నిలబెట్టడాన్ని కూడా భారతీయ చిత్తం అంగీకరించింది.  మిగతా సంగతుల మాటెలాఉన్నా, పరమాత్మను భూమిమీదికి దించి చైతన్యంఉన్న ప్రతి ప్రాణీ మూలశక్తి (పరమాత్మ) తో సమానమే నంటూ పరమాత్మ బహుత్వ భావనను ముందుకు తేబోయిన సాంఖ్యవాదాన్ని అంగీకరించలేకపోయింది.

ఫలితంగా ఈ చింతనలు వెనకకు వెళ్ళిపోయాయి.  ఉపనిషద్వాణి మిగిలింది.  మిగిలుంది.

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (8)

వేదాలు ముఖ్యంగా విధులు.

ముందు భాగాలలో చెప్పుకున్నట్లుగా, భారతీయ తత్త్వ చింతనకు సంబంధించిన ఆదిమూలాలన్నీ ఉపనిషత్తులలో దొరుకుతాయి. ‘ఈశావాస్య మిదం సర్వం’ అంటూ మొదలువుతుంది ఈశావాస్య ఉపనిషత్తు. జగత్తంతా ఈశ్వరమయం, ఈశ్వరుడు పరమ సత్యం, అంతిమ సత్యం అని ఈ మాటలు చెబుతాయి.

సత్యం రెండు రకాలుగా ఉంటుంది.  లౌకికం, పార లౌకిక సత్యం.  రెండవ సత్యం సామాన్యుడి పరిశీలనకు అందదు. యోగాభ్యాసంతో అనుభవంలోకి తెచ్చుకోవచ్చునంటారు యోగులు.

సామాన్యుడి పరిశీలనకు అందని ఈ పరమ సత్యమే జగత్తంతా నిండి ఉందనీ, దాన్ని నమ్మితీరాలనీ నిర్ద్వందంగా చెబుతూ మొదలవుతుంది ఈశావాస్య ఉపనిషత్తు.  ఆదిలోనే ఇది ఒక తప్పటడుగు. సమాధానం కోసం భూమిని వదిలి ఆకాశంలోకి దృష్టి మళ్ళింపు, దారి మళ్ళింపు.  ఈరోజున తీరికగా కూర్చుని చూసే కంటికి ఆరోజుటి దృష్టికి ఉండిన పరిమితులు అర్ధ మెలా అవుతాయని అనుకున్నప్పటికీ, తత్త్వ చింతన పరంగా దీనిని ఒక తప్పటడుగు గానే భావించవలసి ఉంటుంది.

దీనిని సరిచేయడానికి తరువాతి కాలంలో బౌధ్ధం, వైశేషిక, న్యాయ సూత్రాలూ, తర్క శాస్త్రం తగినంత కృషి చేశాయి.  దృష్టిని అకాశాన్నించి భూమికి మళ్ళించినట్లు అనిపించేలా చేశాయి.

సాంఖ్య, వైశేషిక, యోగ, న్యాయ సూత్రాలకు భారతీయ తత్త్వ శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది.  ఈ సూత్రాలు రమారమి క్రీ.పూ.200 – క్రీ.శ.200 సం.ల మధ్య కాలంలో గ్రంథస్తం చేయబడినాయి. సమ్యక్ జ్ఞానాన్ని అంటే  సరియైన జ్ఞానాన్ని కలిగిస్తుంది గనుక దానిని సాంఖ్యవాద మని అన్నారు.  సాంఖ్యం జ్ఞాన ప్రధానమైన సిధ్ధాంతం.  ప్రపంచానికంతా మూలం రెండు శక్తులు ప్రకృతి, పురుషుడు, ఈ రెండూ స్వయం సిధ్ధములు అని సాంఖ్యులు అంటారు.

ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తామని సాంఖ్యుల జ్ఞాన సిధ్ధాంతం చెబుతుంది.  అయితే, సాంఖ్యులు ఉపనిషత్తులు ముందుంచిన ఆత్మను అంగీకరించారు.  ఎందరు ప్రాణులుంటారో అన్ని ఆత్మలుంటాయనీ, ఆత్మ ఎల్లప్పుడూ చైతన్యవంతమయిన శక్తిగానే ఉంటుందనీ, చైతన్యం ఆత్మకు ఒక లక్షణంగాదు, ఆత్మా చైతన్యం రెండూ ఒకటేననీ సాంఖ్యులు వాదిస్తారు. ఉపనిషత్తులకు, సాంఖ్యులకు బేధమల్లా  ఉపనిషత్తులు పరమాత్మను అన్నిటికంటే ఎత్తున విడిగా చూపెట్టాయి, సాంఖ్యులు చైతన్యమున్న ప్రతి ప్రాణీ పరమాత్మే అన్నారు.

