తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (4)

తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (4)

ఆంధ్రులు ఆంధ్రులుగానే ఉండకుండా వారి రాజ వంశానికి పేరుగా సాతవాహన అనే పదాన్ని రూపకల్పన చేసుకున్నారు. ఏ అద్భుత క్షణాలలో ఈ పదరూపకల్పన
జరిగిందోగాని చరిత్రలో బహుళ ప్రసిధ్ధమై చిరస్థాయిగా ఈ పదం నిలిచిపోయింది. తరువాతి కాలంలో  ఈ పదం శాలివాహన, శాతవాహన గా రూపాంతరం కూడా
చెందింది. ఇందులోని శాలివాహన పదంతో ఒక శకం ప్రారంభం జరిగింది. తొలి, అసలురూపమైన సాతవాహన పదం మహారాష్ట్రీ ప్రాకృత పదం. మహారాష్ట్రీప్రాకృతం నుంచే నేటి మరాటీ పుట్టింది కాబట్టి, ఇప్పటి మరాటీ భాషలో ‘సాతవాహన’ పదానికి అర్ధం ఈ క్రింది విధంగా సూచించబడింది (ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి – చరిత్ర చర్చ):

“సాద – ఏడు Seven or Several
సాత – ప్రతిధ్వని An echo, a hollowing or calling to
సాతు – ధాన్యవిశేషము Barley
వాహ(ణేం) – ప్రవహించు, ప్రవహింపజేయు, విత్తనములు చల్లు (to sow), దున్ను, పండించు, వ్యవసాయము చేయు (to till)…”

పై అర్ధాలను బట్టి, సాతవాహన శబ్దసంపుటికి ‘ధాన్యమును పండించువాడు’ అని పూర్వ మహారాష్టీ ప్రాకృతంలో అర్ధం అని విదితమవుతుంది అన్నారు. ఈ సాతవాహన పదం సంస్కృతంలో శాలివాహన అన్న పదానికి సరిపోయేదిగా చెప్పబడింది.

“నూనూగు మీసాల నూత్న యౌవనమున – శాలివాహనసప్తశతి నుడివితి ” అని కాశీఖండంలో శ్రీనాథుడు పేర్కొన్నది. ఇక  శాతవాహన అన్న రూపం అర్వాచీన రూపం. ఆధునిక వ్యవహారంలోనే తప్ప, పురాణ రాజనామావళులలో గానీ, శాతవాహనుల శాసనాలలో గానీ, పరంపరాగతమైన ప్రసిధ్ధ వ్యవహారంలో గానీ ఈరూపం లేదని చెప్పారు. అందువలన, శాతవాహన శబ్దానికి ఆద్య రూపమైన సాతవాహన శబ్దం మహారాష్ట్రీ ప్రాకృతంలోనిది కాబట్టి, ఆంధ్రులైన శాతవాహనుల మాతృబాష కూడా మాహారాష్ట్రీ ప్రాకృతమన్నది అంగీకార యోగ్యమవుతుంది.తమచే నిర్మించబడిన రాజవంశానికి ఎవరూ తమది కాని పరాయి భాషలో నామకరణం చేసుకోరు కదా!సాతవాహన శబ్దం సూచించే అర్ధాన్ని బట్టి, శాతవాహనులు జాతిపరంగా ఆంధ్రులు, వృత్తిపరంగా ధాన్యమును పండించే కృషీవల కుటుంబులు అన్నది సాధకమవుతుంది. ప్రాకృతం అంటే మహారష్ట్రీ ప్రాకృతమే అన్న మాట కూడా మొదటినుంచీ వ్యవహారంలో ఉంది.

“ఊరినడుమ – గ్రామ మధ్య – గామామే”

శబ్దశాస్త్రం (Philology) లో అంతర్భాగమైన స్వరశాస్త్రం (Phonology) గురించి రాస్తూ, శ్రీమాన్ మేడేపల్లి వెంకటరమణాచార్యులుగారు వారి ‘ప్రాకృతభాషోత్పత్తి’ అనే పుస్తకంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణ పాఠం ఇది:

“ఊరినడుమ” అని చెప్పుటకు “గ్రామ”, “మధ్య” అను రెండు పదములుండవలెను. ఈ పదద్వయమును సమాసముగా చేసినచో “గ్రామమధ్య” అని యగును. యుక్తముగా నుచ్చరించుట కలవాటు లేనివాడు, అశిక్షితుడు, ప్రమాదముతో నుచ్చరించువాడు “మధ్య” కు “మజ్ఝ” యని కాని, “మద్దె” యని కాని పలుకును. మరల నీ శబ్ద రూపము “మాజ్ఝ” లేక “మాధ” యని మాఱి యంతతో నిలువక “మా” లేక “మహ” యయి కొనకు “మా” లేక “మే” యయినది. ఇట్లు “గ్రామమధ్య” శబ్దము “గామమా” లేక “గామమే” యని మాఱినది. గూర్జరీ, హిందీ, మరాటీ భాషలలో నిదియే రూపము.”