సాంఖ్య వాద చిహ్నాలు ఉపనిషత్తులలోనే ఉన్నాయనీ, కఠోపనిషత్తులో ఆత్మ అనశ్వరం, పురుషుడు ఆత్మ ఒకటే అను భావం పదే పదే పునశ్చరణ ఔతూంటుందనీ, భగవద్గీతలోని ఆత్మ శాశ్వతత్వాన్ని నిరూపించే శ్లోకాలు కఠోపనిషత్తు నుండి మక్కికి మక్కిగా తీసుకోబడినవిగా అనిపిస్తాయనీ పెద్దలు చెబుతారు.

ఈ చింతనలకు సంబంధించిన నచికేతుని కథ కఠోపనిషత్తులోనే ఉంది.

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (7)

అచార్య నాగార్జునుడు బహుముఖ ప్రజ్ఞావంతుడు. తర్కము, వేదాంతము, రసాయన శాస్త్రము, వృక్షశాస్త్రము, వైద్యవిషయ శాస్త్రములు ఇత్యాది విద్యలయందు నిష్ణాతుడు.  తర్క, వేదాంతములలో ఇతనిది శూన్య వాదం.

తార్కిక సత్యం లౌకికం, పారలౌకికం అని రెండు రకాలు. లౌకిక సత్య నిరూపణకు ములాలు ఈ లోకంలో దొరుకుతాయి గనుక అది నిరూపణ సాధ్యం, కనుక మౌలికం. పారలౌకిక సత్య నిరూపణకు మూలాలు ఈ లోకంలో దొరకువు గనుక అది నిరూపణకు అసాధ్యం, కనుక అమౌలకం. అది నిస్స్వభావం, కనుక శూన్యం.  బౌధ్ధ తత్త్వచింతన మొదటి సత్యానికి, అంటే లౌకిక సత్యానికి మాత్రమే పరిమితమయినది.

సత్యాన్ని రెండు రకాలుగా విభజించడంవల్ల నాగార్జునుడు బౌధ్ధ తత్త్వచింతన సారాన్నే మార్చివేశాడనీ, ప్రజలలో సామాన్యులు, మేధావులు అన్న విభజనకు ఇది దారి తీసిందనీ, పరమార్ధంలో అంతా శూన్యం గనుక లౌకికంగా ఎలా ప్రవర్తించినా పరవాలేదన్న నిర్లక్ష్య ధోరణికి ఇది దారి తీసిందనీ పెద్దలు చెబుతారు. శంకరుని మాయావాదం కూడా ఇలాంటి ఫలితాన్నే కలిగించిందని కూడా చెబుతారు.

బౌధ్ధ శాఖాలలో ఆఖరుది విజ్ఞాన వాదం.  దీనినే యోగాచారం అని కూడా అంటారు.  క్రీ.శ.270-350 సం.లలో జీవించిన మైత్రేయనాథుడు యోగాచార ధోరణికి మూల పురుషుడు.

భౌతిక ప్రపంచం అవాస్తవం.  అయితే ఈ ప్రపంచాన్ని గుర్తించగలిగిన భావాలేలా పుడుతున్నాయి? అంటే, ఒక కుండను తీసుకుందాం. కుండకు సంబంధించిన ముద్ర ఒకటి అనాదిగా మన చైతన్యంలో ఉంది గనుకనే కుండ కనబడగానే ఆ ముద్ర జ్వలితమై కుండను కుండగా మనం గుర్తించ గలుగుతాం.  కుండ నశిస్తుంది.  కానీ కుండకు సంబంధించిన భావం మాత్రం నశించదు.  కనుక వస్తువు తాత్కాలిక సత్యం.  భావం శాశ్వత సత్యం.

బుధ్ధిలో జ్ఞానం లేకుండా వస్తువుని ఎలా గుర్తించ గలుగుతాం? కనుక జ్ఞానమే ముఖ్యం అని విజ్ఞానవాదుల వాదన. ఇదే వాదనను శంకరాద్వైతులు చేస్తారు.  యోగాభ్యాసం ద్వారా పరమాత్మలో లీనం కావచ్చు అని భావించి బోధించారు గనుక వీరు యోగాచారు లైనారు.

బుధ్ధుని ప్రతిమా రూపంలో పూజించ రాదని చెబుతుంది హీనయానం.  పూజించ వచ్చని చెబుతుంది మహా యానం.  శూన్య వాదులు, విజ్ఞానవాదులు మహాయాన శాఖకు చెందుతారు.  బౌధ్ధాన్ని ప్రజలకు దగ్గర చేయాలి అని మహాయానం భావించి ఆచరణలో పెట్టింది.

శాతవాహన చక్రవర్తులు మహాయానాన్ని అభిమానించారు.  చిత్రకళలకు, శిల్పకళకు అపారమైన ప్రొత్సాహాన్ని  ఇచ్చారు. బౌధ్ధులలో విగ్రహారాధనకు, బుధ్ధుని ప్రతిమలను పూజించడమనే పధ్ధతికి ఇది దారి తీసింది.  హిందువులలో భక్తి తత్త్వం పెరగడానికి కూడా ప్రజానీకంలో మహాయాన బౌధ్ధం తీసుకొచ్చిన పరిణామలు కొంతలో కొంతగానైనా తోడ్పడ్డాయని పెద్దలు చెబుతారు.

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (6)

మనమిప్పుడు శాతవాహనుల పరిపాలనా కాలానికి (క్రి.పూ.225 – క్రి.శ.225)  చేరుకున్నాం..  శాతవాహనులు ఆంధ్రులు అని ప్రతీతి.  ఆంధ్రభృత్యులు అన్న పదంగూడా శాతవాహనుల గురించి వాడబడి కనిపిస్తుంది.  వేరే ప్రసిధ్ధి చెందిన రాజవంశానికి సామంతరాజులు అన్న అర్ధంలోనా లేక ఆంధ్ర రాజులకు సామంత రాజులు అన్న అర్ధంలో ఈ మాట వాడబడినదా అన్నది తెలుసుకోవడానికి సరియయిన అధారాలు లేవు. ఏదయినప్పటికీ, ఆంధ్ర రాజులకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని సంపాదించి పెట్టిన తొలి రాజవంశం శాతవాహన రాజ వంశం. పురాణాలలో కూడా ఈ రాజ వంశ ప్రసక్తి కనిపిస్తుంది.

జాతి పరంగా ఆంధ్రులైనా, వీరి రాజధాని మొదటలో ధాన్యకటకము (నేటి అమరావతి) అయిఉండి, తరువాత ప్రతిష్ఠానపురానికి (నేటి ‘పైఠన్’) మార్చబడింది.  ప్రాకృతం రాజ భాష.  శాతవాహనరాజులలో స్త్రీలు బౌధ్ధాన్ని అవలంబిస్తే, పురుషులు వైదికమతాన్ని అనుసరించారు.  అజంతా గుహాలయాలు వీరి కాలంలో నిర్మించబడ్డాయి.  అమరావతి ఆంధ్రుల కళా నైపుణ్యానికి ఒక మచ్చుతునక.  వీరి పరిపాలనా కాలంలోనే రెండు ముఖ్యమైన శకములు – విక్రమాదిత్య శకము క్రి.పూ.58  సంవత్సరములనుండి, శాలివాహన శకము క్రీస్తు తరువాత 78 సంవత్సరములనుండి లెక్కింపబడుతూ – ప్రచారములోకి వచ్చాయి. ఈ రాజ వంశంలో కడపటి చక్రవర్తి గౌతమీ పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ని.  ఈయన క్రీ.శ. 174 – 203 సం.ల మధ్య కాలంలో పరిపాలన సాగించాడు.  ఈయనకు సమకాలికుడు ఆచార్య నాగార్జునుడు. క్రీ.శ.180 సం.ల ప్రాంతంలో ఇప్పుడు నాగార్జునకొండ అని పిలవబడే అప్పటి శ్రీపర్వతమనే కొండమీద సంఘారామాన్ని నెలకొల్పి వందల కొలది బౌధ్ధ భిక్షువులకు విద్యాబొధనకు, జీవనానికి అనువైన సౌకర్యములను కల్పించిన వ్యక్తి ఆచార్య నాగార్జునుడు.