ఈ ఉదాహరణ తాత్పర్యం – సంస్కృతం నుండి ప్రాకృతం (తదితర భాషలు) పుట్టాయన్నది – ఇక్కడ సుగ్రాహ్యమే!అసలుకు, సంస్కృతం ముందా లేక ప్రాకృతం ముందా అన్నది చాలా పెద్ద చర్చకు సంబంధించిన విషయం. ఎన్నెన్నో వాదోపవాదాలు జరిగాయి. ఇరువైపుల వాదనలనూ ఉదాహరణ, ఉపపత్తులతో సహా ఒకింతగా సమీక్షించిన మీదట, శ్రీ పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారు తమ “ప్రాకృత గ్రంథకర్తలూ, ప్రజాసేవానూ” వ్యాసంలో (1933 వ సంవత్సరం డిశెంబరు నెల చివరివారంలో రాజమహేంద్రవరంలో మూడురోజుల పాటు జరిగిన గిడుగువారి సప్తతితమ జన్మదిన మహోత్సవ సభకు అధ్యక్షులుగా వ్యవహరించిన పంచాగ్నులవారు గిడుగువారికి సమర్పించిన అభినందన సంపుటమైన ‘వ్యాస సంగ్రహం’ లోనిది ఈ సుదీర్ఘ వ్యాసం) తేల్చినది – “వీటివల్ల తెలినది ఏమిటంటే – అన్నిభాసలకూ అసలు మాతృక ప్రాకృతమే అనీ, సంస్కృతాది భాషలు ఈ మాతృకకు పుత్రికలు అనీ.  ఇది పై సందర్భాల చర్చచేత తేలిన తాత్పర్యాంశం” అని. నాకయితే, ఈ తాత్పర్యాంశం నా పరిమిత బుధ్ధికి ఒకింత నేల విడిచి చేస్తున్న సాము లాగా అనిపించినా, ఈ విషయమై ఆ సంగతిని తగినవిధంగా విశదపరచగలిగేటంత పాండిత్యమూ, ప్రజ్ఞా ఏమాత్రమూ లేనివాడనవడం చేత, ఈ సంగతులన్నిటినీ విని (లేదంటే చదివి) ఊరకుండడమే క్షేమమని అనుకుంటూ ఉంటాను.

కనుక, సంస్కృతం, ప్రాకృతం – ఈ రెండు భాషలలో ఏది ముందు ఏది వెనక అయినప్పటికీ, ప్రాచీన భారతదేశంలో సంస్కృతం అనీ ప్రాకృతం అనీ రెండే భాషలుండేవి గాబట్టీ, ప్రాకృతం ప్రజల భాష కాబట్టీ, వృత్తి చేత కర్షకులైన ఆంధ్ర శాతవాహనుల భాష ప్రాకృతం అవడంలో అసందర్భమేమీ లేదు.

శ్లో. అయి రమణీయా రమణీయ,
సరఓ వి మణోహరో తుమం చ సాహీణో,
అణుకూల పరియణాయే,
మన్నే తం నత్థి జం ణత్థి.

తా కింపి పదోసవిణోదమేత్తనుహ అం మణహరుల్లావం,
సా హేయి అపువ్వకహం సురసం మహిళాయణమణోజ్జం.

కుతూహలుడనే కవి మహారాష్ట్రీ ప్రాకృతంలో వ్రాసిన లీలావతి కథ అనే కావ్యంలోనిది ఈ శ్లోకం. ఈ శ్లోకానికి అర్ధం:

అయి రమణీయా = రాత్రి రమణీయంగా ఉంది.
రమణీయ సరఓ వి మణోహరో = దానికి తగినట్లే శరత్కాలమూ మనోహరంగా ఉంది.
తుమం చ సాహీణో = (ప్రేమాస్పదుడవైన) నీవునూ (నాకు) స్వాధీనుడవై ఉన్నావు.
అణుకూల పరియణాయే = పరిజనులు కూడా అనుకూలురుగా వున్నారు.
మన్నే తం నత్థి జం ణత్థి = (అట్లాంటి) నాకు లేనిది లేదనే అనుకుంటాను.
తా కింపి = కనుకా, ఏదేనా
పదోస విణోదమేత్త సుహ అం = ఈ ప్రదోషకాలాపువినోదానికి తగినట్టిదిగాను
మణహరుల్లాసం = మనసుకు ఉలాసాన్ని కలిగించేదిగానూ (అయినట్టి)
అపువ్వకహం = అపూర్వమైన (ఇంతకు ముందు ఎవ్వరూ చెప్పి ఉండనట్టిది)
సురసం = చక్కని రసం జాలువారే దాన్ని
మహిళాయణ మణోజ్జం = మహిళాజనానికి ఇంపుగొలిపేది (అయినట్టి కథను)
సా హేయి = సాధించండి (అంటే చెప్పండి అని ఒక ప్రియురాలు ప్రియునితో అంది).

పంచాగ్నుల ఆదినారాయణ్శాస్త్రిగారు తమ “ప్రాకృతగ్రంథకర్తలూ, ప్రజాసేవానూ” వ్యాసంలో చెప్పిన అర్ధాన్ని పై అర్ధవివరణకి అధారంగా తీసుకుని చెప్పడం జరిగింది. ఈ వ్యాసంలోనే సందర్భవశాన ఈ లీలావతి కథ గురించి వారు చెప్పిన విషయాలు ఇవి:

“ప్రాకృతవాఙ్మయంలో లీలావతి కథకు అగ్రస్థానం ఇస్తారు. ఆంధ్రులమైన మనం తప్పకుండా ఇయ్యాలి. ఏమంటే – అది ఆంధ్రదేశమునకు సంబంధించిన వక చారిత్రక కథ అనీ, అందులో ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలు వర్ణింపబడ్డాయనీ శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు చాలారోజులక్రింద భారతిలో 2,3 వ్యాసాలు ప్రకటించారు.  గ్రంథం కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు.  ఆంధ్రులు ఆయనచేత త్వరలో ఆ గ్రంథం ప్రకటిత మయ్యేట్టు యత్నించాలి.”

మరి ఈ గ్రంథం ప్రకటితమయిందా? అంటే నాకు తెలిసినంతలో లేదు. శ్రీ మానవల్లివారు సేకరించిన ఈ గ్రంథం ప్రతి ఏమయిందో తెలీదు. కనీసం భారతిలో వ్యాసాలన్నా చూద్దామంటే, ఇప్పటివరకూ యత్నించినంతలో నాకు దొరకలేదు,ఇంకా వెదకడానికి కుదరడంలేదు. ఆయన సేకరించిన గ్రంథప్రతి ఇప్పుడు లభ్యమవుతూందా? అంటే సందేహమే! అయినా ప్రయత్నించేవారెవరు? ఆయన చెప్పినట్లు, అందులో వర్ణించబడిన అప్పటి ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలకు సంబంధించిన సమాచారం,ఇంకా పైన ఉదాహరించిన శ్లోకంలో వంటి సహజమైన, మనోహరమైన వర్ణనలూ, తెలుగులో చదువుకోవడానికి వీలయేట్లుగా పరిష్కరించబడి ఉన్నది కాలగర్భంలో కలిసిపోయిందనే అనుకోవాలా?!