ఏదీ అకారణంగా జరగదు, అనేక కారణాల ఫలితంగా ఒక కార్యం ఏర్పడుతుంది అన్న కార్యకారణ సంబంధ సూత్రం బౌధ్ధానికి మూలం.  నాగార్జునుడు దీనిని అంగీకరుస్తూనే అంతకంటే మౌలికమయినది ఏది? అని ప్రశ్నించుకుని ప్రతిదీ మౌలికంగా నిస్స్వభావం గనుక శూన్యం అని సమాధానాన్ని రాబట్టాడు.  చాందొగ్యోపనిషత్తు తండ్రి కొడుకుల మధ్య సంభాషణ చివరలో ఎదురైన శూన్యాన్ని శూన్యంగా వదలక అక్కడ ఆత్మను, పరమాత్మను నిలబెట్టింది.  నాగార్జునుడు ఆ భావననే ఇంకొంత ముందుకు తీసుకువెళ్ళి ఆత్మ, పరమాత్మ అన్న ముసుగును తీసివేసి, శూన్యాన్ని శూన్యంగానే అంగీకరించమని చెప్పాడు.

శూన్యత్వమే అసలైన నిర్వాణమనీ, అది కారణ రహితమైన అస్తిత్వమనీ, అందులో అన్ని పరిణామాలూ సమత్వం పొందుతాయని నాగార్జునుని సిధ్ధాంతం.  ఇదే అతని శూన్యవాద సారాంశం.

ఆచార్య శంకరుని మాయా వాదానికి నాగార్జునుని శూన్య వాదమే ప్రాతిపదిక అయ్యిందని పెద్దలు చెబుతారు.

భారతీయ చింతన: వేదములు, ఉపనిషత్తులు, మరి కొన్ని సంగతులు (5)

జైన మతాన్ని ప్రారంభించిన వర్ధమాన మహావీరుడు క్రీ.పూ.599-527 సం.ల మధ్య కాలంలో జీవించాడు.  గౌతమ బుధ్ధుని కంటే చాల పెద్దవాడయినప్పటికీ కొంత కాలం సమకాలీకుడు.  బుధ్ధుని వలెనే ఇతడుకూడా క్షత్రియుడు.

బోధనలో బౌధ్ధం అనుసరించిన పధ్ధతినే జైనంకూడ అనుసరించింది.  వర్ణవ్యవస్థను, వేదాల ప్రామాణ్యాన్ని, యజ్ఞయాగాదులను ఖండించి అహింసను బోధించింది.  అయితే, బౌధ్ధానికి జైనానికి బేధమల్లా జైనం ఉపనిషత్తులు ముందుకు తెచ్చిన ఆత్మ భావనను నిరాకరించక పోవడంలో ఉంది.

స్థితి మౌలికమని ఉపనిషత్తులు చెప్పాయి.  గతి మౌలికమని బౌధ్ధులు చెప్పారు.  జైనులు ఈ రెండు భావనలనూ మిళితంచేసి పుట్టుక, నశింపు, శాశ్వతత్వం అనేవి వాస్తవికతలోని అంతర్భాగాలే అన్నారు. సైధ్ధాంతికంగా  ఇది బోలెడంత గందరగోళానికి దారితీసింది.  ఫలితంగా జైనం తాత్త్వికంగా చాలా బలహీనమైన శాఖ అయింది.

భారత దేశంలో ఉపనిషత్తులు ఒక రోజున ఒక తత్త్వవేత్త వ్రాసిన గ్రంధాలు కావు.  అనేకమంది తత్త్వవేత్తలు, ఉపనిషత్కర్తలు కొన్ని వందల సంవత్సరాలు చింతించి వ్రాస్తూ రాగా ఉద్భవించినవి. ఉపనిషత్తుల కాలం తరువాత చార్వాక, జైన, బౌధ్ధాలు కొంచెం అటుఇటుగా ఒకే కాలంలో ఉద్భవించిన తత్త్వ చింతనలు.  వర్ణవ్యవస్థను నిరాకరించి, జంతుహింసను ఖండించి, అహింసను బోధించడం వలన జనబాహుళ్యం ఆదరానికి పాత్రమై ఇవి ప్రజానీకంలో బహుళ వ్యాప్తిని పొందాయి.  అయితే, అహింసను జైనం అతిగా వర్తింప జేసిందన్నది సత్యం.  ఫలితంగా సమాజంలో రోజువారీ జీవనంలో వ్యవసాయదారుడు లాంటి మిగతా వృత్తి పనివారలకు ఆచరణయోగ్యం గాకుండా పోయింది.  వ్యాపారస్తులలో మాత్రమే ఎక్కువగా వ్యాపించింది.