***

కవిగారు (మానవల్లివారు “కవిగారు” గా ఆంధ్ర సాహిత్యలోకంలో ప్రసిధ్ధులు) సంపాదించి ముద్రించలేక పోయిన ఈ  లీలావతి కథ   కావ్యాన్ని తలుచుకున్నప్పుడల్లా,  నాకు విశాఖపట్నంలో కవిగారు (మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు) అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిన నుడికడలి   అచ్చతెనుగు పదాల నిఘంటువు గుర్తొసుంది. ఈ అముద్రిత అసంపూర్తి నిఘంటువు ప్రస్తావన శ్రీశ్రీ గారి   అనంతం ,  అబ్బూరి వరదరాజేశ్వరరావుగారి  కవనకుతూహలం  ఇత్యాది పుస్తకాల్లో వస్తుంది. అసంపూర్తిగానైనా ఈ అచ్చతెనుగు పదాల నిఘంటువుని సంపాదించి ప్రచురిస్తే భాషకు సంబంధించినది కాబట్టి ఎప్పటికైనా ఉపయోగం అనిపిస్తుంది.  ఇలాంటివే ఇంకా ఎన్నెన్నో మంచి పుస్తకాలు. ముఖ్యంగా టేకుమళ్ళ కామేశ్వరరావుగారి   నా వాఙ్మయ మిత్రులు  పుస్తకం చదువుతున్నప్పుడు ప్రస్తావన కొచ్చి అబ్బురపరిచేవి. అముద్రితాలుగా మిగిలిపోయినవీ, ఇప్పుడు అలభ్యం కాటగిరీ లోకి వెళ్ళిపోయినవీ ఎన్నెన్నో పుస్తకాలు! ఆంధ్రపత్రిక వారి ఆధ్వర్యంలో వెలువడిన  భారతి   మాసపత్రిక గురించి వేరే చెప్పక్కరలేదు! అందులో ప్రచురితాలైన చరిత్ర, సాహిత్య సంబంధ వ్యాసాలలో అత్యుత్తమైన వాటిని ఏరి ఒకటి రెండు సంపుటాలుగా నన్నా ప్రచురిస్తే బాగుంటుందని ఆలోచన! వీటిల్లో ఏ ఒకటిరెండు సాధించగలిగినా  జన్మ ధన్యమైనట్లుగా అనిపిస్తుంది. సమయం, శక్తి, డబ్బు వీలుచిక్కినంతలో వీటికోసం ఖర్చుపెట్టడం ఉపయోగం అని ఎప్పటినించో ఉన్నా,  అమలుపరుచుకోవాలని ఈ మధ్యనే తీసుకున్న నిర్ణయం!

కనుక, ఈ బ్లాగుకు ఇది ఆఖరి పోస్టు. This blog may now be treated as closed for all purposes!

ధన్యవాదాలు!

సెలవు!

10 thoughts on “తొలి వెయ్యేళ్ళు : ప్రాకృతం రోజులు (4)

  1. Rao garu,
    It is a great disappointment if you stop this blog. We are greatly excited read every post in this blog. Mi niece Tamma Uma Kanti had meticulously copied a Nighamtu which was in a dilapidated state almost 20 years back. I am sure she must be having it with her. She is presently working as a Teacher in Vizianagaram District.

    My sincere appeal to you is please reverse your decision to close this blog. your blog has set very high standards in setting studied neutrality when it comes to commenting on matters of dispute. That intellectual neuatrality is required and you can inculcate that scientific temper in youngsters. Kindly continue writing this blog.
    with very best regards,
    NS murty

    • మూర్తి గారూ, ధన్యవాదాలు! మీరు తెలియజేసిన సంగతికి కూడా ధన్యవాదాలు! మీ ‘అనువాదలహరి’ బ్లాగు ద్వారా, మీతో touch లో ఉంటాను! కారణాలు చెప్పలేను గాని, ఈ బ్లాగు మాత్రం ఇక్కడితో close అయినట్లే! మన్నించగలరని ఆశిస్తూ…నమస్కారాలతో…
      వెంకట్.బి.రావు.

  2. వెంకట్.బి.రావు గారు నమస్తే.. ఈ లేఖని కామెంట్ spaceలో post చేస్తునందుకు మన్నించండి.

    మీరు చివరగా రాసిన టపా నేను చదివిన మొదటిది కావడం నా దురదృష్టం. ఆంధ్రుల గురించి మీకున్నది specialized knoeledgeకాదని మీరన్న అది అపారమని తోస్తున్నది. భాష చందస్సుల గురించి రాసిన informative టపాలేవి ఇంతకుముందు నేను చదవనందుకు చింతిస్తున్నాను. మీ ఫోటోగ్రఫిని చూసి కూడా ఆనందించాను.
    బ్లాగు close చెయ్యడానికి మీకున్న కారణాల పూర్తిగా నాకు తెలీదుగాని, అవి రెండో పరిష్కారం ఏదన్న ఉన్నవే అయితే తప్పక బ్లాగుని కొనసాగించమని ప్రార్ధన.

    మీ ఆలోచన బాగుంది.తప్పక నెరవాలని,ఆచరణలో అన్ని కలిసిరావాలని మనస్పూర్తిగా కోరుకుంటు..

    -నందకిషోర్.

    • Kalageeta గారు, మీ అభినందనలకూ, మీరు మీ వ్యాఖ్యలో వ్రాసిన అంతటికీ ఎంతగానో ధన్యవాదాలు!
      కానీ….ఈ బ్లాగు మాత్రం ఇక్కడితో close అయినట్లే! సెలవు!

  3. వెంకట్ గారూ
    బ్లాగు మూసేయడమేమిటండీ? ఇన్ని చక్కని విషయాలను పరిచయం చేసే మీరు మూసేస్తే ఎలా? దయచేసి ఆపకండి. అప్పుడపుడు వీలున్నప్పుడే వ్రాయండి.

  4. రసజ్ఞ, ధన్యవాదాలు! ఈ ‘అన్వీక్షణం’ బ్లాగు బహుశః ఇక కొనసాగదు. నేను ఏకొంతైనా వ్రాయగలిగే, వ్రాయడానికి ఇష్టపడే విషయాలైన పుస్తకాలు, ఫొటోగ్రఫీ లకే పరిమితం చేసుకుని ఒక కొత్త బ్లాగు మొదలు పెట్టాను. పేరు ‘పుస్తకం-పఠనం’; రెండువారాలుగా ఆ బ్లాగు active గా వుంది.
    ధన్యవాదాలు!

  5. మిత్రులు వెంకట్ గారు,
    మనం ఒక సందర్భంలో మూగనోము పాట గురించి చర్చించాము. అదెక్కడో మీ బ్లాగులో నాకు దొరకలేదు కాని, నా దగ్గర ఒక పుస్తకం బాలాంత్రపు రజనీకాంత రావు గారి తండ్రి గారు వేంకటరావు గారు రాసిన స్త్రీల వ్రతకధలు పుస్తకంలో ఉన్న పాట ఇస్తున్నా చూడండి. ఈ పుస్తకం నా దగ్గరుంది.

    మోచేటి పద్మంబు పట్టేటివేళ-మొగ్గల తామర్లు పూసేటి వేళ.
    కాకరపువ్వుల్లు పూసేటివేళ- కడవలతో నుదకమ్ము తెచ్చేటివేళ
    ఆనపా పువ్వుల్లు పూసేటి వేళ-అటికలతో నుదకమ్ము తెచ్చేటివేళ.
    గుమ్మడి పువ్వుల్లు పూసేటివేళ-గుండిగలతొ నుదకమ్ము తెచ్చేటివేళ.
    బీరపువ్వుల్లు చాల పూసేటి వేళ- బిందెలతొ నుదకమ్ము తెచ్చేటివేళ
    సంధివేళ దీపము పెట్టేటి వేళ-చాకలి మడతలు తెచ్చేటి వేళ.
    ఆవులూ గోవులూ వచ్చేటి వేళ-ఆంబోతుల్లు రంకెలూ వేసేటి వేళ.
    అన్నలూ అందనాలెక్కేటి వేళ-తమ్ములూ తాంబూలం వేసేటి వేళ.
    మరదుళ్ళు మరిజూదమాడేటి వేళ-కూతుళ్ళు గుండిగలు దింపేటి వేళ.
    బావలూ పల్లకీ లెక్కేటి వేళ- మరుదులూ మరిజూదమాడేటి వేళ.
    కోడళ్ళు కొట్టు పసుపు కొట్టేటి వేళ-చెల్లెళ్ళు చేమంతు ముడిచేటి వేళ.

    పై పాట పూర్తి పాఠం నా దగ్గరున్న పుస్తకంలో ఉంది. ఇది యాధృచ్చికంగా నా కంటపడిందీ వేళ. బ్లాగు మూసేసినా ఇది ఉపయోగకరమైనది కనక ఇక్కడ పెట్టేను. చూడగలరు.

    మరొక సంగతి ఈ నోము సాయంత్రం వేళ పడతారని ఉంది.

  6. ధన్యవాదాలు శర్మగారూ…జ్ఞాపకం పెట్టుకుని, శ్రమకోర్చి మీ దగ్గర పుస్తకంలోని పూజ్యులు బాలాంత్రపు వేంకటరావు గారు సూచించిన ఈ మోచేటి పద్మం నోము కు సంబంధించిన ఈ పాట పాఠాన్ని ఇక్కడ పెట్టినందుకు!

    ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి తమ పుస్తకం ‘ఆంధ్రుల చరిత్ర సంస్కృతి’ లో ఇచ్చిన ఈ ‘మోచేటి పద్మం’ నోము కు సంబంధించి పాట పాఠం, తదితర సంగతులతో ఉన్న పోస్టు ఈ బ్లాగులో ‘తెలుగు మాట, పాట, పద్యం (6) వద్ద ఉంది.

    మరోసారి ధన్యవాదాలు!

వ్యాఖ్యానించండి